- Home
- Andhra Pradesh
- Tirumala : టిటిడిలో ఉద్యోగాల భర్తీ...వస్తే స్వామివారి సన్నిధిలో జాబ్, లేకుంటే నిరుద్యోగ భృతి
Tirumala : టిటిడిలో ఉద్యోగాల భర్తీ...వస్తే స్వామివారి సన్నిధిలో జాబ్, లేకుంటే నిరుద్యోగ భృతి
తిరుమల శ్రీవారి సన్నిధిలో పనిచేసేందుకు పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు... ఈ మేరకు టిటిడి నిర్ణయం తీసుకుంది. ఏఏ పోస్టులను భర్తీ చేయనున్నారో తెలుసా?

తిరుమలలో ఉద్యోగాాల భర్తీకి టిటిడి ఆమోదం
Tirumala Temple : కలియుగ ప్రత్యక్షదైవంగా కొలిచే తిరుమల వెంకటేశ్వర స్వామి సేవలో తరించాలని చాలామంది హిందువుల చిరకాల కోరిక. అందుకే ఓ వారంపదిరోజులు తిరుమలలో సేవ చేసే అవకాశాన్ని భక్తులకు కల్పిస్తుంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం... దీనికోసమే భారీగా దరఖాస్తులు వస్తుంటాయి. అలాంటిది ప్రతిరోజు స్వామివారి సేవలో తరించే అవకాశం వస్తే... ఇప్పుడు టిటిడి అలాంటి అవకాశమే ఇస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకుంది.
టిటిడిలో ఉద్యోగాల భర్తీ
నిన్న (మంగళవారం) టిటిడి ఛైర్మన్ బిఆర్ నాయుడు అద్యక్షతన పాలకమండలి సమావేశం జరిగింది. ఇందులో కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్లు టిటిడి ఈవో శ్యామలరావు తెలిపారు. పలు ఉద్యోగాల భర్తీకి కూడా పాలకమండలి ఆమోదం లభించిందని వెల్లడించారు.. అంటే త్వరలోనే టిటిడిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట.
700 వేద పారాయణులను నియామకానికి టిటిడి పాలకమండలి ఆమోదం తెలిపింది. త్వరలోనే అర్హతగల వేద పారాయణుల నియామక ప్రక్రియ చేపడతామని ఈవో శ్యామలరావు స్పష్టం చేశారు. అలాగే మరో 600 మంది వేదపారాయణులకు నిరుద్యోగ భృతి అందించాలని నిర్ణయించినట్లు ఈవో వెల్లడించారు. దేవాదాయ శాఖ ద్వారా ఈ భృతి చెల్లించనున్నారు... ఇందుకోసం రూ.2.16 కోట్ల టిటిడి నిధుల మంజూరుకు ఆమోదం తెలిపింది టిటిడి పాలకమండలి.
ఇక స్వామివారి పేరిట సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న టిటిడి వీటిని దేశవిదేశాలకు వ్యాప్తి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా కోఆర్డినేటర్లను నియమించనున్నారు... కాంట్రాక్ట్ ప్రాతిపదికన 4 కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి టిటిడి ఆమోదం తెలిపినట్లు ఈవో వెల్లడించారు.
ఇప్పటికే ఏపీ హైకోర్టు టిటిడిలో పనిచేసే కాంట్రాక్ట్ డ్రైవర్లను శాశ్వత ఉద్యోగులుగా పరిగణించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 142 మంది డ్రైవర్ ఉద్యోగాల క్రమబద్దీకరణకు టిటిడి ఆమోదం తెలిపింది... ప్రభుత్వ ఆమోదాన్ని కూడా పొందేందుకు చర్యలు తీసుకోవాలని టిటిడి నిర్ణయించింది.
టిటిడి కీలక నిర్ణయాలివే
తిరుమలలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టిటిడి చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే భవిష్యత్ అవసరాల దృష్ట్యా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -3 నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీ వేయాలని టిటిడి నిర్ణయించింది.
తిరుమలలో భక్తులకు అన్ని సౌకర్యాలతో కూడిన విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. భక్తులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకునేలా వీటిని ఏర్పాటుచేయనున్నారు... వీటిని ఎక్కడ ఏర్పాటుచేయాలి? ఎలాంటి సదుపాయాలు కల్పించాలి? అనేది త్వరలోనే నిర్ణయించనుంది.
నడకమార్గంలో తిరుమల కొండపైకి చేరుకుని భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు, భద్రత కల్పించాలని టిటిడి భావిస్తోంది. ఇందుకోసం ఈ మార్గంలో ఆద్యాత్మిక, ఆహ్లాదకర వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మార్గాల్లో రాత్రి సమయంలో భద్రత కోసం లైటింగ్ పెంచాలని టిటిడి సూచించింది.
తిరుమలలో సైబర్ సెక్యూరిటీ ల్యాబ్
తిరుమలలో శిలాతోరణం, చక్రతీర్థం ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసేందుకు టిటిడి సిద్దమయ్యింది. ఇందుకోసం మాస్టర్ ప్లాన్, డీపీఆర్ రూపొందించాలని అధికారులను ఆదేశించింది.
వివిధ దేశాల్లో శ్రీవారి ఆలయాలను నిర్మించాలని టిటిడి నిర్ణయించింది. ఇప్పటికే చంద్రబాబు ఆదేశాల మేరకు విదేశాల్లో స్వామివారి ఆలయాల నిర్మాణానికి సంబంధించి నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది... మరో సబ్ కమిటీ ఏర్పాటుచేసి ఈ నివేదికపై తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
శ్రీవారి పేరిట భక్తులనుండి సైబర్ నేరగాళ్లు డబ్బులు దోచుకుంటున్నారు... ఇటీవలకాలంలో ఇలాంటి మోసాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే ఈ సైబర్ మోసాల నియంత్రణకు ఓ సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటుకు టిటిడి నిర్ణయం తీసుకుంది.
తిరుమల కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని టిటిడి నిర్ణయించింది.
తిరుమలలోొ నూతన పాలనా భవనం
తిరుమలలో మరింత మెరుగైన పరిపాలన, భక్తుల సౌకర్యం కోసం అన్ని విభాగాలు ఒకేచోట కేంద్రీకృతమయ్యేలా నూతన పరిపాలన భవనం నిర్మించాలని టిటిడి నిర్ణయించింది. పాతబడిన భవనాలను తొలగింపుకు ఆమోదం తెలిపింది.
ఇప్పటికే సమరసతా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన 320 ఆలయాల్లో మైక్ సెట్ల ఏర్పాటుకు రూ.79.82 లక్షలు కేటాయించింది. ఒక్కో మైక్ సెట్ కు రూ.25 వేలు కేటాయించారు. అలాగే ఎస్సి, ఎస్టీ, వెనకబడిన ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి కేటగిరీల వారిగా నిధులు అందించాలని నిర్ణయించింది.