నివర్ తుఫాను బాధితుల కష్టాలకు చలించి... ఆర్థిక సాయం ప్రకటించిన లోకేష్
అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలో ఆత్మహత్యలు చేసుకున్న కృష్ణంరాజుతో పాటు సాంబశివరావు, వెంకట కృష్ణయ్య, ఆదిశేషు కుటుంబాలను కూడా లోకేష్ పరామర్శించారు.
విజయవాడ: నివర్ తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించేందుకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. మొదట అవనిగడ్డ నియోజకవర్గంలోని పాగోలు గ్రామానికి చేరుకుని పంట నష్టంతో ఆత్మహత్య చేసుకున్న రైతు కృష్ణంరాజుకి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా రైతు కృష్ణంరాజు కుటుంబం లోకేష్ వద్ద తమ ఆవేదనను వ్యక్తపర్చారు. ఐదు ఎకరాలను కౌలు చేసుకుని వ్యవసాయం చేయగా తుఫాను కారణంగా పంట మొత్తం దెబ్బతిందని... దీంతో రూ.3.50 లక్షల అప్పు తీర్చలేక ఆత్మహత్యకి పాల్పడ్డారని తెలిపారు. పంట నష్టానికి తమకు ఎటువంటి పరిహారం అందలేదని లోకేష్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు కృష్ణంరాజుకి కుటుంబ సభ్యులు.
రైతు కృష్ణంరాజు ఆత్మహత్య తర్వాత వారి కుటుంబ పరిస్థితిని చూసి చలించిపోయిన నారా లోకేష్. దీంతో కృష్ణంరాజు రెండో కుమారుడు రోహిత్ కుమార్ చదువు బాధ్యత తాను తీసుకుంటానని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.
ఇక అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలో ఆత్మహత్యలు చేసుకున్న కృష్ణంరాజుతో పాటు సాంబశివరావు, వెంకట కృష్ణయ్య, ఆదిశేషు కుటుంబాలను కూడా లోకేష్ పరామర్శించారు. ఒక్కొక్కరికి లక్ష రూపాయిలు సహాయం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నట్లు...అతి త్వరలో పార్టీ నుండి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయిలు సహాయం అందించనున్నట్లు తెలిపారు.
అంతకుముందు వాజేరు గ్రామానికి వెళుతూ నిమ్మకూరు వద్ద రహదారిపై వెళ్తున్న రైతులను చూసి ఆగారు లోకేష్. తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన పంటను పరిశీలించారు. రంగు మారిన, తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చెయ్యడం లేదని... మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోయాం అంటూ లోకేష్ వద్ద తమ ఆవేదన వ్యక్తం చేసుకున్నారు రైతులు.
అక్కడినుండి కొత్త మాజేరు గ్రామానికి చేరుకున్న లోకేష్ పంట పొలాలను పరిశీలించారు.తుఫాన్ ల వల్ల పూర్తిగా పంట దెబ్బతినడంతో ట్రాక్టర్ తో పంటను తొక్కించినట్లు కొందరు రైతులు తెలిపారు. కౌలు రైతులకు ఎటువంటి సహాయం అందడం లేదని... భరోసా, ఇన్పుట్ సబ్సిడీ, భీమా అందడం లేదని మరికొందరు తెలిపారు.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ...''ఇది దున్నపోతు ప్రభుత్వం. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే జగన్ రెడ్డి ప్యాలస్ లో నిద్రపోతున్నారు.19 నెలల పాలనలో 766 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. జగన్ రెడ్డి ఒక ఫేక్ సీఎం. రైతులు కష్టాల్లో ఉంటే వ్యవసాయ శాఖ మంత్రి రికార్డ్ డాన్సులు చూస్తున్నాడు. రైతుల కు న్యాయం జరిగే వరకూ టిడిపి పోరాడుతుంది'' అన్నారు.