Ugadi 2022: స్వస్తి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం.. మేష రాశి జాతకం
స్వస్తి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం లో మేష రాశివారు ఆర్థికంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. ఈ సంవత్సరం గురువు పన్నెండవ ఇంటిలో సంచరించడం వలన ఆర్ధిక స్థితి లో మార్పులు చోటు చేసుకుంటాయి.
Aries
ఈ జాతకాన్ని ప్రముఖ జోతిష్య నిపుణులు గొల్లపెల్లి సంతోష్ కుమార్ శర్మ తెలియజేశారు.
ఓం శ్రీ సాయి జ్యోతిష విద్యాపీఠం, ధర్మపురి, జగిత్యాల జిల్లా.
https://www.onlinejyotish.com
aries
ఆరోగ్యం
మేష రాశివారికి ఈ సంవత్సరం ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ 12 నుంచి గురువు పన్నెండవ ఇంటిలో మరియు 13వ తేదీ నుంచి రాహువు జన్మ రాశిలో, కేతువు ఏడవ ఇంటిలో సంచరించడం వలన ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తల మరియు మెదడుకు సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలో అలాగే మానసిక ఆందోళన విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఏ విషయం లో అయినా ఆవేశానికి గురి కాకుండా శాంతంగా ఉండి మీ మానసిక ఆందోళనలను పెంచుకోకుండా ఉండటం మంచిది. జన్మస్థానంలో రాహు సంచారం కారణంగా మానసిక ఆందోళన ఆవేశం పెరిగే అవకాశం ఉంటుంది. పన్నెండవ ఇంటిలో గురువు గోచారం కారణంగా రక్తము మరియు, వెన్నెముకకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాషముంటుంది కనుక, మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా జూలై మరియు జనవరి మధ్య కాలంలో, మీరు శారీరక రుగ్మతలు మరియు మానసిక ఉద్రిక్తతతో బాధపడాల్సి రావచ్చు. ఆరోగ్య విషయంలో ఆవేశానికి లోను కాక పోవటం, ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ ఆవేశం మీ ఆరోగ్యాన్ని చెడగొడుతుంది అన్న విషయాన్ని ఈ సంవత్సరమంతా గుర్తుపెట్టుకోండి.
aries
ఆర్థిక స్థితి
ఆర్థికంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. ఈ సంవత్సరం గురువు పన్నెండవ ఇంటిలో సంచరించడం వలన ఆర్ధిక స్థితి లో మార్పులు చోటు చేసుకుంటాయి. విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయడం వలన ఆర్థికంగా గా కొంత ఇబ్బందికి లోనయ్యే అవకాశం ఉంటుంది. అయితే జూలై వరకు శని గోచారం అనుకూలంగా ఉండటంతో ఈ సమస్య మిమ్మల్ని పెద్దగా బాధించదు. కానీ జూలై తర్వాత మీ ఖర్చుల విషయంలో అదుపు లేకపోతే ఆర్థిక సమస్యలకు లోనయ్యే అవకాశం ఉంటుంది. అంతే కాక ఇతరుల మాటలు విని లేదా గొప్పలకు పోయి అప్పు తీసుకొని మరీ శుభ కార్యాలు పూర్తి చేయడం లేదా దానధర్మాలు చేయడం చేస్తారు. ఆర్థికంగా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండాలి అంటే వీలైనంతవరకు గొప్పలకు పోకుండా అలాగే ఒకటికి రెండుసార్లు ఆలోచించి డబ్బు ఖర్చు చేయడం మంచిది. ఎందుకంటే గురు లాభంలో ఉన్నప్పుడు వచ్చిన డబ్బులు లేదా పెట్టుబడుల కారణంగా వచ్చిన లాభాలను అనవసరంగా పోగొట్టుకోవాల్సి వస్తుంది.
ఉద్యోగం
సంవత్సర ఆరంభంలో బృహస్పతి 12 వ ఇంటికి మారడంతో, వృత్తి విషయంలో చాలా అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే మొదటి ఇంటిపై రాహువు సంచారం మిమ్మల్ని మరింత మొండివారిగా, అహంభావులుగా మారుస్తుంది. ప్రతి విషయంలో ఎక్కువ పట్టుదలకు పోవటం, పోరాడాలని చూడటం చేస్తుంటారు. ఈ సంవత్సరమంతా శని గోచారం 10 వ మరియు 11 వ ఇళ్లలో ఉండటం వలన వృత్తిలో అభివృద్ధిని, పేరుప్రతిష్ఠలను పొందుతారు. మీరు ఇతరులతో ప్రవర్తించే విధానంలో జాగ్రత్త వహించటం మంచిది. మీకు వచ్చిన విజయాలు మీకు గర్వాన్ని అహంభావాన్ని ఇవ్వటం వలన మీరు ఇతరులతో దురుసుగా ప్రవర్తించే అవకాశముంటుంది. ఇది మీ వృత్తిలో అదేవిధంగా వ్యక్తిగత జీవితంలో కూడా సమస్యను కలిగిస్తుంది కనుక మీరు మీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు కొత్త ఉద్యోగం కోసం లేదా, మీ ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నట్లయితే, ఈ సంవత్సరం ఏప్రిల్ మరియు జులై మధ్యన లేదా సంవత్సరం చివరలో అనుకూలమైన ఫలితాన్ని పొందుతారు. విశ్రాంతి లేని మీ పని కారణంగా మీకు చాలా మానసిక ఒత్తిడి ఉండవచ్చు. మీ అహం కారణంగా మీరు ఒకేసారి అనేక పనులు చేయడానికి ప్రయత్నిస్తారు. దాని కారణంగా మీరు వాగ్ధానం చేసిన పనిని సకాలంలో పూర్తి చేయక పోవచ్చు కనుక ఇది మీ కెరీర్ లో మీకు సమస్యను కలిగించవచ్చు. కొన్ని సార్లు మీరు అత్యాశకు లోనవటం మరియు తక్కువ సమయంలో పేరు మరియు కీర్తిని పొందడానికి ప్రయత్నిస్తారు. మీరు చేసే ప్రయత్నాల్లో విజయం సాధించడానికి మీరు స్వయంకృషిని నమ్ముకోవాలి తప్ప ప్రయత్నం లేకుండా కేవలం అదృష్టం తో సాధించాలని చూడకండి.
వ్యాపారం మరియు స్వయం ఉపాధి
ఈ సంవత్సరం శని గోచారం పదవ మరియు పదకొండవ ఇళ్లలో ఉంటుంది. దీని వల్ల మీకు జీవితంలో పురోగతి ఉంటుంది. మీరు వ్యాపారంలో ఆశించిన లాభాన్ని పొందుతారు మరియు దానిలో అభివృద్ధిని సాధిస్తారు. అయితే సంవత్సరమంతా గురువు పన్నెండవ ఇంటిలో సంచరించడం, కేతువు ఏడవ ఇంటిలో సంచరించడం కారణంగా వ్యాపారంలో మరియు ఆర్థికంగా కొంత సమస్యకు గురయ్యే అవకాశం ఉంటుంది. భాగస్వాముల మధ్య మనస్పర్థలు ఏర్పడడం వలన వ్యాపారంలో అనుకోని మార్పులు చోటు చేసుకుంటాయి. ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో తిరిగి వత్సరాంతంలో శని గోచారం అనుకూలంగా ఉండటం వలన ఆర్థిక సమస్యల నుంచి బయట పడే అవకాశం ఉంటుంది. వ్యాపార విషయంలో ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపార విషయంలో తొందర పడకుండా ఆలోచనతో ముందడుగు వేయడం మంచిది. రాజకీయాల్లో ఉన్నవారికి ద్వితీయార్థంలో ముఖ్యమైన స్థానం పొందే అవకాశాలు ఉన్నాయి మరియు దీనికి సంబంధించి, మీరు కొంతమంది రాజకీయ ప్రముఖులను కలుస్తారు. కళాకారులు అలాగే స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. కొన్ని సార్లు అనాలోచిత చర్యల కారణంగా మంచి అవకాశాలను కోల్పోతారు. మీ ప్రవర్తన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. మీరు లేని గొప్పతనాన్ని ఆపాదించు కోవడం కానీ లేదా అహంకారంతో వచ్చిన మంచి అవకాశాలను వదిలించుకోవడం కానీ చేసే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో ఆచితూచి అడుగు వేయండి.
కుటుంబం
ఈ సంవత్సరమంతా గురువు, రాహువు మరియు కేతువుల గోచారం అనుకూలంగా లేకపోవడం అలాగే సప్తమ స్థానంపై శని దృష్టి కారణంగా మీ జీవిత భాగస్వామితో మీకు మనసు పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ అతి జాగ్రత్తవల్ల కానీ, మీ అహంభావం వల్ల కానీ మీ జీవిత భాగస్వామికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంటుంది. వారిపై పెత్తనం చెలాయించాలని అనుకునే బదులు వారిని అర్థం చేసుకుని మెలగడం మంచిది. గురువు గోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన మీ సంతానంలో ఒకరికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వారి విషయం లో డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. మీరు చేసే పనుల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడటం వలన కలిగే అసహనం మీ కుటుంబం పై చెడు ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. దాని కారణంగా మీ కుటుంబంలో మీ పై ఉన్న గౌరవమర్యాదలు తగ్గటం లేదా మిమ్మల్ని లక్ష్యపెట్టక పోవటం జరగవచ్చు. వీలైనంత వరకు చెప్పుడు మాటలు వినకుండా మీ ఆలోచనలను ఇతరులు ప్రభావితం చేయకుండా చూసుకోవడం వల్ల మీరు మీ ఇంటిలో ఆనందంగా ఉండగలుగుతారు. సప్తమంలో కేతు సంచారం కారణంగా మీ జీవిత భాగస్వామికి కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే జూలై వరకు సమయం అనుకూలంగా ఉండటం వలన వారి విషయంలో ఎక్కువ ఆందోళన అవసరం లేదు. ఈ సంవత్సరం కొత్త పరిచయాలు స్నేహాలు ఏర్పడతాయి అలాగే పాత స్నేహితుల్లో కొంత మందిని కోల్పోవడం జరుగుతుంది.
పరిహారములు
ఈ సంవత్సరం మీరు గురువుకు, రాహువు మరియు కేతువులకు పరిహారాలు చేయడం మంచిది. ఈ సంవత్సరం ఈ మూడు గ్రహాలు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఆర్థికంగా, కుటుంబ పరంగా మరియు ఆరోగ్యపరంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మూడు గ్రహాలు శాంతించడానికి వీటికి జప, హోమ, దానాది పరిహారాలు ఆచరించడం మంచిది. గురు గ్రహానికి చేయవలసిన పరిహారాలు: ప్రతిరోజు మీరు, గురు గ్రహ సంబంధ స్తోత్రములు చదవడం కానీ, గురు పూజ చేయడం కానీ చేయాలి. లేదా గురు మంత్ర జపం 16,000 సార్లు చేయాలి. ఒకవేళ ఈ చెడు ప్రభావం ఎక్కువగా ఉన్నట్లయితే గురు గ్రహ జపం తో పాటుగా గురు గ్రహ శాంతి హోమం చేయించుకోవటం మంచిది. రాహు గ్రహ దోష పరిహారం కొరకు ప్రతి రాహు స్తోత్రం చదవడం కానీ, దుర్గా స్తోత్రం చదవడం గాని చేయాలి. లేదా 18,000 సార్లు రాహు మంత్ర జపం చేయాలి. రాహువు ఇచ్చే చెడు ప్రభావం అధికంగా ఉన్నట్లయితే రాహు గ్రహ శాంతి జరిపించు కోవడం మంచిది. కేతు గ్రహ దోష పరిహారం కొరకు ప్రతిరోజు కేతు స్తోత్రం పారాయణం చేయడం లేదా గణపతి స్తోత్రం పారాయణం చేయడం మంచిది. లేదా ఏడువేల సార్లు కేతుజపాన్ని చేయవచ్చు. కేతువు ఇచ్చే చెడు ప్రభావం అధికంగా ఉన్న వాళ్ళు కేతుగ్రహ శాంతి చేసుకోవడం మంచిది. మీ జాతకంలో పైన చెప్పిన గ్రహాల యొక్క దశ అంతర్దశలు ఈ సమయములో నడుస్తున్నట్లు అయితే వాటి ప్రభావము అధికంగా ఉంటుంది. పైన చెప్పిన పరిహారములు మీ శక్తి, భక్తి మరియు శ్రద్ధ మేరకు ఏ పరిహారం అయినా పాటించవచ్చు. అంతేకానీ చెప్పిన పరిహారములు అన్ని పాటించమని చెప్పడం లేదు. ఈ గ్రహాల పరిహారాలు తో పాటుగా వీలైనంత వరకూ తోచిన విధంగా అవసరం ఉన్నవారికి సేవ చేయడం మంచిది.