తిరుమల శ్రీవాణి దర్శనంలో టీటీడీ కీలక మార్పులు
తిరుమల శ్రీవాణి దర్శన సమయాల్లో టీటీడీ కీలక మార్పులు చేసింది. శ్రీవాణి టిక్కెట్ల కోటాను పెంచడంతో పాటు దర్శన సమయాన్ని సాయంత్రానికి మార్చింది. ఈ మార్పు ద్వారా భక్తులు అదే రోజు తిరుమల చేరుకొని, దర్శనం ముగించుకొని తిరిగి వెళ్లే అవకాశం ఉంది.

టీటీడీ కీలక నిర్ణయం
Tirumala : ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల. ఈ పుణ్యక్షేత్రానికి నిత్యం వేలాదిమంది వెళుతుంటారు. కలియుగ ప్రత్యక్షదైవం వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో ఎదురుచూస్తుంటారు. సామాన్య భక్తులే కాదు రాజకీయ, సినీ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు సైతం స్వామివారి దర్శనం కోసం వస్తుంటారు. ఇదిలా ఉంటే తాజాగా తిరుమల శ్రీవాణి దర్శనానికి సంబంధించి టీటీడీ కీలక మార్పు చేయాలని భావిస్తోంది.
దర్శన సమయాల్లో మార్పు
తిరుమల శ్రీవాణి దర్శనానికి సంబంధించి టీటీడీ కీలక మార్పు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం ఉదయం ఇచ్చే దర్శన సమయాన్ని సాయంత్రం 4 గంటలకు మార్చే అవకాశాలను పరిశీలిస్తోంది.
శ్రీవాణి టిక్కెట్ కోటా పెంపు
శ్రీవారి భక్తుల డిమాండ్ మేరకు శ్రీవాణి టికెట్స్ కోటాను పెంచాలని నిర్ణయించింది టీటీడీ. ప్రస్తుతం 1500 టిక్కెట్ల కోటాను 2,000 టికెట్లకు పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి రోజు కరెంటు బుకింగ్ కోటా క్రింద తిరుమలలో 1500టిక్కెట్లు, రేణిగుంట విమానాశ్రయంలో 500 టిక్కెట్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.
మార్పునకు కారణమదేనా?
ఈ మార్పు ద్వారా భక్తులు అదే రోజు తిరుమల చేరుకొని, దర్శనం ముగించుకొని తిరిగి వెళ్లే అవకాశం ఉంది. వసతి గదులపై ఉన్న ఒత్తిడిని తగ్గించవచ్చని టీటీడీ భావిస్తోంది. ఇలా టికెట్ పొందిన నాటి సాయంత్రమే భక్తుడు వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లేలా టీటీడీ మార్పులు చేయబోతుంది.
నూతన విధానంపై కసరత్తు
ప్రస్తుత విధానంలో శ్రీవాణి టిక్కెట్లు ముందుగా జారీ అవుతుండటంతో, భక్తులు రెండు రోజుల పాటు వసతి గదులను బుక్ చేసుకుంటున్నారని టీటీడీ గుర్తించింది. ఈ నేపథ్యంలో భక్తులకు ఆ రోజే టిక్కెట్లు జారీ చేయడం ద్వారా, సమర్థతను పెంచే విధంగా నూతన విధానానికి కసరత్తు చేస్తోంది.
తిరుమలలో ఘనంగా గరుడ పంచమి
తిరుమలలో గరుడపంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీమలయప్ప స్వామివారు తమ ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించారు. మంగళవారం రాత్రి 7 గంటలకు గరుడ వాహనసేవ ప్రారంభమైంది. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటనలో వెల్లడించింది.