Flex Fuel అంటే ఏంటి? ఈ కొత్త ఫ్యూయల్ తో లాభాలు, నష్టాలు ఇవే!
Flex Fuel: భారత్ తన ఇంధన అవసరాల్లో పెద్దమొత్తంలో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఈ భారం తగ్గించడంతో పాటు వాహనాల కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఫ్లెక్స్ ఫ్యూయల్ ను తీసుకొచ్చింది. ఫ్లెక్స్ ఫ్యూయల్ కలిగే లాభనష్టాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఫ్లెక్స్ ఫ్యూయల్ అంటే ఏంటో తెలుసా? పెట్రోల్ ఖర్చులు తగ్గుతాయా, మైలేజ్ పడిపోతుందా?
భారతదేశంలో ప్రతిరోజూ కోట్ల సంఖ్యలో వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి. ప్రతి నెల లక్షలాది కొత్త వాహనాలు వీటికి తోడవుతున్నాయి. దీనివల్ల దేశంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. ఈ పెరిగిపోతున్న కాలుష్య సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆటోమొబైల్ రంగాలు ఇప్పుడు సరికొత్త ఇంధన సాంకేతికతను రంగంలోకి దించుతున్నాయి. అదే 'ఫ్లెక్స్ ఫ్యూయల్' (Flex Fuel). ఈ కొత్త ఇంధనం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి? దీనివల్ల ఏవైనా నష్టాలు ఉన్నాయా? అనే పూర్తి వివరాలు గమనిస్తే..
ఫ్లెక్స్ ఫ్యూయల్ అంటే ఏంటి? ఎలా పనిచేస్తుంది?
ఫ్లెక్స్ ఫ్యూయల్ అంటే మరేదో కాదు, దీనిని ‘ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్’ అని పిలుస్తారు. ఇది పెట్రోల్, ఇథనాల్ లేదా మిథనాల్ మిశ్రమంతో తయారవుతుంది. ఈ ఇంధనంతో నడిచే వాహనాలలో ప్రత్యేకమైన ఇంటర్నల్ కంబషన్ ఇంజన్లు ఉంటాయి.
ఇవి ఒకటి కంటే ఎక్కువ ఇంధనాలతో నడవడానికి సపోర్ట్ చేస్తాయి. సాధారణంగా ఇందులో 85% ఇథనాల్, 15% పెట్రోల్ (E85) లేదా ఇతర నిష్పత్తుల మిశ్రమాన్ని వాడుతుంటారు. ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల్లో అధునాతన సెన్సార్లు, ఇంజన్ కంట్రోల్ మోడ్యూల్ ఉంటాయి.
ట్యాంకులో ఇంధనం ఏ నిష్పత్తిలో ఉందో ఈ సెన్సార్లు గుర్తించి, దానికి తగ్గట్టుగా ఇంజన్ పనితీరును, ఎయిర్-ఫ్యూయల్ మిశ్రమాన్ని ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేస్తాయి. బై-ఫ్యూయల్ వాహనాల్లా వీటికి వేర్వేరు ట్యాంకులు ఉండవు. ఒకే ట్యాంకులో ఏ మిశ్రమాన్నైనా పోసుకోవచ్చు. ప్రస్తుతం దేశంలోని పెట్రోల్ బంకుల్లో 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20) లభిస్తోంది. దీనిని భవిష్యత్తులో 85 నుంచి 100 శాతానికి (E100) పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
జూన్ మొదటి వారంలోనే కొత్త వాహనాల లాంచ్
కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇప్పటికే వాహన తయారీ సంస్థలను ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్లను తయారు చేయాలని కోరారు. దీనికి అనుగుణంగానే ప్రముఖ కంపెనీలు తమ వాహనాలను మార్కెట్లోకి తెస్తున్నాయి. హీరో మోటోకార్ప్ కంపెనీ జూన్ 3వ తేదీన ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీతో కూడిన తన సరికొత్త వాహనాలను లాంచ్ చేయబోతోంది.
అలాగే, జూన్ 4వ తేదీన మారుతి సుజుకి కంపెనీ కూడా ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీతో నడిచే తన కొత్త కారును మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధమైంది.
పర్యావరణానికి మేలు.. రైతులకు లాభాలు
ఫ్లెక్స్ ఫ్యూయల్ వాడకం వల్ల దేశానికి, సాధారణ ప్రజలకు చాలా లాభాలు ఉన్నాయి. మొదటిది, వాహనాల నుంచి వచ్చే హానికరమైన కాలుష్యం భారీగా తగ్గుతుంది. ఇథనాల్ స్వచ్ఛమైన ఇంధనం కావడం వల్ల గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలు తగ్గుతాయి.
రెండవది, మనం విదేశాల నుంచి కొనే ముడి చమురు భారం తగ్గుతుంది. దీనివల్ల దేశానికి కోట్ల డాలర్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. మూడవది, ఇథనాల్‌ను చెరుకు రసం, మొక్కజొన్న వంటి వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారు చేస్తారు. కాబట్టి దీనివల్ల రైతులకు నేరుగా ఆర్థిక లాభం చేకూరుతుంది. నాలుగవది, ఈ ఇంధనం పెద్ద ఎత్తున అందుబాటులోకి వస్తే దీని తయారీ ఖర్చు తగ్గి, పెట్రోల్ కంటే తక్కువ ధరకే లభిస్తుంది. దీనివల్ల సామాన్యుడి జేబుకు భారం తగ్గుతుంది. అంతేకాదు, సిఎన్‌జి వాహనాల కంటే ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు మెరుగైన హార్స్‌పవర్, టార్క్‌ను అందిస్తాయి.
మైలేజ్ తగ్గుతుందా? ఇందులో ఉన్న నష్టాలు ఇవే
ఈ టెక్నాలజీలో ఎన్ని లాభాలు ఉన్నాయో, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఫ్లెక్స్ ఫ్యూయల్ వల్ల వాహనం మైలేజ్ 15 నుంచి 20 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్‌లో ఎనర్జీ డెన్సిటీ తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఎక్కువ ఇంధనం ఖర్చవుతుంది.
రెండవది, ఇథనాల్ వల్ల ఇంజన్‌పై ఒత్తిడి పడి పైపులు, రబ్బర్ సీల్స్ వంటి భాగాలు త్వరగా పాడైపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల మెయింటెనెన్స్ ఖర్చు పెరుగుతుంది. మూడవది, ఈ కొత్త టెక్నాలజీని వాడటం వల్ల ప్రారంభంలో ఈ వాహనాల ధరలు సాధారణ వాహనాల కంటే కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే, దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ ఇంధనాన్ని అందుబాటులోకి తీసుకురావడం పెద్ద మౌలిక సదుపాయాల సవాలు కానుంది. ఈ ఇంధనం పూర్తిగా అందుబాటులోకి రావడానికి మరికొన్ని నెలల సమయం పట్టవచ్చు.

