వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్: వైసీపీలోకి గంటా శ్రీనివాస రావు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారనే ఊహాగానాలు మరోసారి చెలరేగుతున్నాయి. గతంలో కూడా పలుమార్లు ఆయన వైసీపిలో చేరే అవకాశాలున్నట్లు ప్రచారం జరిగింది
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారనే ఊహాగానాలు మరోసారి చెలరేగుతున్నాయి. గతంలో కూడా పలుమార్లు ఆయన వైసీపిలో చేరే అవకాశాలున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, ఆయన చాలా కాలంగా మౌనంగా ఉంటున్నారు. టీడీపీ కార్యక్రమాలకు కూడా పెద్దగా హాజరు కావడం లేదు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు కార్యక్రమాలకు కూడా దూరంగానే ఉంటూ వచ్చారు
గంటా శ్రీనివాస రావు టీడీపీ నుంచి బయటకు రావాలని చూస్తున్నారనే సంకేతాలను మాత్రం ఆయన ఇచ్చారని అంటున్నారు. ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గంటా శ్రీనివాస రావుపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. సైకిళ్ల కొనుగోళ్లలో గంటా అవినీతికి పాల్పడినట్లు ఆయన ఆరోపించారు. మంత్రి అవంతి శ్రీనివాస రావు కూడా అదే రకమైన వ్యాఖ్యలను అన్యాపదేశంగా చేశారు. దానివల్లనే గంటా శ్రీనివాస రావు పార్టీ మారుతారనే ప్రచారాలు ముందుకు వచ్చాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి
గంటా శ్రీనివాస రావు వైసీపిలో చేరడానికి ముహూర్తం కూడా ఖరారైనట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడొకరి ద్వారా గంటా రాయబారం నడిపినట్లు చెబుతున్నారు. పార్టీలో చేర్చుకోవడానికి జగన్ పచ్చజెండా ఊపారని కూడా అంటున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంంగా ఆగస్టు 15వ తేదీన వైఎస్ జగన్ ఇళ్ల పట్టాల పంపిణీని చేపట్టనున్నారు. ఆ కార్యక్రమం వేదిక మీదనే గంటా వైసీపీలో చేరుతారని అంటున్నారు
గంటా శ్రీనివాస రావు ఇప్పటికే మూడు సార్లు పార్టీ మారారు. టీడీపీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన 2009లో చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అనకాపల్లి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెసులో విలీనం చేయడంతో ఆయన కాంగ్రెసు సభ్యుడయ్యారు. మంత్రి పదవిని కూడా చేపట్టారు
రాష్ట్ర విభజన తర్వాత ఆయన తిరిగి టీడీపీలోకి వచ్చారు. భిమీలి నుంచి పోటీ చేసి మరోసారి విజయం సాధించారు. 2014 నుంచి 2019 వరకు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మూడో సారి ఆయన ఎమ్మెల్యే అయ్యారు. వైసీపిలో చేరడానికి ఆయన కొంత మంది కీలక నేతల ద్వారా అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు చెబుతున్నారు