- Home
- Andhra Pradesh
- Success Story : గొర్రెల కాపరికి సర్కార్ నౌకరీ... ఇది ఓ పేదింటి తెలుగు బిడ్డ సక్సెస్ స్టోరీ
Success Story : గొర్రెల కాపరికి సర్కార్ నౌకరీ... ఇది ఓ పేదింటి తెలుగు బిడ్డ సక్సెస్ స్టోరీ
Success Story : కాస్త ఆలస్యం కావచ్చు.. కాని పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీలేదని నిరూపించాడో తెలుగు బిడ్డ. గొర్రెల కాపరిగా పనిచేసిన అతడు ఇప్పుడు గవర్నమెంట్ టీచర్ ఉద్యోగాన్ని సాధించాడు. అతడి సక్సెస్ స్టోరీ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

గొర్రెల కాపరి నుండి గవర్నమెంట్ టీచర్ వరకు...
Success Story : పట్టువదలకుండా ప్రయత్నిస్తే ఆ విక్రమార్కుడిలా అనుకున్నది సాధించవచ్చని నిరూపించాడు ఓ తెలుగు బిడ్డ... ఇలా 2005 నుండి ప్రయత్నిస్తూ చివరకు 2015 లో ప్రభుత్వ ఉద్యోగం సాధించి ఈతరం విక్రమార్కుడు అనిపించుకున్నాడు. ఈ ప్రయాణంలో ఎన్నో కష్టాలు, మరెన్నో అవమానాలు... అన్నీ దిగమింగుకుంటూనే తన లక్ష్యసాధనవైపు నడిచాడు. కుటుంబ బారాన్ని మోస్తూనే చదువుకున్నాడు... అతడిలో నిజాయితీ ఉంది, కష్టపడే తత్వం ఉంది, పట్టువదలకుండా ప్రయత్నించే ఓపిక ఉంది... ఇవన్నీ ఆయుధాలుగా మారి పేదరికాన్ని సైతం జయించేలా చేశాయి... పెద్ద ఉద్యోగాన్ని సాధించేదుకు దోహపదపడ్డాయి. అవమానించిన వారితోనే ఇతడిది కదా సక్సెస్ అంటే అనిపించుకుంటున్నాడు... అతడే మెగా డిఎస్సి ర్యాంకర్ గుడ్డాల సూర్యనారాయణ.
సూర్యనారాయణ కల సాకారం
గొర్రెల కాపరి నుండి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించేవరకు సూర్యనారాయణ జర్నీ ఎంతో స్పూర్తిధాయకం. అతడు సక్సెస్ జర్నీ నేటి యువతకు ఆదర్శప్రాయం. ఎన్ని కష్టాలు ఎదురైనా లక్ష్యసాధన దిశగా నడవాలని... వాటితో పోరాడుతూనే అనుకున్నది సాధించాలనే పాఠాన్ని నేర్పిస్తోంది సూర్యనారాయణ స్టోరీ. తాజాగా వెలువడిన డిఎస్సి అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ లో సూర్యనారాయణ పేరుంది. ఇలా మెగా డిఎస్సి 2025 ద్వారా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా మారాడు ఒకప్పటి గొర్రెల కాపరి… అతడికి ఇంతటి సక్సెస్ ఎలా సాధ్యమయ్యిందో ఇక్కడ తెలుసుకుందాం.
గొర్రెల కాపరి నుండి గవర్నమెంట్ నౌకరీ వరకు సూర్యనారాయణ ప్రయాణం
వెనకబడిన ఉత్తరాంధ్రలో మరింత వెనకబడిన ప్రాంతం శ్రీకాకుళం. ఇక్కడి ప్రజలు ఇంకా పాతకాలం పద్దతులనే వాడుతుంటారు... వ్యవసాయమే ప్రధాన ఆధారంగా బ్రతుకుతుంటారు. ఈ జిల్లాలో అక్షరాస్యత కూడా చాలా తక్కువ. ఇలాంటి జిల్లాలో ఓ నిరుపేద కుటుంబంలో జన్మించాడు గుడ్డాల సూర్యనారాయణ.
సామాన్య కుటుంబంలో పుట్టిన సూర్యనారాయణ చిన్నప్పటినుండి కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటూనే చదువున్నాడు. ఎంతో కష్టపడి చదివిన అతడికి తనలాంటి పేద పిల్లలకు చదువు చెప్పి ప్రయోజకులను చేయాలని భావించాడు. అందుకోసమే డిగ్రీ పూర్తవగానే టీచర్ కావడానికి అవసరమైన కోర్సు చేయాలని నిర్ణయించుకున్నాడు... ఇలా 2005 లోనే బిఈడి పూర్తిచేశాడు.
ఇలా బిఈడి పూర్తవగానే అలా ఉద్యోగం వస్తుందని భావించాడు సూర్యనారాయణ. కానీ అతడికి జీవితమంటే ఏంటో పూర్తిగా అర్థమయ్యాక గాని ఉద్యోగం రాలేదు. దాదాపు రెండు దశాబ్దాలపాటు పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తే 2025 లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా మారాడు సూర్యనారాయణ. ఈ మధ్యలో ఎన్నో కష్టనష్టాలను అనుభవించాడు... అన్నింటిని భరిస్తూనే ముందుకుసాగి ఎట్టకేలకు లక్ష్యాన్ని సాధించాడు... అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు.
బిఈడి తర్వాత 20 ఏళ్లు ఎలా గడిచింది?
చదువు పూర్తయ్యాక అంటే 2005 లో బిఈడి పూర్తిచేశాక డిఎస్సి కోసం ప్రిపరేషన్ ప్రారంభించాడు సూర్యనారాయణ. కానీ ప్రతిసారి ఆయనకు నిరాశే ఎదురయ్యింది. ఉమ్మడి రాష్ట్రంలో రెండుసార్లు డిఎస్సి రాశాను.. ఇందులో మంచిమార్కులు వచ్చినా తక్కువ పోస్టులు ఉండటంతో జాబ్ రాలేదని స్వయంగా అతడే చెబుతున్నాడు. ఇలా 2006, 2008 లో రెండుసార్లు డిఎస్సి రాసి విఫలమయ్యాడు... కానీ ఈ ఓటమి అతడిని నిరాశ పర్చలేదు… మరింత పట్టుదలను పెంచింది.
డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న సమయంలో కుటుంబబారం అతడిపై పడింది. దీంతో చిన్నప్పటినుండి చూస్తూ పెరిగిన గొర్రెల పెంపకాన్ని ఓ ఆదాయ వనరుగా మార్చుకున్నాడు. స్వయంగా గొర్రెల కాపరిగా మారి రోజు వాటిని మేపడానికి తీసుకెళ్లేవాడు... ఆ సమయంలోనే చదువుకునేవాడు. ఇలా పగలంతా పనిచేసి రాత్రుళ్లు మెలకువగా ఉండి చదువుకున్నాడు. అయినా అతడికి విజయం వరించలేదు.
ఎంత కష్టపడుతున్నా అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోవడం అతడిలో మరింత కసిని పెంచింది. దీంతో ఈసారి మరింత జాగ్రత్తగా తన ప్లాన్ రెడీ చేసుకున్నాడు. ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా చేరాడు సూర్యనారాయణ... ఇలా పిల్లలకు పాఠాలు చెప్పేందుకు చదవడం తన ప్రిపరేషన్ కు పనికివస్తుంది... సాలరీ వస్తుంది కాబట్టి కుటుంబపోషణ సాగుతుంది. ప్రైవేట్ స్కూల్ టీచర్ గా పనిచేస్తూ డిఎస్సి ప్రిపరేషన్ సాగించాడు.
మెగా డిఎస్సితో సూర్యనారాయణ జీవితం టర్న్
ఆంధ్ర ప్రదేశ్ లో గతేడాది కూటమి ప్రభుత్వం ఏర్పడగానే సీఎం చంద్రబాబు నాయుడు మొదటిసంతకం ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మెగా డిఎస్సి ఫైలుపైనే పెట్టారు. దీంతో ఈసారి ఎలాగైనా తన కలను సాకారం చేసుకోవాలని సూర్యనారాయణ భావించాడు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరింత పకడ్బందీగా ప్రిపరేషన్ చేపట్టాడు... ఈసారి అతడి గురి తప్పలేదు. మెగా డిఎస్సిలో శ్రీకాకుళం జిల్లాలోనే టాప్ 10 ర్యాంకర్ గా నిలిచాడు... బయాలాజికల్ సైన్స్ లో జిల్లాలోనే అత్యుత్తమ ర్యాంకు సాధించి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా మారాడు సూర్యనారాయణ.
తాజాగా వెలువడ్డ మెగా డిఎస్సి తుది జాబితాలో గుడ్డాల సూర్యనారాయణ టాప్ లో నిలిచాడు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఏ లిస్ట్ లో అయితే తన పేరు ఉండాలని కోరుకున్నాడో అందులో తన పేరు ఉండటంచూసి మురిసిపోయాడు. సూర్యనారాయణకు ఉద్యోగం రావడంతో అతడి కుటుంబం సంతోషానికి అవధులు లేవు... తామే ఉద్యోగాన్ని సాధించామన్నట్లు తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. తమ బిడ్డ కష్టాన్ని కనులారా చూశారు.. ఇప్పుడు అతడి సక్సెస్ చూసి ఎంతో సంబరపడిపోతున్నారు.
టీచర్ కావాలనే తన కల సాకారం కావడానికి మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మెగా డీఎస్సీ వరంగా మారిందని గుడ్డాల సూర్యనారాయణ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తనలాంటి ఎందరో నిరుద్యోగుల కోసం మెగా డిఎస్సి వేసిన ఆయనకు అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ డిఎస్సి ద్వారా ఉపాధ్యాయులుగా ఎంపికైన అందరం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో కలిసి విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని గుడ్డాల సూర్యనారాయణ చెబుతున్నారు.
నారా లోకేష్ ఇచ్చిన వరం
గొర్రెల కాపరి టీచర్ కల సాకారం
విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ పట్టుదలతో మెగా డీఎస్సీ ద్వారా 16347 టీచర్ పోస్టులు భర్తీ చేశారు. వీరిలో ఒకరు శ్రీకాకుళానికి చెందిన గొర్రెల కాపరి గుడ్డాల సూర్యనారాయణ.
టీచర్ కావాలనే కల సాకారం కావడానికి మంత్రి నారా లోకేష్ ఇచ్చిన… pic.twitter.com/9atmzcStUF— Telugu Desam Party (@JaiTDP) September 13, 2025