2024 లో చంద్రబాబు చస్తాడు... ఇక జగన్ కు అడ్డుండదు : వైసిపి ఎంపీ సంచలనం
రాజమండ్రి జైల్లోవున్న ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 2024 లో చనిపోతాడంటూ వైసిపి ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
chandrababu naidu
అనంతపురం : ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో వున్న ఏపీ మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు భద్రతపై కుటుంబసభ్యులు, టిడిపి శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా చంద్రబాబుకు సరైన వైద్యం అందించడంలేదని... కోర్టు ఆదేశించినా సరైనా సదుపాయాలు కల్పించడం లేదని నారా లోకేష్ ఆరోపిస్తున్నారు. నారా భువనేశ్వరి సైతం భర్త ఆరోగ్యంపై ఆందోళన, జైల్లో భద్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకు ఏమైనా అయితే ఊరుకోబోమని టిడిపి నాయకులు, కార్యకర్తలు వైసిపి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుపై వైసిపి ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Gorantla Madhav
వైసిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ది, ప్రజాసంక్షేమం గురించి ప్రజలకు వివరించేందుకు అధికార పార్టీ రాష్ట్రవ్యాప్త బస్సుయాత్ర చేపట్టింది. సామాజిక సాధికారత పేరిట ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రారంభమైన బస్సు యాత్రలో వైసిపి ఎంపీ గోరంట్ల మాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 2024 లో చంద్రబాబు నాయుడు చస్తాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. తిరిగి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారని చెబుతూ చంద్రబాబు చనిపోతాండటూ గోరంట్ల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
Chandrababu
ఇప్పటికే చంద్రబాబును జైల్లోనే చంపేందుకు జగన్ సర్కార్ కుట్రలు చేస్తోందని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను వైసిపి నాయకులు తిప్పికొడుతున్నారు. చంద్రబాబును చంపాల్సిన అవసరం తమకు లేదని... నారా కుటుంబానికే ఆ అవసరం వుందని వైసిపి నాయకులు అంటున్నారు. చంద్రబాబుకు ఇంటినుండి పంపే ఆహారంలో ఏదయినా విషం కలుపుతున్నారేమో అన్న అనుమానం వుందని... అందువల్లే ఆహారాన్ని పరీక్షించాకే చంద్రబాబుకు అందిస్తున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలా చంద్రబాబును చంపేందుకు ప్రయత్నిస్తున్నది మీరంటే మీరంటూ అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి నాయకుల మధ్య వాగ్వాదం సాగుతోంది.
Chandrababu Naidu
చంద్రబాబు అనారోగ్యంతో బాధపడుతుండటం... జైల్లోని ఆయన భద్రతపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో ఎంపీ గోరంట్ల వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. 2024 ఎన్నికల్లో చంద్రబాబు అడ్డు తొలగించుకుని మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేందుకు వైఎస్ జగన్ కుట్రలు పన్నుతున్నారని టిడిపి శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ కుట్ర వైసిపి ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలతో బయపడిందని అంటున్నారు.
chandrababu naidu
ఇక చంద్రబాబు అరెస్ట్ పైనా గోరంట్ల సెటైర్లు వేసారు. బస్సు యాత్ర ప్రారంభించిన చంద్రబాబు ఇప్పుడు జైలు యాత్ర చేస్తున్నాడని ఎంపీ ఎద్దేవా చేసారు. ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ వారాహి యాత్ర చేసి ఇప్పుడు పారిపోయే యాత్ర చేస్తున్నాడని అన్నాడు. సొంతకొడుకు లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టి ఇప్పుడు పిల్లి యాత్ర చేస్తున్నాడని గోరంట్ల మాధవ్ ఎద్దేవా చేసారు.