ఏపీ పంచాయితీ ఎన్నికలు: ఆరు సెగ్మెంట్లలో టీడీపీకి దక్కని చోటు
ఏపీ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ ఎన్నికల్లో టీడీపీకి ఆశించిన ఫలితాలు దక్కలేదు. చాలా చోట్ల ఆపార్టీ నేతలు చేతులెత్తేశారు.
గ్రామ పంచాయితీ ఎన్నికల్లో అధికార వైసీపీ సత్తా చాటింది. ఈ ఎన్నికల్లో టీడీపీ రెండో స్థానానికి పరిమితమైంది. అయితే చాలా చోట్ల ఆ పార్టీ సింగిల్ డిజిట్ కు మాత్రమే పరిమితమైంది. ఆ పార్టీకి కంచుకోటల్లాంటి స్థానాల్లో కూడ టీడీపీ ఘోర పరాజయాన్ని మూట గట్టుకొంది.
ఏపీ రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. గ్రామ పంచాయితీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులు ఘోర పరాజయాన్ని మూట గట్టుకొన్నారు. అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడడం వల్లే ఆ పార్టీకి ఎక్కువ స్థానాలు దక్కాయని టీడీపీ ఆరోపిస్తోంది.
తమ పార్టీకి చెందిన వారిని నామినేషన్లు వేయకుండా అడ్డుకొన్నారని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఆరోపించారు. కౌంటింగ్ సమయంలో అక్రమాలకు పాల్పడ్డారని కూడ ఆయన విమర్శలు గుప్పించారు.
కౌంటింగ్ కేంద్రాల్లో అక్రమంగా గెలుపును తమ ఖాతాలో వైసీపీ వేసుకొందని టీడీపీ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను వైసీపీ తీవ్రంగా ఖండించింది.
పుంగనూరు, మాచర్ల, పులివెందుల, జమ్మలమడుగు, నెల్లూరు రూరల్, అనంతపురం నియోజకవర్గాల్లో టీడీపీకి చెందిన మద్దతుదారులు ఒక్కరు కూడ విజయం సాధించలేదు.
మరోవైపు 39 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ సింగిల్ డిజిట్ కి మాత్రమే పరిమితమైంది. చంద్రగిరి, హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడ టీడీపీ సింగిల్ డిజిట్ కే పరిమితమైంది.
13,081 గ్రామపంచాయితీలకు నాలుగు విడతల్లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ కేవలం 2,100 పంచాయితీలను మాత్రమే గెలుచుకొంది. టీడీపీ మాత్రం తాము 4 వేలకు పైగా గ్రామపంచాయితీలను కైవసం చేసుకొన్నట్టుగా చెబుతోంది.
చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో ఆ పార్టీ కేవలం 14 చోట్ల మాత్రమే గెలుపొందింది. ఈ నియోజకవర్గంలో వైసీపీ అనుహ్యంగా పెద్ద ఎత్తున స్థానాలను కైవసం చేసుకొంది.
కడప జిల్లాలోని జమ్మలమడుగు, పులివెందుల నియోజకవర్గాల్లో టీడీపీ ఖాతా తెరవలేదు. గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ బోణి కొట్టలేదు.టీడీపీ కీలక నేతల స్వగ్రామాల్లో కూడ ఆ పార్టీ ఘోర పరాజయాన్ని మూట గట్టుకొంది.