నిరుద్యోగులకు శుభవార్త: 1500 బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్. లేట్ చేస్తే మిస్సవుతారు
బ్యాంకులో జాబ్ సంపాదించాలని ప్రిపేర్ అవుతున్న వారందరికీ గుడ్ న్యూస్. ఓ ప్రభుత్వ రంగ బ్యాంకు ఏకంగా 1500 ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ఇచ్చిన బ్యాంకు వివరాలు, ఎక్కడెక్కడ ఎన్నెన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇలాంటి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
భారతదేశంలో ఒక ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Union Bank of India) ఒకటి. ఇది 1919లో స్థాపించారు. ప్రస్తుతం భారత ప్రభుత్వంలో పనిచేస్తున్న ముఖ్యమైన బ్యాంకుగా యూబీఐ కొనసాగుతోంది. ఈ బ్యాంక్ వినియోగదారులకు రిటైల్ బ్యాంకింగ్, కార్పొరేట్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి పలు సేవలను అందిస్తుంది. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. 1969లో భారత ప్రభుత్వం ఈ బ్యాంకును జాతీయీకరించి ప్రభుత్వ రంగ బ్యాంక్‌గా మార్చింది. 2020లో ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ లను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేశారు. దీన వల్ల బ్యాంక్ ఖాతాదారుల సంఖ్య మరింత పెరిగింది.
విద్యార్థుల కోసం ప్రత్యేక విద్యా రుణాలు, కార్లు, ద్విచక్ర వాహనాలకు రుణాలు, హౌసింగ్ లోన్స్, వ్యక్తిగత అవసరాలకు రుణాలు, ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లు, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్, సెక్యూరిటీస్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇలా అనేక రకాలుగా బ్యాంకు వినియోగదారులకు సేవలు అందిస్తోంది.
ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ డిజిటలైజేషన్ పై ఎక్కువ దృష్టి పెట్టింది. ఖాతాదారులకు సులభంగా సేవలు అందించడానికి కొత్త టెక్నాలజీ, సురక్షిత పద్ధతుల ద్వారా సేవలు అందిస్తోంది. దీనిలో ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ ట్రాన్సాక్షన్స్ వంటి సేవలు ఉన్నాయి.
యూనియన్ బ్యాంక్ ఇండియాలో అనేక శాఖలు, ATMలను కలిగి ఉంది. 2020లో ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌ల విలీనం వల్ల యూనియన్ బ్యాంక్ విస్తరణ మరింత పెరిగింది.
Union Bank of India నుంచి రిలీజ్ అయిన ఉద్యోగ నోటిఫికేషన్ లో అభ్యర్థులకు ఉండవలసిన అర్హతలు, విద్య, వయసు పరిమితి విషయాలు ఇలా ఉన్నాయి.
ఖాళీలు
మొత్తం 1,500 ఖాళీలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 200 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వేతనం చెల్లిస్తారు.
వయో పరిమితి
దరఖాస్తుకు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం BC, MBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఇచ్చారు. అదే దివ్యాంగులకు 10 సంవత్సరాలకు వయో సడలింపుకు అవకాశం ఇచ్చారు.
విద్యార్హత
అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు చేసుకునే వారు కచ్చితంగా రాష్ట్ర అధికార భాషలో చదవడం, రాయడం వచ్చి ఉండాలి. అభ్యర్థులు ఆన్‌లైన్ లో రాత పరీక్ష రాయాల్సి ఉంటుంది. అందులో సెలెక్ట్ అయిన వారిని ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. పరీక్ష తేదీ, హాల్ టికెట్ వంటి వివరాలను బ్యాంకు అధికారులు ఈ-మెయిల్ ద్వారా పంపుతారు.