వాహనాలు కొనే వారికి గుడ్‌న్యూస్.. త్వరలోనే వాహన రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు..
న్యూ ఢీల్లీ: ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు భారతదేశం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా బ్యాటరీతో పనిచేసే వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల(ఆర్‌సి) జారీ, రెన్యూవల్ ఫీజు చెల్లించకుండా మినహాయించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. బ్యాటరీల తయారీకి టెస్లా తరహా గిగాఫ్యాక్టరీలను నిర్మించడానికి రూ.18,100 కోట్ల విలువైన ఉత్పత్తి-అనుసంధాన ప్రోత్సాహక పథకాన్ని ప్రభుత్వం ఆమోదించింది.
భారతదేశంలోని ప్రధాన నగరాల్లో కాలుష్యాన్ని అరికట్టడానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఇవి) కొనుగోళ్లను వేగవంతం చేయడమే కాకుండా ఖరీదైన ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
"సెంట్రల్ మోటారు వాహనాల నిబంధనలు 1989ను సవరిస్తున్నట్లు రోడ్డు రవాణా అండ్ రహదారుల మంత్రిత్వ శాఖ 20 మే 2021న ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ (బిఒవి) ను రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇంకా కొత్త రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు నుండి మినహాయించాలని ప్రతిపాదించింది. "అని మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాలకు మారడం ఉపాధికి కొత్త మార్గాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు.
45వేల కోట్ల డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా అధునాతన కెమిస్ట్రీ సెల్ బ్యాటరీల కోసం 50-గిగావాట్ల (జిడబ్ల్యుహెచ్) తయారీ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ ప్రణాళిక.
ఒక జిడబల్యూహెచ్(1,000-మెగావాట్ల అవర్) బ్యాటరీ సామర్థ్యం 1 మిలియన్ గృహాలకు గంటసేపు అలాగే 30వేల ఎలక్ట్రిక్ కార్లకు శక్తినివ్వడానికి సరిపోతుంది. సాధారణ ప్రజలు, పరిశ్రమవర్గాలు దీనిపై 30 రోజుల్లోగా తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరింది.