వాస్తు ప్రకారం.. ఇలా చేస్తే మీ కోపం అదుపులో ఉంటుంది
వాస్తు శాస్త్రంలో దిశలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అలాగే వాస్తు శాస్త్రంలో ఇంట్లోని ప్రతి చిన్న, పెద్ద వస్తువును ఉంచడానికి కొన్ని నియమాలు ఇవ్వబడ్డాయి. వాటిని జాగ్రత్తగా చూసుకుంటే మనిషి జీవితంలో సుఖసంతోషాలు నిలుస్తాయి.
కోపం తెచ్చుకోవడం అనేది ఒక సహజమైన ప్రక్రియ. సందర్భాను సారం కోపం వస్తుంది. అయితే కొంతమంది అయిన దానికి, కాని దానికి కోప్పడుతూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికి కసురుకుంటారు. అతి కోపం మీ వ్యక్తిత్వాన్ని మాత్రమే కాదు మీ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అయితే కొన్ని వాస్తు చిట్కాలను పాటిస్తే అతికోపం పోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ దిశలో నిద్రపోవద్దు
వాస్తు శాస్త్రం ప్రకారం.. ఆగ్నేయ దిశలో కూర్చున్నా, పడుకోకున్న మీ కోపం పెరిగిపోతుంది. కాబట్టి మీ కోపం పెరుగుతున్నట్టైతే మొదట మీరు కూర్చునే, నిద్రపోయే ప్రదేశం అగ్నేయ దిశలో ఉండకూడదు. అలాగే మీ ఆఫీసులో ఆగ్నేయ దిశలో కూర్చునే ఉద్యోగుల స్వభావం దూకుడుగా ఉంటుందని వాస్తుశాస్త్రం చెబుతోంది.
నిద్రపోయేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోండి
నిద్రపోయేటప్పుడు మీ తలను ఎప్పుడూ కూడా తూర్పు లేదా దక్షిణ దిశకు అభిముఖంగా ఉంచండి. దిండు పక్కన ప్లేట్ లో క్రిస్టల్ బాల్ లేదా ఆలం ముక్కను పెట్టి పడుకుంటే ఈ సమస్య నుంచి చాలా వరకు ఉపశమనం పొందుతారు.అలాగే తూర్పు దిశలో ఎలాంటి బరువైన వస్తువులను ఉంచకూడదు.
ఈ రంగును తక్కువగా వాడండి
వాస్తు శాస్త్రం ప్రకారం.. ఒక వ్యక్తికి చాలా కోపం వస్తే వీళ్లు ఎరుపు రంగు వాడకాన్ని తగ్గించాలి. అలాగే మీ ఇంటి గోడ, బెడ్ షీట్, కర్టెన్లు, కుషన్ కవర్ లపై ఎరుపు రంగు వాడకాన్ని తగ్గించండి. ఎందుకంటే ఇది కోపాన్ని పెంచుతుంది. కాబట్టి ఎరుపు రంగు వాడకాన్ని మానుకోండి.
Image: Getty
మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ఇలా చేయండి
ధూళి కూడా కోపాన్ని పెంచుతుందని వాస్తు శాస్త్రంలో నమ్ముతారు. అందుకే మీ ఇంట్లోని ప్రతి మూలను శుభ్రంగా ఉంచండి. ఇది కోపాన్ని నియంత్రించడానికి సహాయపడుతుంది. అలాగే వాస్తు ప్రకారం.. మీరు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఇంటికి తూర్పు దిశలో దీపం వెలిగించండి. ఇది మీ కోపాన్ని నియంత్రిస్తుంది.