అసెంబ్లీలోనూ చంద్రబాబు అరెస్ట్ పై పోరాటం... టిడిఎల్పి కీలక నిర్ణయం
రేపటి నుండి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని తెలుగుదేశం పార్టీ శాసన సభాపక్షం నిర్ణయించింది.
TDLP Meeting
అమరావతి : మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై అసెంబ్లీ వేదికగా పోరాటానికి సిద్దమయ్యింది టిడిపి. ఇందుకోసం రేపటినుండి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని టీడీపి నిర్ణయించింది. ఈ మేరకు టిడిపి కేంద్ర కార్యాలయంలో అచ్చెన్నాయుడు అద్యక్షతన సమావేశమైన ఆ పార్టీ శాసనసభాపక్షం నిర్ణయం తీసుకుంది. టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చంద్రబాబు అరెస్ట్, ఆ తర్వాతి పరిణామాలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు.
Nara Lokesh
టిడిపి శాసనసభాపక్షం నిర్ణయంపై మాజీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. పోరాటమే అజెండాగా ప్రజల కోసం ఎన్ని అవమానాలైనా భరించడానికి సిద్దంగా వుండాలన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు, ప్రజా సమస్యలపై చట్టసభల్లో గళం వినిపించే అవకాశం వదులుకోకూడదని అన్నారు. వీధుల్లోనూ కాదు సభలోనే పోరాటం చేద్దామని... చంద్రబాబుది అక్రమ అరెస్ట్ అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని లోకేష్ సూచించారు.
Nara Lokesh
అసెంబ్లీలో చంద్రబాబు అరెస్ట్ పై స్పీకర్ మాట్లాడే అవకాశం ఇవ్వకుంటే నిరసనలు తెలియజేయాలని లోకేష్ సూచించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ పై ఉద్యమించాలని టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సూచించారు.
TDLP Meeting
ఇక టిడిఎల్పీ నేత నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ... చంద్రబాబు అక్రమ అరెస్ట్ పై గళమెత్తేందుకు చట్టసభల వేధికను వదులుకోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. మైక్ ఇవ్వకపోవడం, సస్పెండ్ వంటి పరిణామాలు చోటు చేసుకుంటే బయటకు వచ్చి నిరసన తెలుపుతామన్నారు.
TDLP Meeting
వైసీపీకి స్క్రీన్ ప్రెజెంటేషన్ అవకాశమిస్తే జగన్ అక్రమాస్తుల కేసులపైనా స్క్రీన్ ప్రెజెంటేషన్ కోసం పట్టుబట్టాలని టిడిఎల్పీ నిర్ణయించినట్లు రామానాయుడు పేర్కొన్నారు. సభ లోపల అవకాశం ఇవ్వకుంటే.. జగన్ అవినీతి కేసుల అంశాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని రామనాయుడు హెచ్చరించారు.
TDLP Meeting
ఇదిలావుంటే చంద్రబాబు మాదిరిగానే లోకేష్, అచ్చెన్నాయుడు వంటి కీలక నాయకులను కూడా అరెస్ట్ చేసే అవకాశాలున్నాయంటూ జరుగుతున్న ప్రచారంపైనా టిడిఎల్పీ సమావేశంలో చర్చించినట్లు రామానాయుడు తెలిపారు.