MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Andhra pradesh: వర్మకు ఎందుకీ భంగపాటు, పవన్‌ కూడా కాపాడలేకపోయారా.? అసలు కారణం అదేనా.?

Andhra pradesh: వర్మకు ఎందుకీ భంగపాటు, పవన్‌ కూడా కాపాడలేకపోయారా.? అసలు కారణం అదేనా.?

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు గాను కూటమి ప్రభుత్వం జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇందులో ఓ పేరు కచ్చితంగా ఉంటుందని అంతా భావించారు. కానీ దీనికి భిన్నంగా టీడీపీ అధిష్టానం తీసుకుంది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు ఎమ్మెల్సీ కచ్చితంగా ఇస్తారని అంతా భావించారు. అయితే చివరి క్షణంలో మొండి చేయి ఇవ్వడంతో ఇప్పుడీ అంశం హాట్‌ టాపిక్‌గా మారింది..  

4 Min read
Narender Vaitla
Published : Mar 11 2025, 11:35 AM IST| Updated : Mar 11 2025, 11:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

వర్మ.. గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఈ పేరు పెద్దగా పరిచయం లేదు. అయితే ఎప్పుడైతే పవన్‌ కళ్యాణ్‌ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నారన్న వార్తలు వచ్చాయో ఒక్కసారిగా వర్మ పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగింది. జనసేన అధినేత పవన్‌ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగడంతో పొత్తులో భాగంగా వర్మ ఆ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అయితే వర్మకు సీటు కేటాయించకపోవడంతో మొదట వర్మ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ చంద్రబాబు నాయుడు బుజ్జగించడంతో వర్మ శాంతించారు. అధిష్టానం ఆదేశాల మేరకు పిఠాపురంలో పవన్‌ కోసం ప్రచారం చేపట్టారు. 

అసెంబ్లీ ఎన్నికల సమయంలో పవన్‌ రాష్ట్రంలోని ఇతర ప్రదేశాల్లో ప్రచారానికి వెళ్లిన సమయంలో వర్మ నియోజకర్గంలో ఉంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అందరి ఊహలకు అందని విధంగా పవన్‌ పిఠాపురంలో అత్యంత భారీ మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించారు. పవన్‌ రాజకీయ చరిత్రలో తొలి విజయాన్ని అందించిన స్థానంగా పిఠాపురంకు గుర్తింపు ఉంది. దీంతో పవన్ పలుసార్లు వర్మకు కృతజ్ఞతలు తెలిపారు. తన విజయంలో వర్మ కీలక పాత్ర పోషించారంటూ కితాబు కూడా ఇచ్చారు. ఎమ్మెల్యే స్థానాన్ని త్యాగం చేసినందుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని చంద్రబాబు నుంచి వర్మకు స్పష్టమైన హామీ వచ్చిందని గతంలో వార్తలు వచ్చాయి. దీంతో వర్మ కూడా పార్టీ ఆదేశాల మేరకు పని చేసుకుంటూ వెళ్లారు. 
 

24

పట్ట భద్రుల ఎమ్మెల్సీలో మొండి చేయి: 

ఇదిలా ఉంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరిగిన గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వర్మకు కచ్చితంగా అవకాశం ఇస్తారని అంతా భావించారు. అయితే అందుకు భిన్నంగా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీంతో వర్మ కాస్త అసంతృప్తి గురయ్యారని అప్పట్లో వార్తలు వచ్చాయి. 

తాజాగా మరోసారి భంగపాటు: 

కాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయినా సీటు కేటాయిస్తారని వర్మ ధీమాతో ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా వర్మకు మరోసారి భంగపాటు ఎదురైంది. మొత్తం ఐదు సీట్లకు గానూ టీడీపీకి మూడు సీట్లు, జనసేనకు ఒక సీటు.. బీజేపీకి ఒక సీటు దక్కాయి. పిఠాపురం టీడీపీ రీజినల్ కో ఆర్డినేటర్‌గా ఉన్న వర్మకు చంద్రబాబు మరోసారి షాక్‌ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 

34

పవన్‌ ఏం చేయలేకపోయారా? 

కాగా తన విజయంలో వర్మ పాత్ర కూడా ఉందని పలుసార్లు చెప్పిన పవన్‌ కళ్యాణ్‌ కూడా వర్మకు సాయం చేయలేకపోయారా? అన్న చర్చ సోషల్‌ మీడియా వేదికగా జరుగుతోంది. సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్సీని సాధించిన పవన్‌, తనకు ఎంతగానో సహకరించిన వర్మను ఇలా వదిలేశారంటూ వర్మ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే సీటును త్యాగం చేసిన వర్మకు మంచి పదవి ఇస్తామని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ అప్పట్లో హామీ ఇచ్చారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక పలు పదవుల భర్తీ జరిగినా వర్మకు మాత్రం ఎలాంటి పోస్టు దక్కలేదు. చివరకు ఎమ్మెల్సీ సీటు అయినా దక్కుతుందని ఆశపడిన వర్మకు మరోసారి నిరాశే ఎదురైంది.

పైకి బాగున్నా లోలోపల మాత్రం: 

కచ్చితంగా ఎమ్మెల్సీ వస్తుందని ఆశించి భంగపడ్డ వర్మ తీవ్ర నిరాశలో మునిగారు. పార్టీ కోసం త్యాగం చేసిన తనకు తగిన శాస్తి జరిగిందని అనుచరులు దగ్గర వాపోయారని తెలుస్తోంది. అయితే వెంటనే అలర్ట్‌ అయిన టీడీపీ హైకమాండ్‌ రంగంలోకి దిగి వర్మ బుజ్జగించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పిఠాపురంలోని తన ఆఫీసులో కార్యకర్తలతో సమావేశమైన వర్మ. పదవి ఇవ్వాలంటే కొన్ని కూడికలు, ప్లస్‌లు, మైనస్‌లు చూడాల్సి వస్తోందన్నారు. 'రాజకీయాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. నియోజకవర్గస్థాయిలోనే పదవులు విభజించాలంటే మథనపడతాం. అలాంటిది రాష్ట్రవ్యాప్తంగా పదవులు ఇవ్వాలంటే అనేక ఇబ్బందులు ఉంటాయి. ఆ పరిస్థితులను అర్థం చేసుకుంటాం. తెదేపా అధినేత, సీఎం చంద్రబాబుతో 23 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో సమస్యలపై పనిచేశాం. చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ ఆదేశాలకు నాతో పాటు నా కుటుంబం, పిఠాపురం నియోజకవర్గ తెదేపా కార్యకర్తలు కట్టుబడి ఉంటారు. పార్టీ కార్యకర్తల కష్టాల్లో తోడుగా ఉంటాం' అని చెప్పుకొచ్చారు. అయితే పైకి బాగానే కనిపిస్తున్నా వర్మ మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. అయితే ఇప్పటికప్పుడు వర్మ పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదని, మరికొన్ని రోజులు వేచి చూసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 

అసలు కారణం అదేనా.? 

ఇదిలా ఉంటే వర్మకు ఎలాంటి పదవి దక్కకపోవడానికి జనసేన కూడా ఒక కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. పిఠాపురంలో రెండో అధికార కేంద్రం ఉండకూడదనే ఉద్దేశంతోనే వర్మను పక్కనపెడుతున్నారనే చర్చ నడుస్తోంది. పిఠాపురంలో పవన్‌ కళ్యాణ్‌ ఒక్కరే బలమైన నాయకుడిగా ఎదగాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే ఇందులో నిజం లేదని వర్మను ఎంపీగా ప్రమోట్‌ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇటీవలే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో పంపిస్తారనే ప్రచారం సాగుతోంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వస్తే కానీ తెలియదు. 
 

44

ఇదీ వర్మ ప్రస్థానం: 

SVSN వర్మ తెలుగుదేశం ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు 2014లో టీడీపీ టికెట్ రాక స్వతంత్ర అభ్యర్థిగా (టీడీపీ రెబల్‌గా) పోటీ చేసి తన సమీప అభ్యర్థి వైసీపీ అభ్యర్థి పెండెం దొరబాబుపై 47080 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడంతో తిరిగి 22 మే 2014న టీడీపీలో చేరారు.

కాగా 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప అభ్యర్థి వైసీపీ అభ్యర్థి పెండెం దొరబాబు చేతిలో 14992 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2021లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితుడయ్యారు. 2024 శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ జతకట్టడంతో పిఠాపురం సీటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు వదులుకోవలసి వచ్చింది. పార్టీ కోరిక మేరకు కూటమి తరపున పనిచేసి పవన్ కళ్యాణ్ విజయానికి కృషి చేశారు వర్మ. 

About the Author

NV
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Recommended image2
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
Recommended image3
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved