Highlights of 2023 : ఆంధ్ర ప్రదేశ్ ని కుదిపేసిన సంఘటనలు ఇవే...
2023 సంవత్సరం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలకమైనది. ఎన్నికలకు ముందు ఏడాది కావడంతో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాదిలో జరిగిన టాప్ 10 రాజకీయ పరిణామాలేంటో తెలుసుకుందాం.

AP Politics
అమరావతి : మరికొద్దిరోజుల్లో ఈ 2023 సంవత్సరానికి ముగింపు పలికి కొత్త సంవత్సరంలో 2024 లో అడుగుపెట్టబోతున్నాం. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల పరంగా చూసుకుంటే మాత్రం రాబోయే ఎన్నికల సంవత్సరం. 2024 ఆరంభంలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నారు. కానీ ఈ ఎన్నికల ప్రిపరేషన్ ను మాత్రం ప్రధాన రాజకీయా పార్టీలు 2023 లోనే ప్రారంభించాయి. అధికార వైసిపి ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే... టిడిపి, జనసేన పార్టీలు ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలోనే రాజకీయ సమీరణల వేగంగా మారాయి. ఇలా 2023 సంవత్సరంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై ఓ లుక్కెద్దాం.
Chandrababu Naidu Remanded
1. టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్ :
2023 సంవత్సరం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చాలా కష్టంగా గడిచిందని చెప్పాలి. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళుతున్న మజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబును వైసిపి ప్రభుత్వం అరెస్ట్ ద్వారా అడ్డుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ లో బస్సు యాత్రలో భాగంగా నంద్యాలకు వెళ్లిన చంద్రబాబును సిఐడి అధికారులు అరెస్ట్ చేసారు. అర్ధరాత్రి చంద్రబాబు బస్సువద్దకు చేరుకున్న సిఐడి అధికారులు అరెస్ట్ చేసారు.
ఇలా స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి నాటకీయ పరిణామాల మధ్య రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. బెయిల్ రాకుండా చూసి 50 రోజులకు పైగా జైల్లోనే చంద్రబాబు వుండేలా చూసారు. చివరకు అనారోగ్య కారణాలతో షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ను హైకోర్టు మంజూరుచేయడంతో చంద్రబాబు బయటకు వచ్చారు. ఆ తర్వాత న్యాయస్థానం సాధారణ బెయిల్ మంజూరు చేయడంత ఇటీవలే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు చంద్రబాబు.
Pawan Kalyan
2. టిడిపి-జనసేన పొత్తు :
చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత టిడిపి-జనసేన పార్టీలు ఒక్కటయ్యాయి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును పరామర్శించిన పవన్ కల్యాణ్ టిడిపితో పొత్తుపై కీలక ప్రకటన చేసారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి, జనసేన కలిసి పోటీ చేస్తాయంటూ జైలు వద్దే ప్రకటించారు. ఇలా 2014 లో ఎన్నికల్లో టిడిపికి అండగా నిలిచిన జనసేన మళ్లీ రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీకి సిద్దమయ్యింది.
Varahi campaign
3. పవన్ కల్యాణ్ వారాహి యాత్ర :
ఆంధ్ర ప్రదేశ్ లో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర చేపట్టారు. ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రత్యేకంగా రూపొందించిన వాహనానికి 'వారాహి' అని పేరు పెట్టారు. ఈ వాహనంపైనే రాష్ట్రం మొత్తాన్ని చుట్టివచ్చేలా ప్రణాళిక రూపొందించారు. ఇలా ఈ ఏడాది జూన్ 14న పవన్ వారాహి యాత్ర ప్రారంభమయ్యింది. ఇప్పటివరకు నాలుగు విడతల్లో వారాహి యాత్ర చేపట్టారు జనసేనాని పవన్ కల్యాణ్.
nara lokesh yuvagalam
4. యువగళం పాదయాత్ర :
2023 ఆరంభంలోనే టిడిపి అధినేత చంద్రబాబు తనయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్రను ప్రారంభించారు. జనవరి 27న తండ్రి సొంతనియోజకవర్గం కుప్పంలో లోకేష్ పాదయాత్ర ప్రారంభమయ్యింది. ఎన్నికలనాటికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పాదయాత్ర ముగిసేలా ప్రణాళికలు రచించారు. కానీ మధ్యలో చంద్రబాబు అరెస్ట్ తో లోకేష్ పాదయాత్రకు కొన్నిరోజులు బ్రేక్ పడింది. ఇటీవలే తిరిగి పాదయాత్రను ప్రారంభించిన లోకేష్ 3వేల కిలోమీటర్లను పూర్తిచేసుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలో ప్రారంభమైన లోకేష్ పాదయాత్ర చివరో ముగుస్తోంది. డిసెంబర్ 20న విశాఖలో భారీ బహిరంగ సభతో లోకేష్ పాదయాత్ర ముగియనుంది.
Visakhapatnam
5. విశాఖకు రాజధాని :
వైసిపి పార్టీ అధికారంలోకి రాగానే ఆంధ్ర ప్రదేశ్ కు అమరావతి ఒక్కటే కాదు మూడు రాజధానులు వుంటాయని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే విశాఖపట్నంను పరిపాలన రాజధానిగా ప్రకటించారు... ఆ దిశగా ఈ ఏడాది కీలక ముందడుగులు పడ్డాయి. విశాఖలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం, మంత్రులు, సీనియర్ ఐఎఎస్ అధికారుల వసతి ఏర్పాటుకోసం ప్రత్యేకంగా ఓ కమిటీని నియమించింది ప్రభుత్వం. ఈ ఏడాది దసరా నుండే విశాఖ రాజధానిగా పాలన ప్రారంభంకానుందని ప్రభుత్వం ప్రకటించింది. కానీ వివిధ కారణాలతో ఇది వాయిదా పడింది. ఇలా ఈ ఏడాది అనేక ముహూర్తాలు పెట్టినట్లు ప్రచారం జరిగినా విశాఖనుండి పాలనమాత్రం ప్రారంభంకాలేదు.
Nara Bhuvaneshwari
6. రాజకీయంగా నారా భువనేశ్వరి, బ్రాహ్మణి యాక్టివ్ :
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో అటు పుట్టింటికి చెందిన నందమూరి, మెట్టినింటికి చెందిన నారా కుటుంబాలు యాక్టివ్ గా వున్నాయి. కానీ ఏనాడూ భువనేశ్వరి గానీ, బ్రాహ్మణి గానీ రాజకీయాలవైపు కన్నెత్తి చూడలేదు. కానీ అనుకోని పరిస్థితుల్లో వీరిద్దరూ ఈ ఏడాది రాజకీయాలకు దగ్గరకావాల్సి వచ్చింది. చంద్రబాబు జైల్లో వుండటం... లోకేష్ ఎక్కువగా డిల్లీలో వుండటంతో టిడిపి పార్టీని నడిపించే బాధ్యతను కొంతకాలం భువనేశ్వరి తీసుకున్నారు. ఆమె అనధికారిక అధ్యక్షురాలిగా వ్యవహరించగా కోడలు బ్రాహ్మణి కూడా రాజకీయంగా కాస్ట యాక్టివ్ అయ్యారు. చంద్రబాబు నాయుడు జైలునుండి బయటకు వచ్చాన అత్తాకోడలు భువనేశ్వరి, బ్రాహ్మణి రాజకీయంగా సైలెంట్ అయ్యారు.
rama chandra Yadav
7. ఏపీ రాజకీయాల్లో కొత్తపార్టీ :
చిత్తూరు జిల్లాకు చెందిన బీసీ నేత రామచంద్ర యాదవ్ కొత్త పార్టీ పెట్టారు. ఈ ఏడాది జూలైలో గుంటూరు శివారులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసి ‘‘భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ)’’ని ప్రకటించారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే లక్ష్యంతో పార్టీని స్థాపించానని రామచంద్ర యాదవ్ తెలిపారు.
Chandrababu Naidu
8. చంద్రబాబు అనారోగ్యం :
టిడిపి అధినేత చంద్రబాబు ఈ ఏడాది గడ్డుకాలాన్ని ఎదుర్కొన్నాడు. అవినీతి కేసులతో సతమతం అవుతూ జైలుకు వెళ్లి రాజకీయంగా... అనారోగ్య సమస్యలతో శారీరకంగా తీవ్ర ఇబ్బందిపడ్డారు. జైల్లో వుండగా చర్మ సమస్యతో పాటు కంటి సమస్యను ఎదుర్కొన్నారు. జైలునుండి బయటకు వచ్చిన హైదరాబాద్ లోనే వుండి చికిత్స పొందారు. ఆయన కంటికి ఆపరేషన్ అయ్యింది. ఇటీవలే ఆరోగ్యం కాస్త మెరుగుపడటంతో మళ్లీ చంద్రబాబు రాజకీయంగా యాక్టివ్ అయి ప్రజల్లోకి వెళుతున్నారు.
Anuradha
9. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపికి షాక్...
ఆంధ్ర ప్రదేశ్ లో ఈ ఏడాది జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని పలితాలు వచ్చాయి. గెలిచేందుకు సరిపడా సీట్లు లేకున్నా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పంచుమర్తి అనురాధను బరిలోకి దింపారు. కానీ అనూహ్యంగా 23 మంది ఎమ్మెల్యేలు ఆమెకు ఓటేయడంతో ఆమె ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇలా వైసిపి ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడంతో టిడిపి విజయం సాధించింది. ఇలా క్రాస్ ఓటు చేసి పార్టీకి నష్టం చేసారంటూ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి లను వైసిపి సస్పెండ్ చేసింది. ఏదేమైనా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనురాధ విజయం ఈ ఏడాదిలో జరిగిన పెను సంచలనమే అని చెప్పాలి.
alla ramakrishna reddy
10. ఏడాది చివర్లో వైసిపి ఎమ్మెల్యే ట్విస్ట్...
2023 సంవత్సరం ముగిసేందుకు...ఎన్నికల ఏడాదిలోకి అడుగుపెట్టేందుకు కొద్దిరోజులే సమయం వుందనగా వైసిపిలో అలజడి మొదలయ్యింది. వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాతో ఒక్కసారిగా రాజకీయాలు హీటెక్కాయి. అతడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతుండగానే మరొకరిని వైసిపి ఇంచార్జీగా నియమించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురయిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.