- Home
- Andhra Pradesh
- Andhra Pradesh : దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ .. ఏపీలో ఎక్కడ? ఏమిటా కంపనీ?
Andhra Pradesh : దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ .. ఏపీలో ఎక్కడ? ఏమిటా కంపనీ?
భారతదేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ ఆంధ్ర ప్రదేశ్ లో ఏర్పాటుకానుంది. ఇందుకోసం ప్రముఖ సంస్థ ఒకటి భారీ పెట్టుబడులతో ముందుకు వచ్చింది. ఆ సంస్థ ఏది? ఎక్కడ ప్లాంట్ రానుంది? తదితర వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

ఏపీకి భారీ పెట్టుబడులు
Syrma SGS Technology : ఆంధ్ర ప్రదేశ్ లో మరో ప్రతిష్టాత్మక సంస్థ పెట్టుబడులకు సిద్దమయ్యింది. ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న సిర్మా ఎస్‌జీఎస్ టెక్నాలజీ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని పలు దేశాల్లో ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్స్ కలిగిన ఈ కంపనీ ఏపీలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తోంది.
చెన్నై కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సిర్మా ఎస్‌జీఎస్ టెక్నాలజీ దేశంలోనే అతిపెద్ద PCB (Printed circuit board), CCL (Copper Clad Laminate) తయారీ ప్లాంట్ ను ఏపీలో ఏర్పాటుచేయనుంది. ఇందుకోసం రూ.1800 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమయ్యింది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. రెండేళ్లలోపే అంటే 2027 మార్చి నాటికి ఈ ప్లాంట్ ను రెడీచేసి ఉత్పత్తిని ప్రారంభించాలన్న ప్లాన్ తో సిర్మా ఎస్‌జీఎస్ టెక్నాలజీ ఉంది.
ఇప్పటికే సిర్మా ఎస్‌జీఎస్ టెక్నాలజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తో పలుమార్లు చర్చలు జరిపింది. రాష్ట్రంల్లో పెట్టుబడులకు ముందుకు వచ్చిన ఈ సంస్థను సాదరంగా ఆహ్వానించిన వారు అన్ని రకాలుగా ప్రభుత్వం సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. సిర్మా టెక్నాలజీకి భూమిని కేటాయించడంతో పాటు వేగంగా అనుమతులు ఇవ్వాలని ఇప్పటికే సంబంధిత అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం.
ఏమిటీ సిర్మా ఎస్‌జీఎస్ టెక్నాలజీ?
ఏపీలో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చిన సిర్మా ఎస్‌జీఎస్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి చెందిన మ్యాన్యుఫ్యాక్ఛరింగ్ సంస్థ. భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఈ కంపనీ అనేక రకాల ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రాలను కలిగి ఉంది. ముఖ్యంగా ఇది స్మార్ట్ మీటర్లు, కమ్యూనికేషన్ మాడ్యూల్స్, ఎనర్జీ మానిటరింగ్ పరికరాల తయారీలో నైపుణ్యం కలిగి ఉంది. కేవలం ఎలక్ట్రానిక్స్ తయారీ మాత్రమే కాదు రీసెర్చ్ ఆండ్ డెవలప్ మెంట్ కూడా చేపడుతుంది ఈ సిర్మా టెక్నాలజీ.
ఏపీలోనే ఎందుకింత భారీ పెట్టుబడులు
ఆంధ్ర ప్రదేశ్ అనేది తమిళనాడుకు పొరుగునే ఉంది. అంతేకాదు ఈ సిర్మా ఎస్‌జీఎస్ టెక్నాలజీ ప్రధాన కార్యాలయం గల చెన్నైకి ఇప్పుడు తిరుపతి జిల్లాలో ఏర్పాటుచేయాలని భావిస్తున్న ప్లాంట్ చాలా దగ్గర. ఈజీగా ఈ ప్లాంట్ ను ప్రధాన కార్యాలయం నుండి ఆపరేట్ చేయవచ్చు.
ఇక ఏపీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను అనేక రకాలుగా ఆకర్షిస్తోంది... భారీ పెట్టుబడులతో ముందుకువచ్చేవారికి చాలా రకాల సబ్సిడీలు ఇస్తోంది. అలాగే వేగంగా అనుమతులు ఇస్తోంది. ఇక రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉంది... కేంద్ర ప్రభుత్వంలోనూ రాష్ట్రం కీలకంగా ఉంది. ఇవన్నీ ఏపీకి భారీ పెట్టుబడులు రావడానికి కారణమే... అందుకే సిర్మా ఎస్‌జీఎస్ టెక్నాలజీ కూడా ఇక్కడ పెట్టుబడులకు ఆసక్తి చూపుతోంది.
సిర్మా ఎస్‌జీఎస్ కు సౌత్ కొరియా టెక్నికల్ సహకారం
ఆంధ్ర ప్రదేశ్ లో ఏర్పాటుచేసే సిర్మా ఎస్‌జీఎస్ ఎలక్ట్రానిక్స్ ప్లాంట్ కు సౌత్ కొరియాకు చెందిన Shinhyup Electronics సాంకేతిక సహకారం అందిస్తోంది. ఈ కొరియన్ కంపనీ ఆలోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్, హోమ్ ఎలక్ట్రానిక్ అప్లియెన్సెస్, ఐటీ, మెడికల్ ఎలక్ట్రానిక్స్ కోసం పిసిబిలను తయారుచేస్తుంది. ఇలా ఇప్పటికే ఎలక్ట్రానిక్స్ రంగంలో బాగా అనుభవం కలిగిన ఈ కొరియన్ సంస్థ సిర్మా ఎస్‌జీఎస్ తో ఒప్పందం చేసుకుంది.
ఎలక్ట్రానిక్స్ హబ్ గా తిరుపతి
సిర్మా ఎస్‌జీఎస్ టెక్నాలజీస్ తో పాటు మరికొన్ని ఎలక్ట్రానిక్స్ సంస్థలు కూడా ఏపీలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నాయని ప్రభుత్వం చెబుతోంది. కాబట్టి వీటిని కూడా తిరుపతి జిల్లాకే తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ హబ్ గా తీర్చిదిద్దే ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. భారీ పెట్టుబడులతో ముందుకు వచ్చే సంస్థలకు ఇక్కడ భూములు కేటాయించి అన్నిరకాల సబ్సిడీలను అందించేందుకు చంద్రబాబు సర్కార్ చర్యలు చేపట్టింది.
ఇక సిర్మా ఎస్‌జీఎస్ సంస్థ ఇప్పటికే PLI (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెన్టివ్స్) స్కీమ్ కు దరఖాస్తు చేసుకుంది. త్వరలోనే ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ ప్లాంట్ లో తయారుచేసే పిసిబిలను స్మార్ట్ మీటర్స్, హెల్త్ కేర్, మెడికల్ డివైజెన్, ఆటోమోటివ్, ఎలక్ట్రిక్ మొబిలిటీలో ఉపయోగించనున్నారు.