Rasi Phalalu 2026: కొత్త ఏడాది 2026లో ఈ రాశుల వారిదే హవా, ఏ రాశికి ఎలా ఉంటుందంటే...
Rasi Phalalu 2026: కొత్త ఏడాదిలో కొత్త ఆశలతో అడుగుపెట్టబోతున్నాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం 2026లో ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఎంతోమంది ఆసక్తిగా ఉంటారు. ఇక్కడ 12 రాశుల ఫలితాలను ఇచ్చాము. ఏ రాశి వారికి 2026 కలిసి వస్తుందో తెలుసుకోండి.

మేష రాశి (Aries)
మేష రాశి వారికి 2026 సంవత్సరం మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. ఏడాది ప్రారంభంలోనే శని ప్రభావం పడుతుంది. దీనివల్ల పనుల్లోఆలస్యం జరగవచ్చు. జూన్ తర్వాత మాత్రం పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. గురు గ్రహం వల్ల జీవితం కుదుటపడుతుంది. వృత్తిపరంగా కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి విదేశీ పెట్టుబడులు చేతికి అందుతాయి. ఆర్థికంగా ఆదాయం బావుంటుంది, కానీ అడ్డు అదుపు లేకుండా విలాసాల కోసం ఖర్చులు చేసి డబ్బును కరిగించేస్తారు.ఇక విద్యార్థుల విషయానికి వస్తే పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. హైబీపీ లేదా పొట్ట సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో చిన్నపాటి విభేదాలు వచ్చినా... భార్యాభర్తల మధ్య ఉన్న అవగాహన వల్ల వాటిని అధిగమిస్తారు. భూమి, ఇల్లు, ఫ్లాట్ వంటి స్థిరాస్తులు కొనుగోలుకు 2026 జూన్ తరువాత సరైన సమయం. మేషరాశి వారు ప్రతిరోజూ ఆదిత్య హృదయం పఠించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు.
వృషభ రాశి (Taurus)
వృషభ రాశి వారికి 2026 ఆర్థికంగా కలిసివచ్చే ఏడాది. ఈ రాశివారు గతంలో చేసిన పెట్టుబడుల నుంచి భారీ లాభాలు పొందే అవకాశం ఉంది. ఇక కెరీర్లో మంచి స్థాయికి చేరుకుంటారు. ఉద్యోగాలు చేస్తున్నవారికి ప్రమోషన్, జీతాల పెరిగే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో వీరికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి ఆ శుభవార్త అందే అవకాశం ఉంది. జూన్ తర్వాత చేసే ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది. ఆరోగ్యపరంగా చూస్తే ఎముకలు లేదా దంతాల సమస్యలు రావచ్చు. కాబట్టి కాల్షియం అధికంగా ఉండే ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రేమికులు తమ ప్రేమను పెళ్లి పీటల వరకు తీసుకెళ్లగలుగుతారు. కళాకారులకు, క్రీడాకారులకు ఈ ఏడాది గోల్డెన్ ఇయర్ అని చెప్పవచ్చు. ఈ రాశివారు శుక్రవారం నాడు లక్ష్మీ దేవిని ఆరాధించడం అన్ని విధాలా శుభప్రదం.
మిథున రాశి (Gemini)
మిథున రాశి వారికి 2026 జ్ఞానాన్ని, సామాజిక అభివృద్ధిని అందించే సంవత్సరం. ఈ రాశివారి కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల ఆఫీసులో ఉండే కష్టమైన సమస్యలను కూడా పరిష్కరించే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త భాగస్వామ్యాలు ఏర్పడతాయి. అయితే, జూన్ వరకు ఆర్థిక లావాదేవీల్లో కొంత జాగ్రత్త అవసరం. అనవసరపు ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. విద్యార్థులకు పరిశోధన రంగంలో గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్య పరంగా శ్వాసకోశ సమస్యలు లేదా అలర్జీలు ఇబ్బంది పెట్టవచ్చు. ఈ రాశివారు యోగా ప్రతిరోజూ చేయడం అవసరం. పని ఒత్తిడి వల్ల కుటుంబ సభ్యులతో గడిపే సమయం తగ్గుతుంది. దీనివల్ల చిన్నపాటి అసంతృప్తి కుటుంబ జీవితంలో ఏర్పడవచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తీర్థయాత్రలు కూడా చేస్తారు. ఈ రాశి వారు బుధవారంనాడు వినాయకుడికి గరిక ను సమర్పించడం వల్ల పనుల్లో వచ్చే ఆటంకాలు తొలగిపోతాయి.
కర్కాటక రాశి (Cancer)
కర్కాటక రాశి వారికి 2026 అత్యంత అదృష్టవంతమైన ఏడాదిగా చెప్పుకోవాలి. జూన్ నెలలో గురు గ్రహం మీ రాశిలోకి ప్రవేశించడంతో మీ దశ తిరుగుతుంది. ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు కోరుకున్న చోటికి బదిలీ అవుతుంది. విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశం కూడా దక్కుతుంది. వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పాత బాకీలు, అప్పులు వసూలవుతాయి. వివాహం కాని వారికి అనుకూలమైన సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం మెరుగుపడి.. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అయితే శని ప్రభావం వల్ల తల్లి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. ఆ విషయంలో జాగ్రత్త అవసరం. ఇంటి నిర్మాణం లేదా వాహనం కొనాలనుకునే కల నెరవేరుతుంది. ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి.
సింహ రాశి (Leo)
సింహ రాశి వారికి 2026 అధికారంతో పాటూ ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఏడాది. సూర్యుడు సింహరాశికి అధిపతి. దీని వల్ల మీ మాటకు సమాజంలో విలువ పెరుగుతుంది. రాజకీయ, ప్రభుత్వ రంగాల్లో ఉన్నవారికి గొప్ప విజయాలు లభిస్తాయి. కెరీర్ పరంగా మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఆరోగ్య పరంగా కళ్లు లేదా వెన్నునొప్పి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు విదేశీ చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. తండ్రి నుంచి సపోర్టు మీకు పుష్కలంగా ఉంటుంది. రోజూ సూర్య నమస్కారాలు చేయడం వల్ల అన్ని పనుల్లో విజయం దక్కే అవకాశం ఉంది.
కన్యా రాశి (Virgo)
కన్యా రాశి వారికి ఈ ఏడాది వ్యాపారంలో బాగా కలిసివస్తుంది. వ్యాపారంలో వీరిదే ప్రత్యర్థులపై పైచేయి అవుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. అలాగే మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా ఈ ఏడాది పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ఇది భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది. జూన్ తర్వాత గురువు ప్రభావం వల్ల శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. అందుకోసం ఖర్చులు చేయాల్సి వస్తుంది. జీర్ణక్రియ సంబంధిత సమస్యలు జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు ఏకాగ్రతతో చదివి మంచి ఫలితాలు సాధిస్తారు. కుటుంబంలో సోదరులతో ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయి. కొత్త పరిచయాలు మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరించేలా చేస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల మీకు అంతా మంచే జరుగుతుంది.
తులా రాశి (Libra)
తులా రాశి వారికి 2026 విలాసవంతమైన జీవితాన్నిఅందిస్తుంది. శుక్రుడి ప్రభావం వల్ల మీరు కళలు, డిజైనింగ్, మీడియా రంగాల్లో ఉన్నవారికి బాగా కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. కెరీర్ పరంగా కొత్త భాగస్వామ్యాలు లాభాలు తెచ్చిపెడతాయి. జూన్ తర్వాత మీ ఖర్చులు పెరగవచ్చు. కాబట్టి బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం అవసరం. ఆరోగ్యపరంగా కిడ్నీ లేదా చర్మ సంబంధిత సమస్యలు రావచ్చు. వైవాహిక జీవితం చాలా మధురంగా సాగుతుంది. ప్రయాణాలు బాగా చేస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. దానధర్మాలు చేయడం వల్ల మీ పుణ్య బలం పెరుగుతుంది.
వృశ్చిక రాశి (Scorpio)
వృశ్చిక రాశి వారికి 2026 మంచి మార్పును తెచ్చే ఏడాది. ఈ రాశి వారు ఆధ్యాత్మికత వైపు ఆసక్తి చూపిస్తారు. కెరీర్ పరంగా శ్రమ ఎక్కువ పడాల్సి ఉంటుంది. ఈ ఏడాది చివర్లో ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి. పరిశోధన, గూఢచారి విభాగాల్లో పనిచేసేవారికి గొప్ప గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా ఈ ఏడాది మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. అకస్మాత్తుగా ధన లాభం కలిగే అవకాశం ఉంది. అనుకోని ఖర్చులు రావచ్చు కాబట్టి డబ్బు పొదుపు చేసుకోవాలి. ఆరోగ్య పరంగా శస్త్రచికిత్సలు జరిగే అవకాశం ఉంది.. కాబట్టి నిర్లక్ష్యం చేయకండి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల భయాలు తొలిగి ధైర్యం కలుగుతుంది.
ధనుస్సు రాశి (Sagittarius)
ధనుస్సు రాశి వారికి 2026 అదృష్టాన్ని తీసుకొచ్చే సంవత్సరం. ఈ రాశి అధిపతి గురువు. గురు గ్రహం కర్కాటకంలో ఉచ్ఛ స్థితిలో ఉండటం వల్ల మీకు అన్ని రంగాల్లో విజయం వరిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది. వీరికి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. పైగా స్థిరాస్తుల ద్వారా ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులు ఉన్నత విద్యలో రాణిస్తారు. స్కాలర్‌షిప్‌లు పొందే అవకాశం ఉంది. శరీరం బరువు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆహార నియమాలు పాటించాలి. ధార్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. సమాజ సేవ చేయడం వల్ల మీకు మంచి పేరు వస్తుంది. గురువారం నాడు దత్తాత్రేయ స్వామిని దర్శించడం చాలా మంచిది.
మకర రాశి (Capricorn)
మకర రాశి వారికి 2026 కష్టపడి పనిచేసే తత్వాన్ని, స్థిరత్వాన్ని ఇస్తుంది. ఏలినాటి శని చివరి దశలో ఉండటం వల్ల వీరికి కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. కానీ ఈ రాశివారు వాటిని తమ కష్టంతో అధిగమిస్తారు. రియల్ ఎస్టేట్, ఐరన్ వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు ఉంటాయి. ఆర్థికంగా నిలకడగా ఉంటుంది. కానీ అనవసర ఖర్చుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా మోకాళ్ల నొప్పులు లేదా కండరాల సమస్యలు రావచ్చు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. దీనివల్ల కొంత ఒత్తిడికి గురవుతారు. పట్టుదలతో పనిచేస్తే మీరు అనుకున్న లక్ష్యాన్ని ఈ ఏడాది ఖచ్చితంగా సాధిస్తారు. శనివారం నాడు పేదలకు అన్నదానం చేయడం వల్ల మీ కష్టాలు తొలగిపోతాయి.
కుంభ రాశి (Aquarius)
కుంభ రాశి వారికి 2026 ఎన్నో మార్పులను తీసుకొస్తుంది. శని దేవుడు... కుంభ రాశి నుంచి మీనంలోకి మారడం వల్ల పెద్ద ఊరట లభిస్తుంది. మానసిక ఒత్తిడి తగ్గి ఉత్సాహంగా ఉంటారు. కెరీర్ పరంగా టెక్నాలజీ, సామాజిక సేవా రంగాల్లో రాణిస్తారు. ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త ఆదాయ మార్గాలు వెతుక్కుంటూ వస్తాయి. విద్యార్థులు సాంకేతిక విద్యలో ప్రతిభ చూపుతారు. ఆరోగ్య పరంగా నరాల బలహీనత లేదా నిద్రలేమి సమస్యలు ఉండవచ్చు. ప్రశాంతత కోసం యోగా చేయండి. ప్రేమ జీవితంలో ఒక కొత్త వ్యక్తి రాక మీ జీవితాన్ని మారుస్తుంది. స్నేహితులతో కలిసి కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. శివాలయంలో దీపం వెలిగించడం వల్ల మీకు శుభం కలుగుతుంది.
మీన రాశి (Pisces)
మీన రాశి వారికి 2026 ఎన్నో బాధ్యతలను అందిస్తుంది. శని గ్రహం మీ రాశిలోకి ప్రవేశించడం వల్ల ఏలినాటి శని ప్రారంభమవుతుంది. దీని వల్ల కష్టపడి పనిచేయాల్సిన సమయం ఇది. వృత్తిలో సవాళ్లు ఉన్నప్పటికీ, మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. ఆర్థికంగా పొదుపు చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే అనవసర ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. జూన్ తర్వాత గురు గ్రహం ఐదవ ఇంట్లో ఉండటం వల్ల సంతానం ద్వారా సంతోషం లభిస్తుంది. పాదాల నొప్పులు లేదా అలసట రావచ్చు. ఆధ్యాత్మిక ప్రయాణాలు మానసిక బలాన్ని ఇస్తాయి. బంధువులతో మాట పట్టింపులు రాకుండా చూసుకోవాలి. ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శని ప్రభావం తగ్గి అంతా మంచే జరుగుతుంది.

