- Home
- Andhra Pradesh
- Rain Alert: ముంచుకొస్తున్న తుపాను ముప్పు.. వచ్చే 5 రోజులు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
Rain Alert: ముంచుకొస్తున్న తుపాను ముప్పు.. వచ్చే 5 రోజులు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
Rain Alert: ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపారు.

అల్పపీడనం నుంచి తుపానుగా..
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. శనివారం నాటికి ఇది వాయుగుండంగా, ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారవచ్చని అంచనా. సోమవారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆ తర్వాత రెండు రోజుల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదిలే అవకాశం ఉందన్నారు. వాతావరణ వ్యవస్థ కదలికలు, తీవ్రతను బట్టి వర్షాలు, గాలుల ప్రభావంలో మార్పులు ఉండవచ్చని తెలిపారు.
శని, ఆదివారాల్లో ఈ జిల్లాల్లో వర్షాలు
అల్పపీడనం ప్రభావంతో శనివారం (అక్టోబర్ 24) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతంలోని జిల్లాల్లో వర్షాలు పడవచ్చని అంచనా వేశారు.
ఆదివారం (అక్టోబర్ 25) అల్లూరి సీతారామరాజు, పోలవరం, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాయలసీమ జిల్లాల్లోనూ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చన్నారు.
సోమవారం (అక్టోబర్ 26) రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. తుపాను దిశ, తీవ్రత ఆధారంగా తదుపరి రోజుల్లో కోస్తాంధ్రలో వర్షాలు పెరిగే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు.
మంగళ, బుధవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
మంగళవారం (అక్టోబర్ 27) ఉత్తరాంధ్రతో పాటు కోస్తాంధ్రలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చని అంచనా వేశారు. ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
బుధవారం (అక్టోబర్ 28) కూడా వర్షాల తీవ్రత కొనసాగవచ్చని APSDMA తెలిపింది. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చని పేర్కొన్నారు. గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలి
సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి తిరిగి రావాలని అధికారులు సూచించారు. తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరించారు. భారీ వర్షాలు కురిసే జిల్లాల్లో ప్రజలు అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, రైతులు వ్యవసాయ పనులు, పంటల సంరక్షణ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదిలా ఉండగా, శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. కర్నూలు జిల్లా దూదెకొండలో అత్యధికంగా 68 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దేవనకొండలో 52.1 మి.మీ., నంద్యాల జిల్లా సంజామలలో 41.99 మి.మీ., కర్నూలు జిల్లా లద్దగిరిలో 40.5 మి.మీ., మొలగవల్లిలో 39.6 మి.మీ., ఓర్వకల్లులో 39.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. నంద్యాల జిల్లా రామాపురంలో 35.5 మి.మీ., తిరుపతి జిల్లా బుచ్చినాయుడుకండ్రిగలో 35.2 మి.మీ., పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో 35.1 మి.మీ., ప్రకాశం జిల్లా ఉప్పమాగులూరులో 34.5 మి.మీ. వర్షం కురిసింది.
తుపాను పరిస్థితుల నేపథ్యంలో అత్యవసర సహాయం కోసం, వాతావరణ హెచ్చరికల సమాచారం తెలుసుకోవడానికి రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్‌ను సంప్రదించవచ్చు. ఇందుకోసం టోల్ ఫ్రీ నంబర్లు 112, 1070, 18004250101 అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.

