- Home
- Automobile
- ATOR N1200 : నేల, నీరు, బురద, మంచు, ఇసుక ... ఎక్కడైనా దూసుకెళ్లే సూపర్ వెహికిల్ వచ్చేసింది
ATOR N1200 : నేల, నీరు, బురద, మంచు, ఇసుక ... ఎక్కడైనా దూసుకెళ్లే సూపర్ వెహికిల్ వచ్చేసింది
మనం నేలపై నడిచే వాహనాలను, నీటిపై నడిచే పడవలను చూస్తుంటాం. కానీ ఒకే వాహనం నేల, నీటిపైనే కాదు బురద, మంచు, ఇసుక, బండరాళ్ళలో ప్రయాణించగదు. ఆ వెహికిల్ ఏది? దాని ప్రత్యేకతలేంటి? ఇక్కడ తెలుసుకుందాం.

ఈ వెహికిల్ తెలంగాణలో ఉండుంటే వరదప్రమాదం తగ్గేదిగా...
తెలంగాణలో కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి... దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాలను వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల వంటి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురవడంతో నదులు, వాగులువంకలు ఉప్పొంగి ప్రవహించాయి... దీంతో జనావాసాలను వరదనీరు చుట్టుముట్టడంతో మూగజీవులే కాదు మనుషులు కూడా అందులో చిక్కుకున్నారు. కొందరు నదీప్రవాహంలోని చిక్కుకుని సహాయం కోసం ఎదురుచూసిన ఘటనలు చూశాం… కొందరు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలను కాపాడేందుకు ఇండియన్ సరికొత్త వాహనాన్ని సిద్దంచేసింది.. అదే ఆటర్ ఎన్1200 (ATOR N1200).
ఈ ATOR N1200 అనేది కేవలం నేలపైనే కాదు నీళ్ళపైనా ప్రయాణించగల ఆల్-టెర్రైన్ వెహికల్. దీన్ని దట్టమైన అడవులు, చిత్తడి నేలలు, ఎడారులు, నదులు, మంచు ప్రదేశాలు... ఇలా ఎలాంటి కఠినమైన ప్రదేశాల్లోకైనా వెళ్ళడానికి డిజైన్ చేశారు.
ఏమిటి ATOR N1200?
ఇది రెస్య్యూ ఆపరేషన్స్, ఆర్మీ ఆపరేషన్స్ లో వినియోగించడానికి తయారుచేసిన స్పెషలిస్ట్ మొబిలిటి వెహికిల్ (SMV). ముఖ్యంగా దీన్ని ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ వంటి కఠినమైన మంచుకొండలు, నీటి ప్రవాహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉపయోగించేందుకు ఇండియన్ ఆర్మీ కొనుగోలుచేసింది. తాజాగా పంజాబ్ వరదల నేపథ్యలో అమృత్ సర్ లో ఈ ATOR N1200 ఉపయోగించారు. దీంతో ఒక్కసారిగా ఈ వెహికిల్ చర్చనీయాంశంగా మారింది.
ATOR N1200 ప్రత్యేకతలివే
1. స్పెషల్ టైర్లు
ఈ ATOR N1200 వెహికల్‌కి ఉన్న పెద్దపెద్ద టైర్లు నేలపైనే కాదు నీటిలో కూడా ప్రయాణించేలా రూపొందించబడ్డాయి. టైర్లలో తక్కువ ప్రెషర్ కారణంగా వెహికిల్ నీళ్ళలో తేలియాడటం, నీటిని వెనక్కితోసి వాహన ముందుకు వెళ్లేందుకు ఉపయోగపడతాయి. ఇలా నేలపై, నీళ్లలోనే కాదు దట్టమైన మంచు, బండరాళ్ళు, ఇసుక లాంటి కఠినమైన ప్రదేశాల్లో వెళ్ళడానికి ఈ టైర్లు సహాయపడతాయి.
2. అధునాతన టెక్నాలజీ
ఈ ATOR N1200 డోకాల్ అనే బలమైన స్టీల్ ఫ్రేమ్‌తో తయారు చేయబడింది. దీనికి ఉన్న జింక్ పూత లైఫ్‌ని 30 ఏళ్ళ వరకూ పెంచుతుంది. దీని బాడీ పార్ట్స్‌కి తుప్పు పట్టకుండా పాలీయురేతేన్ పూత ఉంటుంది. అవసరమైతే కెవ్లార్ లేదా మిశ్రమ కవచాలు కూడా అమర్చవచ్చు.
3 . ఎక్కువ బరువు మోయగలదు
ఈ వెహికల్ చూడటానికి చిన్నగా ఉన్నా ఎక్కువ బరువు మోయగలదు. డ్రైవర్‌తో సహా 9 మందిని అంటే మొత్తం 1,200 కిలోల బరువున్న వస్తువులను మోయగలదు. 2,350 కిలోల వరకూ బరువున్న వస్తువులను లాగగలదు.
Ator N1200 ఇంజిన్ సామర్థ్యం
ఈ ఆర్మీ రెస్క్యూ వెహికిల్ ATOR N1200 1.5 లీటర్, 3 సిలిండర్ డీజిల్ ఇంజిన్ కలిగివుంది. రోడ్డు మీద గంటకి 40 కి.మీ, నీళ్ళలో గంటకి 6 కి.మీ. వేగంతో వెళ్తుంది. 232 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో 61 గంటల వరకూ నాన్ స్టాప్ గా నడపవచ్చు.
ఈ ATOR N1200 వెహికిల్ -40°C నుండి +45°C వరకూ ఉండే ఉష్ణోగ్రతల్లో కూడా పనిచేస్తుంది. మంచు, తుఫాను, భారీ వర్షం లాంటి కఠిన వాతావరణాల్లో కూడా బాగా పనిచేస్తుంది. అందుకే దీన్ని వరదలు, ఫైర్ యాక్సిడెంట్ వంటి సమయాల్లో కూడా ఆర్మీ ఉపయోగిస్తోంది.
ATOR N1200 తయారుచేసిన కంపేనీ ఏదో తెలుసా?
JSW గ్రూప్‌లోని JSW Gecko Motors ఈ ATOR N1200 వెహికల్‌ని భారత్‌లో తయారు చేసింది. భారత ఆర్మీ 250 కోట్ల రూపాయల ఒప్పందంతో 96 వెహికల్స్‌ని ఆర్డర్ చేసింది. 2024 రిపబ్లిక్ డే పరేడ్‌లో దీన్ని మొదటిసారి ప్రజలకు చూపించారు. ప్రస్తుతం కొన్ని కఠినమైన ప్రదేశాల్లో ఆర్మీ దీన్ని వాడుతోంది... తాజాగా అమృత్ సర్ లో ఉపయోగించింది. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వరదనీటిలో ఈ ATOR N1200 ముందుకువెళుతూ సహాయక చర్యల్లో పాల్గొనడం అందరినీ ఆకట్టుకుంది.

