Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారిలో ఏదో తెలియని పవర్ ఉంటుంది.. అదే వారి బలం!
Birth Date: సంఖ్యా శాస్త్రం ప్రకారం మనం పుట్టిన తేదీ మన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను తెలియజేస్తుంది. ముఖ్యంగా కొన్ని ప్రత్యేక తేదీల్లో జన్మించినవారిలో ఒక రకమైన అంతర్గత శక్తి, ధైర్యం ఉంటాయి. అవే వారికి రక్షగా ఉంటాయి. మరి ఆ తేదీలేంటో చూద్దామా..

ప్రత్యేకమైన శక్తి ఉన్న పుట్టిన తేదీలు
ప్రతి ఒక్కరి జీవితంలో పుట్టిన తేదీకి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం పుట్టిన తేదీ, సమయం, నక్షత్రం, గ్రహాల స్థితులు వ్యక్తుల జీవిత ప్రయాణంపై ప్రభావం చూపుతాయని నమ్మకం. ముఖ్యంగా కొన్ని తేదీల్లో జన్మించిన వారిలో సాధారణంగా కనిపించని ప్రత్యేక లక్షణాలు, అంతర్గత శక్తులు ఉంటాయట. ఆ తేదీలేంటో తెలుసుకుందాం.
1, 7, 9, 11 తేదీల్లో పుట్టినవారు
సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 1, 7, 9, 11 తేదీల్లో పుట్టినవారు సాధారణంగా బలమైన సంకల్పం, స్వతంత్ర ఆలోచనలు, నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ముఖ్యంగా 1వ తేదీన జన్మించినవారిలోని ప్రత్యేక శక్తి కారణంగా వీరు కొత్త మార్గాలను అన్వేషించడానికి ఇష్టపడతారు. ఇతరులు సంకోచించే పరిస్థితుల్లో కూడా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. వీరిలో నాయకత్వ లక్షణాలు ఉండటం వల్ల మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటారు.
7వ తేదీన జన్మించినవారు
7వ తేదీన పుట్టినవారు లోతుగా ఆలోచించే స్వభావం కలిగి ఉంటారు. జీవితంలోని అనేక విషయాలను ఇతరుల కంటే భిన్నంగా అర్థం చేసుకునే సామర్థ్యం వీరికి ఉంటుంది. పండితుల ప్రకారం వీరిలో అంతర్‌దృష్టి ఎక్కువగా ఉంటుంది. చాలా సార్లు ఇతరులు గుర్తించని అవకాశాలను వీరు ముందుగానే గమనించే గుణం కలిగి ఉంటారు.
9వ తేదీన జన్మించినవారు
9వ తేదీన జన్మించినవారిని జ్యోతిష్య శాస్త్రంలో శక్తివంతమైన వ్యక్తులుగా చెప్తారు. వీరిలో ధైర్యం, సేవా భావం, పట్టుదల ఎక్కువగా ఉంటాయి. ఏ పని ప్రారంభించినా పూర్తి చేయాలనే తపన వీరిలో కనిపిస్తుంది. కష్టాలను ఎదుర్కొనే సామర్థ్యం వీరికి సహజంగా ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించే శక్తి వీరిలో ఎక్కువగా ఉంటుంది.
11వ తేదీన పుట్టినవారు
11 తేదీలో పుట్టినవారిలో ప్రత్యేకమైన సృజనాత్మకత, ఆధ్యాత్మిక ఆసక్తి, దూరదృష్టి ఉంటాయని న్యూమరాలజీ నిపుణులు చెబుతున్నారు. ఇతరులు గుర్తించని అవకాశాలను గుర్తించడం, కొత్త ఆలోచనలు చేయడం వంటి లక్షణాలు వీరిలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇతరుల సమస్యలను అర్థం చేసుకునే శక్తి, సహాయం చేయాలనే తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది.

