PV Sindhu: సెమీస్ గండం దాటని సింధు.. ఇండోనేషియా ఓపెన్ లోనూ తప్పని ఓటమి..
Indonesia Open: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కు మరో పరాభావం. రెండేండ్లుగా ఒక్క టోర్నీ కూడా నెగ్గని తెలుగు తేజం.. ఒలింపిక్స్ తర్వాత వరుసగా మూడో సెమీస్ ఓటమి చవిచూసింది.
డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరోసారి ఓటమిపాలైంది. మేజర్ టోర్నీలలో సెమీస్ గండాన్ని దాటలేక చతికిలపడుతున్న ఆమె.. ఇండోనేషియా టోర్నీలో కూడా దారుణంగా ఓడింది.
ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ 750 టైటిల్ పై కన్నేసిన మూడో సీడ్ సింధు.. సెమీస్ లో రెండో సీడ్ ఇంతానన్ రచనోక్ (థాయ్లాండ్) చేతిలో ఓడింది. మహిళల సింగిల్స్ లో భాగంగా శనివారం జరిగిన సెమీఫైనల్లో సింధు.. 21-15, 9-21, 14-21 తేడాతో రచనోక్ చేతిలో ఓడింది.
తొలి సెట్ గెలుచుకున్న సింధు.. విజయం తనదే అనుకుంది. కానీ ఇదే సమయంలో రచనోక్ అద్భుతంగా పుంజుకుంది. వరుసగా రెండు సెట్లు గెలిచి సింధుకు నిరాశను మిగిల్చింది. ఒలింపిక్స్ తర్వాత సింధుకు ఇది వరుసగా మూడో ఓటమి.
కాగా.. 2019 స్విట్జర్లాండ్ ప్రపంచ ఛాంపియన్షిష్ లో విజేతగా నిలిచిన తర్వాత సింధు మళ్లీ టైటిల్ నెగ్గలేదు. ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యమే సింధుకు మేజర్ టైటిల్. ఆ తర్వాత మూడు టోర్నీలలో (డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, ఇండోనేషియా) సింధు ఓటమి పాలైంది.
ఈ ఏడాది ఆరంభంలో స్విస్ ఓపెన్ లో ఫైనల్ చేరినా టైటిల్ నెగ్గలేకపోయిన సింధు.. ఆ తర్వాత కూడా మేజర్ టోర్నీలలో సెమీస్ గండం దాటలేపోతున్నది.
ఇక ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ 750 టోర్నీలో తొలి మ్యాచ్ లో ఒహోరి (జపాన్), లి (జర్మనీ), యుజిన్ (కొరియా) లపై నెగ్గి సెమీస్ చేరిన సింధు.. ఫైనల్ మెట్టుకు ముందు పరాజయం పాలైంది.