పెట్రోల్, డీజిల్ కాకుండా హోండా మరో కొత్త వేరియంట్ కారు.. మారుతి, హ్యుందాయ్ కార్లకు పోటీగా లాంచ్..
జపాన్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటైన హోండా అమేజ్ ను త్వరలో మిడ్ లైఫ్ అప్‌డేట్‌తో విడుదల చేయబోతోంది. ప్రస్తుత మార్కెట్లో పెరుగుతున్న పోటీని దృష్టిలో ఉంచుకుని కొత్త అమేజ్ బాడీ డిజైన్, క్యాబిన్ డిజైన్ కొత్త అనుభూతిని ఇస్తుంది.
మారుతి త్వరలో లాంచ్ చేయనున్న డిజైర్ సిఎన్‌జికి పోటీగా హోండా అమేజ్ సిఎన్‌జి వెర్షన్‌ను ప్రవేశపెట్టవచ్చు. హోండా కాంపాక్ట్ సెడాన్ అమేజ్ ఫేస్ లిఫ్ట్ మోడల్‌ను వచ్చే నెలలో భారతదేశంలో విడుదల చేయవచ్చు.
సిఎన్‌జి కార్లపై పెరుగుతున్న ఆసక్తికి ప్రధాన కారణం పెరుగుతున్న ఇంధన ధరలు అలాగే డీజిల్ మోడళ్ల కార్లు తగ్గడం. సిఎన్‌జితో నడిచే హోండా అమేజ్ అధిక మైలేజ్ ఇస్తుందని తెలుస్తుంది. ఎందుకంటే సిఎన్‌జితో నడిచే కార్ల ఖర్చు పెట్రోల్, డీజిల్ కార్ల కన్నా చాలా తక్కువ. అయితే, హోండా అమేజ్ సిఎన్‌జి గురించి కంపెనీ ఇంకా వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఫ్యాక్టరీ అమర్చిన సిఎన్‌జి కిట్‌తో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో హోండా అమేజ్ రావొచ్చు. ఈ 4 సిటర్ సెడాన్ అమేజ్ సిఎన్జి వెర్షన్ లాంచ్ అయిన తరువాత మారుతి సుజుకి డిజైర్, హ్యుందాయ్ ఆరా, టాటా టైగోర్ సిఎన్జి వెర్షన్లతో భారత మార్కెట్లో పోటీ పడనుంది.
2021 అమేజ్ సెడాన్ కారు డిజైన్ లో చాలా మార్పులు చూడవచ్చు. దీనితో పాటు కొత్త కారు లోపలి భాగం కూడా చాలా హైటెక్‌గా ఉంటుంది ఇంకా అప్ డేట్ ఫీచర్లను పొందుతుంది. అప్‌గ్రేడ్ చేసిన మోడల్‌కు కొత్త ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, కొత్త అల్లాయ్ వీల్స్, రిడిజైన్ చేసిన బంపర్‌లు లభించే అవకాశం ఉంది. కొత్త కలర్ ఆప్షన్స్ తో ఈ కారుని అందించవచ్చు. కార్ సీట్ల కోసం కొత్త అప్హోల్స్టరీ అండ్ కొత్త ఇంటీరియర్ ట్రిమ్ పొందే అవకాశం ఉంది.
ప్రస్తుతం, ఈ సబ్ -4 మీటర్ కాంపాక్ట్ సెడాన్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో వస్తుంది. అమేజ్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 90 పిఎస్ గరిష్ట శక్తిని, 110 ఎన్ఎమ్ పీక్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే మాన్యువల్ ఇంకా ఆటోమేటిక్ గేర్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ లభిస్తాయి.1.5-లీటర్ 4-సిలిండర్ ఇంజన్ డీజిల్ వేరియంట్లో లభిస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో 100 పిఎస్, 200 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అమేజ్ డీజిల్-సివిటి గరిష్టంగా 80 పిఎస్ శక్తిని, 160 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఫ్యాక్టరీ అమర్చిన సిఎన్‌జి కిట్ తో హోండా మొట్టమొదటి కారు అమేజ్.
ఏఆర్‌ఏఐ సర్టిఫైడ్ ఇంధన మైలేజ్ గణాంకాల ప్రకారం హోండా అమేజ్ డీజిల్ మాన్యువల్ వేరియంట్ 24.7 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. డీజిల్ సివిటి వేరియంట్ మైలేజ్ 21 కిలోమీటర్లు. పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్లో 18.6 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.