ఈ నక్షత్రాల్లో పుట్టినవారు రెండో పెళ్లి చేసుకునే అవకాశాలు ఎక్కువ!
పెళ్లి బంధంలో ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడే ఆ బంధం నిలబడుతుంది. లేదంటే వారు కలిసి ఉండటం కష్టమవుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నక్షత్రాల్లో పుట్టినవారికి మొదటి పెళ్లి అంతగా కలిసిరాదు. రెండో పెళ్లి అవకాశాలు ఎక్కువ.

Birth Stars Astrology
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నక్షత్రాలు, గ్రహ స్థితులు మన జీవితంలోని అనేక అంశాలపై ప్రభావం చూపుతాయి. ప్రత్యేకంగా పెళ్లి, దాంపత్య జీవితం, అనుబంధాలు వంటి అంశాలపై కొన్ని నక్షత్రాల ప్రభావం ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కొన్ని ప్రత్యేక నక్షత్రాల్లో పుట్టినవారికి జీవితంలో ఒడిదొడుకులు, భావోద్వేగాల్లో మార్పులు, తగిన జీవిత భాగస్వామి దొరకకపోవడం వంటి పరిస్థితులు ఎక్కువగా ఎదురవుతాయి. దానివల్ల మొదటి వివాహం సెట్ కాకపోవడం లేదా జీవితంలో మళ్లీ కొత్త బంధానికి అవకాశం రావడం వంటివి జరుగుతాయి. మరి ఏ నక్షత్రాల్లో జన్మించిన వారికి రెండో పెళ్లి అవకాశాలు ఎక్కువగా ఉంటాయో ఇక్కడ చూద్దాం.
అశ్విని నక్షత్రం
అశ్విని నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు స్వేచ్ఛకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. వీరి పర్సనల్ స్పేస్ లేదా అభిప్రాయాలకు విరుద్ధంగా భాగస్వామి వ్యవహరిస్తే సంబంధాల్లో విభేదాలు రావచ్చు. ఈ స్వేచ్ఛా స్వభావం వల్ల కొన్ని సందర్భాల్లో మొదటి పెళ్లి నిలకడగా ఉండదు. ఈ కారణంగా వీరు తమ స్వభావాన్ని అర్థం చేసుకునే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంటారు.
భరణి నక్షత్రం
భరణి నక్షత్రంలో జన్మించినవారి భావోద్వేగాలు బలంగా ఉంటాయి. వీరు సంబంధాలను సీరియస్ గా తీసుకున్నప్పటికీ, ఏదైనా లోటు అనిపిస్తే.. త్వరగా నిరాశ చెందుతారు. భాగస్వామితో భావోద్వేగ బంధం సరిగ్గా లేకపోతే విడిపోవడానికి సిద్ధమవుతారు.
మృగశిర నక్షత్రం
మృగశిర నక్షత్రం కలిగినవారు సహజంగా అన్వేషకులు. వీరిలో అనిశ్చితి భావం ఎక్కువగా ఉండడం వల్ల మొదటి సంబంధంలో స్పష్టత లేకపోవడం లేదా సరైన జత కుదరకపోవడం సాధారణం. కానీ రెండో వివాహంలో అనుభవంతో కూడిన తెలివితో సంబంధాన్ని కొనసాగిస్తారు.
స్వాతి నక్షత్రం
స్వాతి నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు గాలి లాంటివారు. వీరు స్వేచ్ఛగా ఉండటానికి ఇష్టపడతారు. జీవితంలో ఒకే చోట లేదా ఒకే భావనలో నిలబడటానికి ఇష్టపడరు. దీనివల్ల మొదటి పెళ్లి బంధంలో విభేదాలు రావచ్చు. అయితే వీరు రెండో వివాహంలో తమ స్వభావాన్ని అర్థం చేసుకునే, సహనంతో ఉండే భాగస్వామిని ఎంచుకునే అవకాశం ఎక్కువ.
జ్యేష్ఠ నక్షత్రం
జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినవారు గర్వభావం, నాయకత్వ లక్షణాలతో ఉంటారు. సంబంధాల్లో ఆధిపత్యం చూపాలనుకోవడం వల్ల విభేదాలు వస్తాయి. మొదటి వివాహంలో ఈ ఆధిపత్యం విభేదాలకు దారితీసినా, రెండో వివాహంలో వీరు మరింత పరిపక్వతతో వ్యవహరించే అవకాశం ఉంటుంది.
మూల నక్షత్రం
మూల నక్షత్రంలో జన్మించిన వారి జీవితంలో సంక్లిష్టతలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆధ్యాత్మికత, స్వతంత్రత, భావోద్వేగ మార్పులు వంటి కారణాలతో వీరు మొదటి వివాహ బంధాన్ని నిలబెట్టుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. కానీ రెండో వివాహంలో మంచి మార్పులు, సానుకూల అనుభవాలు రావచ్చని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
శతభిషం నక్షత్రం
శతభిషం నక్షత్రం కలిగినవారికి తెలివితోపాటు ఆత్మపరిశీలన ఎక్కువ. చిన్న విషయాన్నికూడా లోతుగా పరిశీలించడం వల్ల చిన్న సమస్యలు పెద్దవిగా మారవచ్చు. అందువల్ల మొదటి పెళ్లిలో లోపాలు ఉండే అవకాశం ఎక్కువ. కానీ రెండో వివాహంలో వీరు ప్రాక్టికల్‌గా మారి సంబంధాన్ని సుస్థిరం చేసుకుంటారు.
ఉత్తరాభాద్ర నక్షత్రం
ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు లోలోపల భావోద్వేగపరంగా బలహీనులు అయినప్పటికీ బయట ప్రపంచానికి దృఢంగా కనిపిస్తారు. వీరికి అర్థం చేసుకునే భాగస్వామి లభించకపోతే, మొదటి వివాహం సౌఖ్యంగా లేకపోవచ్చు. కానీ రెండో వివాహం వీరికి శాంతి, స్థిరత్వం తీసుకురావచ్చని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

