Andhra: అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు.. ఎక్కడంటే.?
Andhra: ఆంధ్రప్రదేశ్ లో పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేయనున్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. 58 అడుగుల ఈ విగ్రహ నమూనాలను తాజాగా పరిశీలించారు చంద్రబాబు. ఆ వివరాలు ఇలా..

58 అడుగుల ఎత్తైన పొట్టి శ్రీరాములు విగ్రహం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం స్థాపనకు సమయం ఆసన్నమైంది. అమరజీవికి నివాళులు అర్పిస్తూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన బుధవారం రాష్ట్ర సచివాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల ఎత్తైన విగ్రహం డిజైన్లను పరిశీలించారు.
విగ్రహ స్థాపన ఎక్కడంటే
ఈ విగ్రహాన్ని శాకమురు వద్ద అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక ట్రస్ట్‌కు ప్రభుత్వం కేటాయించిన 6.8 ఎకరాల స్థలంలో ప్రతిష్టించనున్నారు. ఈ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలను త్యాగం చేసిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడికి అంకితం చేసిన స్మృతి వనంగా అభివృద్ధి చేయనున్నారు.
గత నెలలో మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన
ఈ స్మారక ఉద్యానవనానికి గత నెలలో మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకుని వచ్చే ఏడాది మార్చి 16న విగ్రహాన్ని ఆవిష్కరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. "స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్" అనే పేరిట ఈ విగ్రహం తరతరాలుగా గుర్తుండిపోయేలా తీర్చదిద్దనున్నారు. ధైర్యం, నిస్వార్థతకు ఈ విగ్రహం చిహ్నంగా నిలవనుంది.
1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు
పొట్టి శ్రీరాములు త్యాగం వల్లే ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. తెలుగు ప్రజలకు కొత్త రాష్ట్రం ఏర్పాటులో ఆయన 58 రోజుల ఉపవాసం కీలక పాత్ర పోషించింది. తెలుగు వారు చేత 'అమరజీవి'గా పిలిపించుకునే పొట్టి శ్రీరాముల 58 రోజుల ఉపవాసం కారణంగా 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో ఆ సమయంలో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కీలకమైన పరిణామంగా మారింది. కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటికీ, తరువాత 1956లో తెలంగాణ విలీనం తర్వాత అది ఆంధ్రప్రదేశ్‌గా రూపాంతరం చెందింది. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్ రాజధానిగా మారింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ నిస్వార్థ నాయకుడిగా..
2014లో ఏపీ, తెలంగాణగా విడిపోయినప్పటికీ, పొట్టి శ్రీరాములును రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇప్పటికీ నిస్వార్థ నాయకుడిగా గౌరవిస్తున్నారు. దివంగత నేత పొట్టి శ్రీరాములుకు నివాళిగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అమరజీవి పేరుతో ఒక స్మారక ఉద్యానవనాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారు. అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మారక చిహ్నాన్ని నిర్మించడంతో పాటు, చంద్రబాబు ప్రభుత్వం ఆయన గ్రామమైన పడమటిపల్లిని అభివృద్ధి చేయాలని, ఆయన జ్ఞాపకార్థం ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలని కూడా యోచిస్తోంది.