కారు డ్రైవర్ తో వివాహేతర సంబంధం.. పెళ్ళి చేసుకుంటానన్నాడని భర్త దారుణ హత్య..
వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్యను అతి దారుణంగా హత్య చేయించిందో భార్య. ఆ తరువాత భర్తను ఎవరో చంపారని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
గుంటూరు : జూలై 1వ తేదీన గుంటూరు రూరల్ ఏటుకూరుకు చెందిన షేక్ బాషా అలియాస్ అమీర్ వలీ(30) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు సంబంధించి పోలీసులు నిందితురాలిగా భార్యను తేల్చారు. అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని.. ప్రియుడితో కలిసి పథకం ప్రకారం హత్య చేసినట్లుగా పేర్కొన్నారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో హత్యకు సహకరించిన వ్యక్తితో పాటు మరో ముగ్గురిని నల్లపాడు పోలీసులు అరెస్టు చేశారు.
ఈ మేరకు వివరాలను దక్షిణ సబ్ డివిజన్ డిఎస్పి మహబూబ్ పాషా వెల్లడించారు. బుధవారం దక్షిణ సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసులో ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఏటుకూరులోని పొలాల సమీపంలో ఉన్న సాయి ఎస్టేట్స్ ఫ్లాట్స్ దగ్గర కృష్ణ బాబు కాలనీ మూడో వీధిలో షేక్ బాషా ఉండేవాడు. అతను జూలై 1న దారుణ హత్యకు గురయ్యాడు.
తన భర్త మృతి మీద షేక్ బాషా భార్య షాహీనా నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు హత్యానేరం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. అయితే, హత్యా స్థలంలో పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. నిందితులు అత్యంత జాగ్రత్తగా పథకం పన్నారు.
కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు.. భార్య ప్రవర్తన మీద అనుమానం వచ్చింది. దీంతో ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఈ కేసును చేదించడానికి ప్రయత్నించారు. దీంతో విషయం వెలుగు చూసింది. భార్యనే వేరే వ్యక్తితో తనకున్న వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని పథకం ప్రకారం ప్రియుడితో కలిసి హతమార్చిందని తేలింది.
షేక్ బాషా అలియాస్ అమీర్ వలి, షాహీనల వివాహం పదేళ్ల క్రితం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అమీర్ వలి లారీలకు రంగులు వేసే పనులకు వెళుతుండేవాడు. షాహీన ఏటుకూరులో ఉన్న ఫ్లాట్స్ లో ఆయాగా పనిచేస్తుంది. ఆ ఫ్లాట్స్ లోనే షేక్ షబ్బీర్ అనే వ్యక్తి కార్ డ్రైవర్ గా పనిచేసేవాడు. అలా వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధంగా మారింది.
గత ఆరు నెలలుగా వీరి సంబంధం కొనసాగుతోంది. షేక్ షబ్బీర్ కు పెళ్లి కాలేదు. అతను షాహీనను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అయితే దీనికి భర్త అడ్డంగా ఉన్నాడు కాబట్టి అతనిని అంతమొందించాలని పథకం వేశారు. దీనికోసం తమ బంధువైన నల్లచెరువు 25వ వీధి దర్గా వెనుక ఉంటున్న షేక్ రఫీ సహాయాన్ని తీసుకున్నారు.
రఫీ.. పథకంలో భాగంగా.. అమిర్ వలీతో లారీ యజమాని అని చెబుతూ పరిచయం చేసుకున్నాడు. పనులు ఇప్పిస్తానంటూ తరచుగా ఫోన్లో మాట్లాడుతుండేవాడు. ఈ పరిచయంతో ఇద్దరు కలిసి అప్పుడప్పుడు మద్యం కూడా తాగుతుండేవారు. జులై ఒకటో తేదీన అనుకున్న ప్లాన్ ప్రకారం.. సాయి ఎస్టేట్స్ పొలాల దగ్గరికి అమీర్ వలీని పిలిచారు.
ఆ తర్వాత అతనికి ఎక్కువ మద్యం తాగించి.. ఆ మత్తులో ఉండగా షేక్ షబ్బీర్, రఫీలు రాడ్లు, కత్తులతో కొట్టి క్రూరంగా హతమార్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు మృతుడి భార్య మీద అనుమానం వచ్చింది.
దీంతో మృతుడి సెల్ఫోన్ కాల్ లిస్టును పరిశీలించారు. దీని ప్రకారం భార్య నిందితురాలిగా తేలడంతో.. మృతిని భార్యతో పాటు మరో ఇద్దరినీ బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన మోటార్ సైకిల్ ఫోర్క్ రాడ్, మోటార్ సైకిల్, కత్తిలను స్వాధీనం చేసుకున్నారు.