ఏపీలో ఇన్వెస్ట్‌మెంట్ బూం.. 16.13 లక్షల ఉద్యోగాలు
Visakhapatnam Summit : విశాఖ భాగస్వామ్య సదస్సులో మూడు రోజుల్లో రూ. 13.25 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి. దీంతో 16.13 లక్షల ఉద్యోగాలు లభించనున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.

విశాఖ తీరాన భారీ పెట్టుబడుల వెల్లువ
విశాఖపట్నం సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజు తర్వాత పెట్టుబడుల రూపంలో వచ్చిన స్పందన, ప్రభుత్వ అంచనాలను మించి సాగింది. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ మహాసదస్సులో మొత్తం 613 ఎంఓయూలు కుదిరి, రూ. 13,25,716 కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. ఈ పెట్టుబడుల ద్వారా 16,13,188 మంది యువతకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయని అధికారులు తెలిపారు.
విశాఖ సాగర తీరాన ఏర్పాటుచేసిన ఈ ఇంటర్నేషనల్ సమ్మిట్‌కు దేశ విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు పెద్దఎత్తున తరలి రావడం, ఆంధ్రప్రదేశ్‌పై పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనంగా ప్రభుత్వం భావిస్తోంది. తొలి రెండు రోజుల్లోనే భారీగా పెట్టుబడులు కుదుర్చుకోవడంతో, ఎంఓయూ ప్రక్రియను మూడో రోజుకు పొడిగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
చంద్రబాబు కృషికి ఫలితం… విశాఖలో పెట్టుబడుల పంట పండింది
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా పెట్టుబడుల రాబడిపై దృష్టి పెట్టారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఎస్ఐపీబీ సమావేశాలు నిర్వహిస్తూ, పెట్టుబడులకు మార్గం సుగమం చేశారు. అదనంగా, సింగపూర్, యూఏఈ, లండన్ వంటి దేశాల్లో పర్యటిస్తూ గ్లోబల్ ఇండస్ట్రీ లీడర్లను స్వయంగా ఆహ్వానించారు.
ఈ కృషి ఫలితంగానే మొదట అంచనా వేసిన రూ. 10 లక్షల కోట్లకు మించి, మొత్తం రూ. 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు ముగింపునకు చేరాయి. అంటే ప్రభుత్వ అంచనాల కంటే 30 శాతం అదనంగా పెట్టుబడులు వచ్చాయని అధికారులు తెలిపారు. పెట్టుబడి దారులకు ఏపీపై ఏర్పడిన నమ్మకం మరింత బలపడిందని అభిప్రాయపడ్డారు.
సీఎం సమక్షంలో భారీగా ఎంఓయూలు
మొత్తం మూడు రోజులలో కుదిరిన పెట్టుబడుల్లో సగానికి పైగా సీఎం సమక్షంలోనే జరిగాయి. చంద్రబాబు సమక్షంలో కుదిరిన ఒప్పందాల విలువ రూ. 7,63,210 కోట్లకు చేరింది. ఈ పెట్టుబడులు మొత్తం 123 ఎంఓయూల ద్వారా కుదిరాయి.
రోజువారీ ప్రకారం చూస్తే..
• మొదటి రోజు: రూ. 3,65,304 కోట్లు
• రెండో రోజు: రూ. 3,49,476 కోట్లు
• మూడో రోజు: రూ. 48,430 కోట్లు
అదనంగా, మంత్రుల సమక్షంలో కుదిరిన పెట్టుబడులు రూ. 5,62,506 కోట్లకు చేరగా, వీటి కోసం మొత్తం 490 ఎంఓయూలు కుదిరాయి. ఐటీ మంత్రి నారా లోకేష్ సహా పలు శాఖల మంత్రులు పెట్టుబడులు కుదుర్చడంలో కీలక పాత్ర పోషించారు.
12 రంగాల్లో భారీ పెట్టుబడులు… టాప్-3లో విద్యుత్, పరిశ్రమలు, మౌళిక వసతులు
ఈసారి పెట్టుబడులు అత్యధికంగా 12 కీలక రంగాల్లో నమోదయ్యాయి. విద్యుత్ రంగం పెట్టుబడుల్లో టాప్‌లో నిలిచి, రూ. 5,33,351 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. ఈ రంగం ద్వారా 2,66,722 ఉద్యోగాలు సృష్టించనున్నట్లు కంపెనీలు వెల్లడించాయి.
పరిశ్రమల రంగం రూ. 2,80,384 కోట్లు పెట్టుబడులు తీసుకొని రెండో స్థానంలో నిలిచింది. మౌళిక వసతుల రంగానికి రూ. 2,01,758 కోట్ల పెట్టుబడులు ప్రవేశించాయి. ఉద్యోగాల కల్పనలో పరిశ్రమలు, మౌళిక వసతులు, ఐటీఈ అండ్ సీ రంగాలు టాప్‌లో నిలవడం గమనార్హం.
రంగాల వారీగా పెట్టుబడుల సమగ్ర వివరాలు
విశాఖ భాగస్వామ్య సదస్సులో కుదిరిన పెట్టుబడుల, లభించే ఉద్యోగాల వివరాలు ఇలా ఉన్నాయి..
- విద్యుత్ రంగం: రూ. 5,33,351 కోట్లు – 2,66,722 ఉద్యోగాలు
- పరిశ్రమలు: రూ. 2,80,384 కోట్లు – 5,19,083 ఉద్యోగాలు
- మౌళిక వసతులు: రూ. 2,01,758 కోట్లు – 3,06,649 ఉద్యోగాలు
- ఐటీఈ అండ్ సీ: రూ. 1,59,467 కోట్లు – 2,96,315 ఉద్యోగాలు
- ఏపీ సీఆర్డీఏ: రూ. 48,711 కోట్లు – 41,625 ఉద్యోగాలు
- టూరిజం: రూ. 21,036 కోట్లు – 1,05,804 ఉద్యోగాలు
- ఫుడ్ ప్రాసెసింగ్: రూ. 13,008 కోట్లు – 47,390 ఉద్యోగాలు
- పట్టణాభివృద్ధి: రూ. 4,944 కోట్లు – 12,150 ఉద్యోగాలు
- టెక్స్టైల్స్: రూ. 4,490 కోట్లు – 8,450 ఉద్యోగాలు
- ఆరోగ్య రంగం: రూ. 4,208 కోట్లు – 24,000 ఉద్యోగాలు
- విద్యా రంగం: రూ. 4,359 కోట్లు – 3,000 ఉద్యోగాలు
- ఇతర శాఖలు: రూ. 50,000 కోట్ల పెట్టుబడులు
మూడు రోజుల పాటు విశాఖలో జరిగిన ఈ మహా పెట్టుబడుల ఉత్సవం, ఏపీ ఆర్థిక ప్రగతికి కొత్త దారులు తీసుకువచ్చిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం పరిశ్రమలకు ఆహ్వాన పత్రం పంపితే, పెద్ద ఎత్తున స్పందించే వాతావరణం ఏపీ స్పష్టంగా నిర్మించగలిగిందని ఈ ఎంఓయూల సంఖ్య రుజువు చేస్తోంది.