కాడెద్దులుగా కూతుళ్లు, చంద్రబాబు సందడి: ఎవరీ నాగేశ్వర రావు?
సోషల్ మీడియాలో, కొన్ని మీడియా వర్గాల్లో నాగేశ్వర్ రావు పేదరైతు కాదు అని అనేక విషయాలు ప్రసారం అవ్వడం మొదలయింది. కొందరేమో ఆ కుటుంబానికి అందిన సంక్షేమ పథకాల లిస్టును విడుదల చేస్తే, మరికొందరేమో ఆయన గతంలో లోక్ సత్త తరుఫున పోటీ చేసిన విషయాన్నీ గుర్తు చేస్తున్నారు.
చిత్తూరు జిల్లా రైతు నాగేశ్వర రావు తన ఇద్దరు కూతుళ్లను కాడెద్దులుగా చేసుకొని పొలం దున్నుతున్న వీడియో వైరల్ గా మారిన విషయం అందరికి తెలిసిందే. ఈ విషయం వైరల్ గా మారి, విపరీతంగా సోషల్ మీడియాలో షేర్ చేసారు. అది సోనూసూద్ కంటపడింది.
సోనూసూద్ ఆ వీడియో చూసి చలించి వారికి ట్రాక్టర్ అందిస్తున్నట్టుగా ప్రకటించాడు. సాయంత్రానికి ట్రాక్టర్ వారి వద్దకు చేరుకోవడం కూడా జరిగింది. ట్రాక్టర్ గురించి సోనూసూద్ ప్రకటించిన వెంటనే చంద్రబాబు ఆయనకు ఫోన్ చేసి అభినందించారు. ఆయన అభినందించిన విషయాన్నీ సోనూసూద్ కూడా ధృవీకరిస్తూ ఆ ట్వీట్ ని రీట్వీట్ చేసి, త్వరలోనే మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను సర్ అని రాసుకొచ్చాడు.
ఈ విషయం ఇలా జరుగుతుండగానే ఆంధ్రప్రభుత్వం తరుఫున ఎంపిడిఓ స్పందించాడు. నాగేశ్వర్ రావు పేదవాడు కాదని, వారు అంత దయనీయ స్థితిలో లేరు అని ప్రకటించారు. సోనూసూద్ ట్రాక్టర్ తతంగం, చంద్రబాబు ఫోన్ నేపథ్యంలో అమరావతిలో అలెర్ట్ అయిన అధికారులు ఈ విచారణను జరిపినట్టు తెలుస్తుంది.
ఇక ఆ తరువాత అయన సోషల్ మీడియాలో, కొన్ని మీడియా వర్గాల్లో నాగేశ్వర్ రావు పేదరైతు కాదు అని అనేక విషయాలు ప్రసారం అవ్వడం మొదలయింది. కొందరేమో ఆ కుటుంబానికి అందిన సంక్షేమ పథకాల లిస్టును విడుదల చేస్తే, మరికొందరేమో ఆయన గతంలో లోక్ సత్తా తరుఫున పోటీ చేసిన విషయాన్నీ గుర్తు చేస్తున్నారు.
ఆయనకు ట్రాక్టర్ అనవసరంగా ఇచ్చారని, సోనూసూద్ డబ్బు, సమయం అనవసరంగా వేస్ట్ అయ్యాయని, ఆ ట్రాక్టర్ ని గ్రామప్రాంచాయితీకి ఇచ్చేయాలని డిమాండ్లు కూడా వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ రైతు నాగేశ్వర రావును గురించిన విషయాలను ఒకసారి పరిశీలిద్దాము.
చిత్తూరు జిల్లా కేవీపల్లె మండలం మహల్‌రాజ్‌పల్లెకు చెందినవాడు నాగేశ్వర్ రావు. తల్లిదండ్రుల నుండి వచ్చిన రెండెకరాల మెత్త భూమి, ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన పక్కా ఇల్లు ఇతని ఆస్తిపాస్తులు. ఎస్సి సామాజికవర్గానికి చెందిన నాగేశ్వరరావు గురించిన విషయాలు.
విప్లవ భావాలూ కలిగిన నాగేశ్వర్ రావు హక్కుల కార్యకర్తగా కూడా పనిచేసాడు. ఆ తరువాత ఒక డెంటల్ హాస్పిటల్ లో పీఆర్వో గా పనిచేసి, ఆ తరువాత అన్ని కాదని ఒక టీ కొట్టు పెట్టుకున్నాడు. లాక్ డౌన్ తో కొట్టు మూతపడింది.
అధికార పక్షం చెప్పినట్టు 2009లో లోక్ సత్తా తరుఫున ఎన్నికల బరిలో నిలబడ్డాడు. "2009 ఎన్నికల్లో లోక్‌సత్తా పార్టీ తరపున పోటీ చేసినాను. వెయ్యికి పైగా ఓట్లు పడినాయ్. కానీ, ఆ ఎన్నికల్లో అసలు అభ్యర్థిని నేను కాదు. స్థానికంగా ఉండే మరో వ్యక్తికి పార్టీ టికెట్ వచ్చింది. ఆయన దగ్గర నెలకు 6వేల జీతంతో నేను పనిచేస్తాంటి. అసలు అభ్యర్థిగా ఆయనే నామినేషన్ ఏసినాడు. కానీ ఎన్నికల్లో పార్టీకి పెద్దగా ఓట్లు పడవని ఆయనకు అర్థమైంది. తక్కువ ఓట్లతో ఓడిపోవడం ఇష్టంలేక, డమ్మీ అభ్యర్థినైన నాకు ప్రచారం ఖర్చులకు 50వేలు డబ్బులిచ్చి, పోటీకి నిలబెట్టినాడు. అట్ల నేను రాజకీయ నాయకుడిని అయితి'' అని ఒక బీబీసీ ఇంటర్వ్యూ లో చెప్పాడు నాగేశ్వర రావు.
ఇక ఆయనకు సంక్షేమ పథకాలాలు అందుతున్నాయి అని కొన్ని మీడియా చానెళ్లు చెప్పినట్టు ఆయనకు అందాయి. రైతు భరోసా కింద నాగేశ్వర్ రావుకి డబ్బులు వచ్చినప్పటికీ.. అవి తన తల్లిదండ్రులకు ఇచ్చినట్టు చెప్పుకొచ్చాడు. అమ్మ ఒడి పథకం కింద వచ్చిన డబ్బుతోనే చిన్న బిఒడ్డ స్కూల్ ఫీజు కట్టనని, పెద్ద అమ్మాయి ఫీజు ఇంకా కట్టలేదని అన్నాడు.
వీడియో సంగతేమిటి..?
పొలాన్ని దున్నించడానికి గంటకు 200 రూపాయలను కిరాయిగా అడగగా, అంత డబ్బు చెల్లించే బదులు కూతుళ్లు నసహాయం చేసారని చెప్పుకొచ్చాడు. కూతుళ్లు కాదే లాగుతుండగా, నాగేశ్వర్ రావు అరక దున్నారు. భార్య విత్తనాలు చల్లింది. ఈ విషయాన్నీ ఒక బంధువు వీడియో తీసి వాట్సాప్ లో బంధు మిత్రులకు పంపించారు.
కష్టం అనకుండా తల్లిదండ్రులకు కూతుళ్లు సహాయం చేస్తున్నారు అని బంధువులతో పంచుకోవడానికి తీశారు ఈ వీడియో. ప్రభుత్వ అధికారులు చెప్పినట్టు పబ్లిసిటీ కోసం తీయలేదు. సోషల్ మీడియాలో పెట్టడానికి అసలే కాదు.
ఈ విషయం ఆనోటా ఈ నోటా పాకి వైరల్ గా అయింది. ఎవరో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా సోనూసూద్ వరకు వెళ్లడం ఆయన ట్రాక్టర్ ఇవ్వడం జరిగిపోయాయి. ఆ కొత్త ట్రాక్టర్ తో ఆ కుటుంబం ఇప్పుడు తమ వ్యవసాయ కార్యక్రమాలకు వాడడం మొదలుపెట్టింది కూడా
తాను పేదవాడిని కాబట్టే తన వద్దకు వచ్చిన మీడియా వారుసైతం వచ్చి ప్రశ్నలడిగి పోయారని, తాను ఎక్కడా ప్రభుత్వ సహాయం అందలేదని కానీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని అన్నారు. ట్రాక్టర్ వచ్చేసరికి, చంద్రబాబు తన కూతుర్లకు చదువు చెప్పేస్తాను అనేసరికి ఇప్పుడు తాను పేదవాడినో కాదో తెలుసుకోవడానికి అధికారులు సైతం వచ్చారు అని అన్నారు.
పేదవాడు కాబట్టే ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందుకుంటున్నాడు కదా. అతడు పేద వాడు ఎందుకు కాడో, ఎలా కాడో సోషల్ మీడియాలో వితండ వాదం చేస్తున్నవారికే తెలియాలి. ఆ అమ్మాయిలు లావున్నారు అంటే, వారికి వ్యవసాయం తెలిసి ఉండకపోవచ్చు. నాగేశ్వరరావు తన కూతుళ్లను పనికి దూరంగా చదివిస్తుండొచ్చు. నాగేశ్వర రావు కూడా డిగ్రీ చదివాడు. ఇలాంటి విషయాల్లో సైతం దూరి రాక్షసానందం పొందుతున్న సోషల్ మీడియాలోని ఒక వర్గాన్ని, ఈ వార్తలను పదే పదే ప్రసారం చేస్తున్న కొన్ని మీడియా చానెళ్లను ఏమనాలో కూడా అర్థం కావడంలేదు!