- Home
- Andhra Pradesh
- ఫేస్బుక్ ప్రేమ.. పెళ్లి పేరుతో రూ.కోటి ఖర్చు చేయించి.. ముఖం చాటేసిన యువతి..ట్విస్ట్ ఏంటంటే..
ఫేస్బుక్ ప్రేమ.. పెళ్లి పేరుతో రూ.కోటి ఖర్చు చేయించి.. ముఖం చాటేసిన యువతి..ట్విస్ట్ ఏంటంటే..
ఫేస్ బుక్ లో పరిచయం అయిన ఓ యువతి పెళ్లి చేసుకుంటానని చెప్పి.. నిశ్చితార్థం అయిన తరువాత.. పెళ్లికి నో చెప్పింది. ఇప్పటికే యువకుడితో కోటి రూపాయలు ఖర్చు పెట్టించింది.

చిత్తూరు : ఫేస్బుక్ పరిచయాలు.. ప్రేమా పెళ్లి పేరుతో మోసాలు చేయడం.. దొరికినంత వరకు డబ్బు దండుకుని మొహం చాటేయడం.. ఇప్పటివరకు ఇలాంటి నేరాల్లో అమ్మాయిలే బాధితులుగా ఉండడం చూశాం. కానీ, తాజాగా ఓ యువకుడు ఇలాంటి ఘటనలో చిక్కుకుని కోటి రూపాయల దాకా నష్టపోయిన ఘటన చిత్తూరులో వెలుగు చూసింది. ఫేస్బుక్లో పరిచయమైన ఓ యువతిని ఇష్టపడిన ఆ యువకుడు పెళ్లి చేసుకోవాలని అడిగాడు.
దానికి ఒప్పుకున్న ఆమె.. అతనితో దాదాపు కోటి రూపాయల వరకు ఖర్చు చేయించింది. ఆ తర్వాత ముఖం చాటేసింది. పెళ్లి చేసుకోనని చెప్పింది. దీంతో హతశుడైన యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు శుక్రవారంనాడు చిత్తూరు వన్ టౌన్ పోలీసులు ఆ యువతి మీద కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. చిత్తూరులోని బీవీ రెడ్డి కాలనీకి చెందిన రవిబాబుకు స్వీట్స్ షాప్ ఉంది. రవిబాబు కుమారుడు వైష్ణవ్ (28). అతనికి ఫేస్బుక్లో ఏడాది కిందట ఓ యువతి పరిచయమైంది.
ఈ పరిచయం కాస్త కొద్ది రోజులకు ప్రేమగా మారింది. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. దీనికి వీరి కులాలు వేరైనా కూడా ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకున్నారు. దీంతో నిరుడు నవంబర్లో నిశ్చితార్థం కూడా జరిగింది. మొన్న మార్చి 10వ తేదీన పెళ్లి జరగాల్సి ఉంది.కాబోయే భార్య కావడంతో పెళ్లి ఖర్చులకోసం యువతి మీద వైష్ణవ్ దాదాపుగా రూ.28 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు.
money
దీనికి తోడు ఎంగేజ్మెంట్ సమయంలో రూ. 15 లక్షల విలువ చేసే బంగారు నగలు, రెండు లక్షల రూపాయల విలువైన డైమండ్ రింగ్, రూ. 10 లక్షల వరకు ఈ వేడుక కోసం వైష్ణవ్ ఖర్చు పెట్టాడు. పెళ్లి తర్వాత చిత్తూరులో ఇచ్చే విందు ఇతర పనుల కోసం రూ. 30 లక్షల వరకు ఖర్చు చేశారు.పెళ్లికి ఒక నెల రోజుల ముందు ఫిబ్రవరి 8వ తేదీన సదరు యువతి వైష్ణవ కు ఫోన్ చేసింది. హైదరాబాదులో ఉంటున్న ఆ యువతి రూ. 7 లక్షలు కావాలని అడిగింది.
దీంతో వైష్ణవ్ రూ. ఐదు లక్షలు తీసుకొని హైదరాబాద్ కు వచ్చాడు. మిగిలిన రెండు లక్షలు తండ్రిని తీసుకురమ్మని చెప్పాడు. ఆ డబ్బులతో తండ్రి కొడుకులిద్దరూ యువతిని కలిశారు. అయితే ఆ సమయంలో ఆమెతో పాటే ఉన్న బంధువులు.. మీరు తమ హోదాకు సరిపోరు అని చెబుతూ..పెళ్లి చేసుకోవడం కుదరదని చెప్పారు. దీంతో షాక్ అయిన తండ్రీకొడుకులు చిత్తూరుకు వచ్చి.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అయితే ఈ కేసులో మరో ట్విస్ట్ ఏంటంటే.. సంగీత్ ఫంక్షన్లో వైష్ణవ్ మద్యం మత్తులో యువతి మీద దాడి చేశాడంటూ.. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో… యువతి కుటుంబ సభ్యులు, స్నేహితులు వైష్ణవ్ మీద కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో అసలు విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంది.