ఉద్యోగులకు అండగా ఆనంద్ మహీంద్ర కీలక నిర్ణయం.. వాక్సినేషన్ ఖర్చుతో పాటు ఆర్ధిక సహాయం ప్రకటన..
కరోనా వైరస్ సవాళ్లను ఎదుర్కోవటానికి వాక్సినేషన్ క్యాంప్స్, ఆర్థిక, వైద్య సహాయం వంటి వివిధ చర్యల ద్వారా దేశంలోని చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు సహాయం చేస్తున్నాయి.
అంతేకాకుండా దేశంలో కోవిడ్-19 మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా కంపెనీలు ఉద్యోగులకు రుణాలు, భీమా, సెలవులకు సంబంధించిన నియమాలను మారుస్తూ చేయూతనిస్తున్నాయి, తద్వారా ఉద్యోగులకు వారి కుటుంబాలకు ఎటువంటి ఆందోళన లేకుండా అండగా ఉంటున్నాయి. ఇప్పుడు దేశీయా దిగ్గజ ఆటో కంపెనీ మహీంద్రా & మహీంద్రా కూడా డీలర్లందరికీ వాక్సినేషన్ వేసే ఖర్చును భరించాలని నిర్ణయించింది.
లక్ష రూపాయల బీమా ప్రయోజనం
మార్చి 2022 నాటికి ప్రతి ఉద్యోగిపై వ్యాక్సిన్ రెండు మోతాదుల ఖర్చు కంపెనీ భరిస్తుంది. ఇందుకు ఒక వ్యక్తికి రూ.1500 రీయింబర్స్‌మెంట్ చేయబడుతుంది. ఇది మాత్రమే కాదు ఉద్యోగుల కరోనా చికిత్స కోసం ఒక లక్ష రూపాయల వైద్య బీమాను కూడా కంపెనీ ప్రకటించింది.
కరోనాతో ఉద్యోగి మరణిస్తే
ఒకవేళ ఏదైనా సందర్భంలో కరోనాతో ఉద్యోగి మరణిస్తే అతని కుటుంబానికి రూ .2.5 లక్షల సహాయం కూడా ప్రకటించారు. మహీంద్రా & మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఈ విషయాన్ని స్వయంగా ట్వీట్ చేయడం ద్వారా ధృవీకరించారు. మా డీలర్లు మా కుటుంబంలో భాగమని మేము చెప్పింది కూడా నిరూపించుకోవాలి అని అన్నారు.
ఇతర సంస్థల సహాయం
ఇంతకుముందు హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ కూడా ఉద్యోగులకు 'డాక్టర్ ఆన్ కాల్, కోవిడ్ -19 టీకా సౌకర్యం, మెడిక్లైమ్ ఇ-కార్డ్, హాస్పిటలైజేషన్ సౌకర్యం వంటి చర్యలు తీసుకుంది. ఎంచుకున్న నగరాల్లో 'ఆక్సిజన్ కాన్సంట్రేటర్' సౌకర్యం కూడా అందుబాటులోకి తేచ్చింది. కన్సల్టింగ్ అండ్ టెక్నాలజీ సంస్థ క్యాప్ జెమిని కేంద్రీకృత ఆల్ ఇండియా కమాండ్ సెంటర్‌ను రూపొందించింది. దీని ద్వారా సంస్థ ఉద్యోగులకు అత్యవసర పరిస్థితుల్లో వైద్య సహాయం చేస్తోంది. అంతేకాకుండా బెడ్స్, ఐసియులు, వెంటిలేటర్లు, అంబులెన్స్ సేవలు, బ్లడ్ ప్లాస్మా దాతలు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్, మందులు సంబంధించిన వాటికి సహకరిస్తోంది. జేఎస్‌డబల్యూ కూడా ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల టీకాల ఖర్చును భరిస్తుంది.