సింగిల్ చార్జ్ పై 480కి.మీ మైలేజ్ తో జాగ్వార్ లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వచ్చేసింది.. ధర, ఫీచర్స్ తెలుసుకోండి
లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ నుండి ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ జాగ్వార్ ఐ-పేస్ ను మంగళవారం భారత్‌లో విడుదల చేసింది. మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి తర్వాత ఇండియాలో విడుదల చేసిన రెండవ లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈ జాగ్వార్ ఐ-పేస్.
అంతేకాదు జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా నుండి వస్తున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్ కూడా. జెఎల్‌ఆర్ ఇండియా నవంబర్ 2020 నుండి జాగ్వార్ ఐ-పేస్ బుకింగులను కూడా ప్రారంభించింది.
జాగ్వార్ ఐ-పేస్ దేశంలోని ప్రముఖ ఆటో తయారీ సంస్థ టాటా మోటార్స్ యాజమాన్యంలోని బ్రిటిష్ కంపెనీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ ప్రధాన ఉత్పత్తులలో ఒకటి. ఈ ఎస్‌యూవీ 2019 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్, వరల్డ్ కార్ డిజైన్ ఆఫ్ ది ఇయర్, వరల్డ్ గ్రీన్ కార్‌తో సహా పలు అవార్డులను గెలుచుకుంది. అదనంగా, జాగ్వార్ ఐ-పేస్ మూడు ప్రపంచ కార్ టైటిళ్లను ఒకేసారి గెలుచుకున్న మొదటి కారుగా నిలిచింది.
శక్తివంతమైన బ్యాటరీ
జాగ్వార్ ఐ-పేస్ లో 90kWh లిథియం అయాన్ బ్యాటరీని అందించారు. 100 కిలోవాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ యూనిట్ సహాయంతో కేవలం 45 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. 7kWh AC వాల్ బాక్స్ ఛార్జర్ తో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 10 గంటలు పడుతుంది. ఈ కారు ఒక ఫుల్ ఛార్జింగ్‌తో 480 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని జాగ్వార్ ల్యాండ్ రోవర్ పేర్కొంది.
జాగ్వార్ ఐ-పేస్ లో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి. ఒకటి 395 బిహెచ్‌పి శక్తిని, మరొకటి 696 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. జాగ్వార్ ఐ-పేస్ కేవలం 4.8 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి ఏడబల్యూడి (ఆల్ వీల్ డ్రైవ్) సిస్టం లభిస్తుంది.
డిజైన్ పరంగా, జాగ్వార్ కారు లోని జాగ్వార్ ఐ-పేస్ డిజైన్ అంశాలను చూడవచ్చు. దీనికి జాగ్వార్ సిగ్నేచర్ గ్రిల్, ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లు లభిస్తాయి. అంతే కాకుండా మ్యాట్రిక్స్ టెక్నాలజీ హెడ్‌ల్యాంప్స్‌లో వస్తాయి. ఇది అధిక ట్రాఫిక్‌లో కూడా డ్రైవర్‌కి సులభంగా కనిపించేలా చేస్తుంది. కారు వెనుక భాగంలో ఎల్‌ఈడీ టెయిల్ లాంప్స్, కూపే స్టైల్ రూఫ్‌లైన్ అందించారు.
జాగ్వార్ ఐ-పేస్ క్యాబిన్ లో తాజా పివి ప్రో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది, ఇది చాలా ఫ్యూచరిస్టిక్ గా కనిపిస్తుంది. 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉంది, ఇంకా ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. జాగ్వార్ ఐ-పేస్ క్యాబిన్ లోపల లభించే అద్భుతమైన ఫీచర్స్ లో 16-స్పీకర్ 380 వాట్ల మెరిడియన్ 3డి సరౌండ్ ఆడియో సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, పిఎమ్ 2.5 ఎయిర్ ఫిల్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, 8-వే అడ్జస్ట్ చేయగల సెమీ-పవర్డ్ లక్స్టెక్ స్పోర్ట్ సీట్, ఇంటరాక్టివ్ డ్రైవర్ డిస్ ప్లే, 3డి సోలార్ కెమెరా, డ్రైవర్ కండిషన్ మానిటర్, హెడ్-అప్ డిస్ ప్లే, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు చేర్చారు.
భద్రతా లక్షణాలు
భద్రత పరంగా ఈ కారులో 6-ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్, ఇఎస్‌సి, ఎమర్జెన్సీ బ్రేక్ అసిస్ట్, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, 360-డిగ్రీ కెమెరా వంటి భద్రతా ఫీచర్స్ ఉన్నాయి.
ధర
ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ జాగ్వార్ ఐ-పేస్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ .1.12కోట్ల నుండి రూ .1.66 కోట్ల వరకు ఉంటుంది. ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కొనుగోలుదారులకు ఆఫీసు, హోమ్ బ్యాటరీ ఛార్జింగ్ సదుపాయాలను కల్పించడానికి టాటా పవర్‌తో కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది.
బ్యాటరీకి 8 సంవత్సరాలు లేదా 160,000 కి.మీ వారంటీ లభిస్తుంది. ఐ-పేస్ యజమానులు 5 సంవత్సరాల జాగ్వార్ రోడ్‌సైడ్ ఆసిస్టన్స్, కాంప్లిమెంటరీ 5 సంవత్సరాల సర్వీస్ ప్యాకేజీని కూడా పొందుతారు. ఐ-పేస్ మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి రాబోయే ఆడి ఇ-ట్రోన్ లతో పోటీ పడనుంది.