వైజాగ్ డేటా సెంటర్‌పై జగన్ కామెంట్స్.. క్రెడిట్ అంతా మాదేనంటూ..
YS Jagan: వైఎస్ జగన్, గూగుల్-అదానీ డేటా సెంటర్ ప్రాజెక్ట్ క్రెడిట్ విషయంలో సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలోనే అదానీతో ఒప్పందం చేసుకుని, భూమి కేటాయించి, శంకుస్థాపన చేసిందన్నారు.

గూగుల్ డేటా సెంటర్‌పై కీలక కామెంట్స్
గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ క్రెడిట్ విషయంలో సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విశాఖపట్నంలో రాబోయే 1000 మెగావాట్ల గూగుల్ ప్రాజెక్టును తన ఘనతగా చంద్రబాబు ప్రచారం చేసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ ప్రాజెక్టుకు అదానీ, వైసీపీ, కేంద్ర ప్రభుత్వ కృషి లేకుంటే.. ఇది సాధ్యమయ్యేది కాదని జగన్ స్పష్టం చేశారు.
వైఎస్ జగన్ వివరణ
అదానీ, గూగుల్ మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయని, 'భారతదేశంలోనే అతిపెద్ద AI డేటా సెంటర్ క్యాంపస్‌ను విశాఖపట్నంలో నిర్మించడానికి Googleతో భాగస్వామ్యం కావడం Adaniకి గర్వకారణం అని అదానీనే స్వయంగా ట్వీట్ చేశారని జగన్ గుర్తుచేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, 2020లో అదానీ డేటా సెంటర్ కోసం ఒప్పందం చేసుకుని, శంకుస్థాపన కూడా జరిగిందని వైఎస్ జగన్ వివరించారు.
మధురవాడలో 130 ఎకరాలు..
300 మెగావాట్ల డేటా సెంటర్ కోసం విశాఖపట్నంలోని మధురవాడలో 130 ఎకరాలు, కాపులపాడులో 60 ఎకరాలు కలిపి మొత్తం 190 ఎకరాలను అదానీకి కేటాయించామని ఆయన తెలిపారు. అలాగే, సింగపూర్ నుండి విశాఖపట్నంకు సబ్ సీ కేబుల్‌ను తీసుకురావడానికి అంకురార్పణ కూడా ఆనాడే జరిగిందని జగన్ వెల్లడించారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కీలకం
డేటా సెంటర్లు ప్రత్యక్ష ఉద్యోగాలను తక్కువగా సృష్టించినప్పటికీ, అవి ఒక ఎకోసిస్టమ్‌ను నిర్మిస్తాయని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి భవిష్యత్ టెక్నాలజీలకు నోడల్ పాయింట్‌గా మారతాయని ఆయన పేర్కొన్నారు. డేటా సెంటర్ల ద్వారా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు) వస్తాయని, ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కీలకమని అన్నారు.
300 మెగావాట్ల డేటా సెంటర్
కేవలం 300 మెగావాట్ల డేటా సెంటర్‌తో ఆగకుండా, అదానీతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఐటీ పార్కు, రిక్రియేషన్ సెంటర్, స్కిల్ యూనివర్సిటీ/కాలేజ్ వంటివి ఏర్పాటు చేయడం ద్వారా 25,000 ఉద్యోగాలను సృష్టించే లక్ష్యం తమకు ఉండేదని వైఎస్ జగన్ తెలిపారు. క్రెడిట్ చోరీ చేయడంలో చంద్రబాబుకి ఇది కొత్త కాదని, గతంలో కూడా ఇలాంటి వ్యవహారాలు అనేకం ఉన్నాయని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.