చిన్న ఫ్యామిలీ కోసం ఫంకీ లుక్‌తో హ్యుందాయ్ మినీ ఎస్‌యూవీ.. ఫీచర్స్, ధర తెలుసుకోండి
దక్షిణ కొరియా దిగ్గజం హ్యుందాయ్ కొత్త ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేయబోతోంది. ఈ క్రాస్ఓవర్ మైక్రో ఎస్‌యూవీని కంపెనీ భారతీయ రోడ్లపై చాలా కాలంగా పరీక్షిస్తోంది. ఈ మైక్రో ఎస్‌యూవీకి ఎఎక్స్ 1 అనే కోడ్ నేమ్ కూడా కంపెనీ ఇచ్చింది.
హ్యుందాయ్ ఈ కొత్త కారు టీజర్ ఫోటోని మొదటిసారి నేడు విడుదల చేసింది. హ్యుందాయ్ ఎఎక్స్1కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు మీకోసం.
ఫంకీ లుక్ అండ్ డిజైన్
హ్యుందాయ్ ఎఎక్స్ 1 టీజర్ ఫోటోలో కారు ఫ్రంట్ లుక్ ఎలా ఉండబోతుందో చూపించింది. ఎఎక్స్ 1 ఒక ఫంకీ లుక్ లాగా కనిపించే కారు. ఈ కారులో వృత్తాకార హెడ్‌ల్యాంప్, దాని చుట్టూ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు ఇచ్చారు. కారు ప్రైమరీ హెడ్‌ల్యాంప్ యూనిట్ పైన టర్న్ ఇండికేటర్స్ అందించారు. ముందు గ్రిల్ త్రిభుజాకార మెష్ డిజైన్‌ను పొందుతుంది. కారు బ్యాక్ లైట్లు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.
హ్యుందాయ్ వెన్యూ కంటే చిన్నది
ఒక నివేదిక ప్రకారం హ్యుందాయ్ ఎఎక్స్ 1 పొడవు 3.7నుండి 3.8 మీటర్లు. అంటే హ్యుందాయ్ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ వెన్యూ కంటే చిన్నదిగా ఉంటుంది. హ్యుందాయ్ ఈ మైక్రో ఎస్‌యూవీని అనేక అధునాతన ఫీచర్లు, టెక్నాలజీతో తీసుకొస్తుంది. ఈ మైక్రో-ఎస్‌యూవీ కారుకు 6-స్పోక్ అల్లాయ్ వీల్స్ లభిస్తాయని భావిస్తున్నారు. మైక్రో ఎస్‌యూవీ నిర్మాణాన్ని హ్యుందాయ్ 2018 సంవత్సరంలో ప్రకటించింది. అప్పటి నుండి ఈ కారు టెస్టింగ్ సమయంలో చాలాసార్లు కనిపించింది.
ఇంజన్ అండ్ ప్లాట్‌ఫారమ్
హ్యుందాయ్ ఈ కారు టెక్నికల్ ఫీచర్స్ గురించి వెల్లడించలేదు. కానీ నివేదిక ప్రకారం, కంపెనీ రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్స్ తో ఎఎక్స్ 1ను మార్కెట్లోకి తీసురబోతుంది. ఎఎక్స్ 1లో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ అలాగే టర్బోచార్జ్డ్ ఇంజన్ పొందవచ్చు. ఈ ఇంజిన్‌లతో మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందించవచ్చు. ఈ హ్యుందాయ్ కారును కె 1 ప్లాట్‌ఫాం ఆధారంగా రూపొందించారు.
ఎంత ఖర్చు అవుతుంది
హ్యుందాయ్ ఎఎక్స్ 1 కొత్త విభాగంలోకి ప్రవేశిస్తోంది. దీని బట్టి చూస్తే లాంచ్ చేసే సమయంలో ఈ కారు ధర తెలుస్తుంది. కానీ నివేదిక ప్రకారం కంపెనీ దీనిని రూ .5 లక్షల ప్రారంభ ధర వద్ద తీసుకురావొచ్చు. టాటా మోటార్స్ కొత్త కారు టాటా హెచ్‌బిఎక్స్ కూడా ఈ విభాగంలో త్వరలో విడుదల కానుంది. టాటా మోటర్స్ గత ఏడాది ఆటో ఎక్స్‌పోలో దీనిని పరిచయం చేసింది.