Pawan Kalyan: అసెంబ్లీలో TDP Vs జనసేనాని. అదిరిపోయే సమాధానమిచ్చిన పవన్ కళ్యాణ్
Pawan Kalyan: సాధారణంగా అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష, అధికార పార్టీల మధ్య వాగ్వాదాలు జరుగుతుంటాయి. అయితే తాజాగా జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన ఆసక్తికర సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది.

ఏపీ అసెంబ్లీలో హాట్ టాపిక్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో శుక్రవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బోండా ఉమ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై చేసిన ఆరోపణలు సభలో చర్చనీయాంశమయ్యాయి. అనంతరం పవన్ కల్యాణ్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
బోండా ఉమ ఆరోపణలు
పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ పీ. కృష్ణయ్యపై బోండా ఉమ తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ఎమ్మెల్యేలు పంపే లెటర్లను కృష్ణయ్య తేలికగా తీసుకుంటున్నారు. 30-40 ఏళ్లుగా ఇలాంటి నాయకులను చూశానని వ్యాఖ్యానిస్తున్నారు. కానీ ఆయన ఆ పదవిలో ఉండటానికి ప్రజలే కారణం, గెలిచిన ఎమ్మెల్యేలే కారణం" అని బోండా వ్యాఖ్యానించారు. కృష్ణయ్యను కలవాలంటే పవన్ కల్యాణ్‌ను సంప్రదించాలని, కానీ డిప్యూటీ సీఎం అందుబాటులో లేరని కూడా అంటున్నారని చెప్పుకొచ్చారు. ఇలాంటి వారిని నియంత్రించాల్సిన అవసరం ఉందంటూ ఉమ చెప్పుకొచ్చారు.
పవన్ అదిరిపోయే సమాధానం
బోండా ఉమ ఆరోపణలపై పవన్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. బొండ ఉమ చెప్పేకంటే ముందే దీనిపై తాను లోతుగా అధ్యయనం చేశానని చెప్పుకొచ్చారు. ఇందులో ఉద్యోగుల కొరత ఉందన్న విషయం తనకు అర్థమైందని పవన్ తెలిపారు. తాను అందుబాటులో ఉండనన్నది సరైంది కాదన్నారు. నిజానికి పీసీబీ (పొల్యుషన్ కంట్రోల్ బోర్డ్) పనితీరు పరిశ్రమలతోనే ఎక్కువ సంబంధం కలిగి ఉంటుంది. కృష్ణయ్య బాధ్యతలు చేపట్టిన తర్వాతే ప్రజల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ప్రారంభమైందని పవన్ చెప్పారు. పారిశ్రామిక వేత్తలపై ఒత్తిడి తేవడం సరికాదని, ప్రభుత్వం వద్ద పర్యావరణ రక్షణకు తగిన నిధులు లేవని ఆయన వివరించారు. కాలుష్య నియంత్రణ అనేది కేవలం పరిశ్రమల బాధ్యత కాదు, ప్రజలు, అధికారులు కూడా ఈ బాధ్యతను పంచుకోవాలని సూచించారు.
ప్లాస్టిక్ నిషేధంపై పవన్ వివరణ
రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం ఉన్నా క్షేత్రస్థాయిలో అమలు జరగడం లేదన్న పవన్ అసెంబ్లీలో కూడా అదే పరిస్థితి ఉందని గుర్తుచేశారు. ఫ్లెక్సీలను కూడా నిషేధించాలన్న ఆలోచనలో ఉన్నామని, అయితే వేల మంది ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. బయోడీగ్రేడబుల్ ఫ్లెక్సీలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
రాంకీ సంస్థపై చర్యలు
ఉప్పలపాడు పక్షుల కేంద్రానికి రక్షణ చర్యలు తీసుకుంటామని పవన్ తెలిపారు. గత ప్రభుత్వం కాలుష్య నియంత్రణ బోర్డులో ఎవరినీ నియమించలేదని, సిబ్బంది కొరత ఉందని గుర్తుచేశారు. రాంకీ సంస్థపై ఇప్పటికే షోకాజ్ నోటీసులు ఇచ్చామని, కానీ వెంటనే మూసేస్తే అనేక కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించడమే తమ లక్ష్యం అని పవన్ స్పష్టం చేశారు.
పర్యావరణ పరిరక్షణే నా లక్ష్యం
ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ సమస్యగా ఉందన్న పవన్.. ఎవ్రీరాన్‌మెంట్ విషయంలో తాను చాలా కమిట్‌మెంట్‌గా ఉంటానన్నారు. అయితే వాస్తవంగా చూస్తే మాత్రం పొల్యుషన్ లేకుండా ఏ పరిశ్రమ లేదని, పొల్యుషన్ కంట్రోల్ బోర్డ్ అనేది ఒక నియంత్రణ సంస్థలాగే ఉండాలని పవన్ అభిప్రాయపడ్డారు. పర్యావరణాన్ని ప్రథమ బాధ్యతగా తీసుకున్నామని సభ సాక్షిగా మాటిస్తున్నట్లు పవన్ చెప్పుకొచ్చారు. ప్రజల్లో కూడా అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రాంకీ ఒక్కటే కాదని ఇలాంటి సంస్థలు ఇంకా చాల ఉన్నాయన్నారు. పారిశ్రామికవేత్తలతో కూర్చొని మాట్లాడి సరైన చర్యలు తీసుకుంటామని పవన్ హామీ ఇచ్చారు. ప్రత్యేకంగా పర్యావరణం అంశంపై సభను నిర్వహించాలని పవన్ ఈ సందర్భంగా స్పీకర్‌ను కోరారు.