వినాయకుడి మండపానికి రూ.474 కోట్ల ఇన్సురెన్స్.. ఎక్కడో తెలుసా?
Richest Ganpati 2025 Insurance: ముంబై నగరంలోని అత్యంత సంపన్న గణేష్ మండలం జీఎస్‌బీ సేవా మండలం మరోసారి రికార్డు సృష్టించింది. ఈ సారి మండపానికి ఏకంగా ₹474.46 కోట్ల విలువైన భారీ ఇన్సూరెన్స్ చేయించారట.

అత్యంత సంపన్న గణేష్ మండలం
Richest Ganpati 2025 Insurance: దేశవ్యాప్తంగా గణేశ్ నవరాత్రి వేడుకల సందడి మొదలైంది. త్వరలో గణపతి బప్పా మోరియా నామస్మరణతో ఊరూవాడా మారుమోగబోతున్నాయి. అందంగా అలంకరించిన మండపాల్లో గణనాథులు కొలువుదీరి, పూజలు అందుకోబోతున్నారు. ఇదిలా ఉంటే.. దేశంలోనే అత్యంత ధనిక గణపతి మండపం మరోసారి వార్తల్లో నిలిచింది. రికార్డు స్థాయిలో బీమా చేయించుకుని కొత్త చరిత్ర సృష్టించింది. ఆ రిచెస్ట్ గణపతి మండపం ఎక్కడ ఉంది? ఎన్ని కోట్లకు బీమా చేసిందో తెలుసుకుందాం..
దేశవ్యాప్తంగా వేడుకలు
దేశవ్యాప్తంగా ఈనెల 27నుంచి గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే పట్టణాలు, గ్రామాల్లో పండుగ సందడి మొదలైంది. ప్రతి వీధిలోనూ వినాయక మండపాల ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. మండపాల ఏర్పాట్ల కోసం భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నారు. అయితే.. వినాయక చవితి అనగానే ముందుగా అందరికీ ముందుగా గుర్తుకొచ్చే నగరం ముంబై. అందులో ముఖ్యంగా కింగ్స్ సర్కిల్ ప్రాంతంలోని జీఎస్‌బీ సేవా మండల్ మరింత ప్రత్యేకం.
దేశంలోనే అత్యంత సంపన్న గణపతి
ముంబై మతుంగాలోని కింగ్స్ సర్కిల్‌లో ఉన్న జీఎస్‌బీ సేవా మండల్ ముంబైలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన గణేశోత్సవ మండలాల్లో ఒకటి, దీనిని గౌడ్ సరస్వత్ బ్రాహ్మణ సమాజం ప్రత్యేకంగా పూజిస్తుంది. ఈ విగ్రహాన్ని పర్యావరణ అనుకూల బంకమట్టితో తయారు చేస్తారు. సహజ రంగులతో పెయింట్ చేశారు.
ఈ గణపతే దేశంలోనే అత్యంత సంపన్న వినాయకుడు (Richest Ganpati)గా ప్రసిద్ధి పొందాడు. ఈ ఉత్సవ సమితి గత 70 ఏళ్లుగా నిర్వహిస్తుంది. ఈ ఏడాది కూడా ఆగస్టు 27 నుంచి 31 వరకు ఐదు రోజులపాటు ఘనంగా గణేశోత్సవాన్ని నిర్వహించనున్నారు. దేశంలోనే సంపన్న వినాయకుడు (Richest Ganpati)గా ప్రసిద్ధి చెందిన ఈ విఘ్నేశ్వరుడి వేడుకలకు ఈసారి 474.46 కోట్ల రూపాయల బీమా చేయించారని నిర్వాహకులు వెల్లడించారు.
రూ. 474.46 కోట్ల బీమా పాలసీలో ఏమి కవర్ చేయబడిందో?
గతేడాది ₹400 కోట్ల బీమాతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ మండపం, ఈసారి ఆ రికార్డును అధిగమించింది. బంగారం, వెండి ఆభరణాల విలువ పెరగడం, అదనంగా మరిన్ని స్వచ్ఛంద సేవకులు, పూజారులను చేర్చుకోవడం వల్ల ఈసారి ఇన్సూరెన్స్ కవరేజ్ పెరిగిందని నిర్వాహకులు వెల్లడించారు.
న్యూ ఇండియా అస్యూరెన్స్ అందించిన ఈ బీమా పాలసీలో మండపంలోని బంగారం, వెండి, విలువైన వస్తువులు, ఉత్సవాల్లో పాల్గొనే వాలంటీర్లు, పూజారులు, వంటవారు, పార్కింగ్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, అందరూ భీమా పరిధిలోకి వస్తారు. ఇదే కాకుండా ఈ ఐదు రోజుల గణేశ నవరాత్రి వేడుకల్లో మండపాన్ని దర్శించే ప్రతి ఒక్క భక్తుడూ బీమా కవరేజ్‌లో ఉంటారని నిర్వాహకులు స్పష్టం చేశారు.
బంగారం, వెండి, ఆభరణాలకు రూ.67 కోట్ల బీమా
ఇక్కడ గణపయ్యను భారీఎత్తున బంగారం, వెండి ఆభరణాలతో అలంకరించనున్నారు. గత ఏడాది ఈ మండపానికి రూ.400.58 కోట్ల బీమా కవర్ తీసుకున్నారు. ప్రస్తుతం పూజారులు, నిర్వాహకులు, సహాయకులు, భద్రతా సిబ్బందికి కలిపి రూ.375 కోట్ల వ్యక్తిగత ప్రమాద బీమా పొందారు. అలాగే గణపయ్యపై అలంకరించే బంగారం, వెండి, ఆభరణాలకు రూ.67 కోట్ల బీమా వర్తించనుంది. గతంలో ఈ మొత్తం 2023లో రూ. 360.40 కోట్లు,
ప్రత్యేక ఏర్పాట్లు..
అంతేకాదు అగ్నిప్రమాదం, భూకంపం వంటి విపత్తుల ముప్పు కోసం మరో రూ.2 కోట్ల ప్రత్యేక బీమా తీసుకున్నారు. ఫర్నీచర్, కంప్యూటర్లు, సీసీటీవీలు, స్కానర్లు కూడా ఇన్సూరెన్స్ పరిధిలో ఉన్నాయి. అదనంగా పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ కింద రూ.30 కోట్లు కేటాయించారు. భక్తుల సౌకర్యార్థం ఈసారి QR కోడ్ సేవలు, డిజిటల్ లైవ్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు. భద్రతా చర్యల్లో భాగంగా ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు.