మీ రాశి ప్రకారం ఏ రాశివారిని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటారో తెలుసా?
పెళ్లి బంధం చాలా ప్రత్యేకమైనది. ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండడానికి చాలా విషయాలు కారణమవుతాయి. వాటిలో జాతకం కూడా ఒకటి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ రాశివారు.. ఏ రాశివారిని పెళ్లి చేసుకుంటే జీవితాంతం సంతోషంగా ఉంటారో ఇక్కడ తెలుసుకుందాం.

పెళ్లికి పక్కాగా సరిపోయే రాశులు
సాధారణంగా జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు చాలామంది ఏ రాశితో ఏ రాశి సరిపోతుంది? అని ఆరా తీస్తుంటారు. కొన్ని రాశుల మధ్య సహజంగానే మంచి అవగాహన, ప్రేమ ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, నక్షత్రం, భావ స్థితి, గ్రహాల ఆధారంగా కొన్ని రాశి జంటలు పెళ్లికి పక్కాగా సరిపోతాయి. అవేంటో చూద్దామా..
మేష, మిథున రాశులు
మేష, మిథున రాశి జంట చురుకైన, ఉల్లాసమైన సంబంధాన్ని ఏర్పరుస్తుంది. మేష రాశికి అధిపతి కుజుడు. ధైర్యం, శక్తి, ఉత్సాహాన్ని ఇస్తాడు. మిథున రాశికి అధిపతి బుధుడు. చురుకుదనం, వాక్చాతుర్యం, కొత్తదనాన్ని ఇస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రెండు రాశులు 3-11 సంబంధాన్ని పంచుకుంటాయి. దానివల్ల వీరు ఫ్రెండ్స్ లా ఉంటారు. చిన్న చిన్న గొడవలను త్వరగా మరచిపోయి నవ్వుతూ జీవిస్తారు.
వృషభ, కర్కాటక రాశులు
వృషభ, కర్కాటక రాశి జంట ప్రేమ, ఆప్యాయతలకు ప్రతీక. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. ప్రేమ, అందం, స్థిరత్వాన్ని ఇస్తాడు. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఆప్యాయత, కుటుంబ ప్రేమ, అనురాగాన్ని ఇస్తాడు. శుక్ర, చంద్ర యుతి ప్రేమతో కూడిన కుటుంబ జీవితాన్నిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభ, కర్కాటక రాశులు 3-11 లేదా 5-9 స్నేహ సంబంధాన్ని కలిగి ఉంటాయి. దానివల్ల కుటుంబ వృద్ధి, మంచి సంతానం, ప్రేమతో కూడిన బంధం ఉంటాయి.
సింహ, తుల రాశులు
సింహ, తుల రాశి జంట సమాజంలో ప్రశంసలు అందుకుంటుంది. సింహ రాశికి అధిపతి సూర్యుడు. నాయకత్వం, గౌరవం, వ్యక్తిత్వానికి సూర్యుడు కారకుడు. తుల రాశికి అధిపతి శుక్రుడు. సమతుల్యత, కళాత్మకత, మంచి ప్రవర్తనకు శుక్రుడు కారకుడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సింహ, తుల రాశులు 7-7 సంబంధాన్ని కలిగి ఉండటం వల్ల ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుంటారు. అందమైన జంటగా నిలుస్తారు.
కన్య, మకర రాశులు
కన్య, మకర రాశి జంట కష్టజీవులు, తెలివైన వారు. కన్య రాశికి అధిపతి బుధుడు. ప్రణాళిక, ఆచరణాత్మక ఆలోచన, జ్ఞానాన్ని ఇస్తాడు. మకర రాశికి అధిపతి శని. కష్టపడి పనిచేయడం, నియంత్రణ, స్థిరత్వాన్ని ఇస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్య, మకర రాశులు 5-9 సంబంధాన్ని కలిగి ఉండటం వల్ల విజయవంతమైన జంటగా ఉంటారు. వీరి జీవితం ప్రణాళికాబద్ధంగా సాగుతుంది.
ధనుస్సు, కుంభ రాశులు
ధనుస్సు, కుంభ రాశి జంట సాహసం, కొత్తదనం కోరుకుంటుంది. ధనుస్సు రాశికి అధిపతి గురుడు. జ్ఞానం, సాహసం, విస్తృత ఆలోచనలను ఇస్తాడు. కుంభ రాశికి అధిపతి శని. కొత్తదనం, స్వేచ్ఛ, కొత్త ప్రయత్నాలకు కారకుడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ధనుస్సు, కుంభ రాశులు 3-11 సంబంధాన్ని కలిగి ఉండటం వల్ల విదేశీ అవకాశాలు, ప్రయాణాలు, కొత్త అనుభవాలు ఉంటాయి.
మీన, వృశ్చిక రాశులు
మీన, వృశ్చిక రాశి జంట భావోద్వేగ, గాఢమైన ప్రేమకు ప్రతీక. మీన రాశికి అధిపతి గురుడు. ఆధ్యాత్మికత, ఆప్యాయత, కలలను ఇస్తాడు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. శక్తి, లోతైన ఆలోచన, రహస్యానికి కారకుడు కుజుడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీన, వృశ్చిక రాశులు 5-9 సంబంధాన్ని కలిగి ఉండటం వల్ల వీరి బంధం భావోద్వేగభరితమైన, నమ్మకమైన సంబంధంగా మారుతుంది. వీరు ఒకరిపై ఒకరు లోపల గాఢమైన ప్రేమను కలిగి ఉంటారు.