టమాటా ముచ్చట్లు : ఓ వైపు తులాభారాలు.. మరోవైపు దొంగతనాలు.. హాట్ ఫేవరేట్ గా మారుతున్న కూరగాయ..
అనకాపల్లిలో ఓ వ్యక్తి టమాటాలతో తులాభారం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 51 కిలోల టమాటాలతో తన కూతురికి తులాభారం నిర్వహించాడు.
అనకాపల్లి : టమాటాల రేట్లు రోజురోజుకు కొండెక్కుతుండడంతో.. చిత్ర విచిత్రమైన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. టమాటా దొంగతనాలు మామూలైపోయాయి. ఇప్పుడు మరో విచిత్రమైన ఘటన అనకాపల్లిలో వెలుగు చూసింది. అనకాపల్లి జిల్లా కేంద్రంలో ఉన్న నూకాలమ్మ ఆలయంలో జరిగిన ఈ ఘటన చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు.
ఆదివారం నాడు నూకాలమ్మ ఆలయంలో ఒకరు టమాటాలతో తులాభారం ఇచ్చారు. దీంతో ఇది చర్చనీయాంశంగా మారింది. అనకాపల్లి పట్నానికి చెందిన మళ్ల జగ్గ అప్పారావు, మోహిని దంపతుల కుమార్తె భవిష్యకు తులాభారం నిర్వహించారు.
గుడి ఆవరణలో జరిగిన తులాభారంలో.. టమాటలతో తులాభారం చేశారు. ఇది చూడడానికి భక్తులు పెద్ద స్థాయిలో గుమిగూడారు. ముందుగా ఈ తులాభారాన్ని 51 కిలోల టమాటాలతో, ఆ తరువాత చక్కెర, బెల్లంలతో చేశారు.
ఈ తులాభారం చేసిన వస్తువులన్నింటిని అమ్మవారి నిత్యాన్నదానంలో ఉపయోగిస్తారు. ఈమెరకు దేవస్థానం అధికారులు తెలిపారు. మార్కెట్లో టమాటాల ధర కేజీకి రూ. 150 పైననే ఉండడంతో.. ఇది చూసిన భక్తులంతా ఆశ్చర్యంగా చర్చించుకుంటున్నారు.
మరోవైపు టమాటా దొంగతనాలు ఆగడం లేదు. శుక్రవారం రాత్రి చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం నెక్కుంది గ్రామ సమీపంలో రైతు ఉదయ్ కుమార్ పొలంలో దొంగలు పడ్డారు. రూ. 50 వేల విలువచేసే టమాటాలను కోసుకు పోయారు. ముప్పాతిక ఎకరంలో టమాటాలు సాగు చేశాడు ఉదయ్ కుమార్.
ఈ సాగుకు సంబంధించి శనివారం నాడు మూడో కోత కోయాల్సి ఉంది. ఇంతలో శుక్రవారం నాడు రాత్రికి రాత్రే అరెకరంలో దొంగలు చేతివాటం చూపించారు.సుమారు 450 కిలోల టమాటాలు చోరీకి గురయ్యాయి. వాటి విలువ రూ.50వేలు పైనే ఉంటుందని ఉదయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.