- Home
- Andhra Pradesh
- అమ్మకానికి MRO ఆఫీస్.. జస్ట్ రూ. 20 వేలకే.. అసలు ట్విస్ట్ తెలిస్తే ఫ్యూజుల్ అవుట్
అమ్మకానికి MRO ఆఫీస్.. జస్ట్ రూ. 20 వేలకే.. అసలు ట్విస్ట్ తెలిస్తే ఫ్యూజుల్ అవుట్
Viral News: సోషల్ మీడియాతో మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది. ఖాళీగా ఏ పనిలేని వారికి ఇదొకి ప్రయోగశాలగా మారింది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ సంఘటన టెక్నాలజీని ఎంతలా దుర్వినియోగం చేయొచ్చో చెబుతోంది.

ప్రభుత్వ కార్యాలయం అమ్మకానికి అంటూ పోస్ట్
ప్రకాశం జిల్లాలో ఒక వింత ఘటన వెలుగు చూసింది. గిద్దలూరు తహశీల్దార్ కార్యాలయాన్ని ఓ వ్యక్తి ఓఎల్ఎక్స్‌లో విక్రయానికి పెట్టాడు. అది కూడా కేవలం 20 వేల రూపాయలకే. “ఎమ్మార్వో ఆఫీస్ ఫర్ సేల్” అంటూ పోస్ట్ పెట్టిన వెంటనే ఆ ప్రకటన సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యింది. సాధారణంగా వాడిన వస్తువులు, బైకులు లేదా ఇళ్లను ఓఎల్ఎక్స్‌లో విక్రయానికి పెడుతుంటారు. అలాంటి దాంట్లో అధికారిక ప్రభుత్వ భవనం కనిపించడంతో ప్రజలు ఆశ్చర్యపోయారు.
పోలీసులకు ఫిర్యాదు
ఈ విచిత్ర ప్రకటన గిద్దలూరు ఎమ్మార్వో ఆంజనేయ రెడ్డి దృష్టికి చేరింది. ప్రభుత్వ కార్యాలయాన్ని విక్రయానికి పెట్టడం అధికార వ్యవస్థను హాస్యాస్పదంగా చూపించే చర్య అని భావించిన ఆయన, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సైబర్ టీం సాయంతో ఆ పోస్ట్ చేసిన వ్యక్తి వివరాలు సేకరించడం ప్రారంభించారు.
హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తింపు
ప్రాథమిక దర్యాప్తులో ఓఎల్ఎక్స్‌లో అప్‌లోడ్ చేసిన ఫోటోలు, అకౌంట్ వివరాలను పరిశీలించిన పోలీసులు, ఆ పోస్టు వెనుక ఉన్న వ్యక్తి హైదరాబాద్‌లో ఉంటున్నట్టు తెలిసింది. తెలంగాణ పోలీసుల సహకారంతో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల దుర్వినియోగం
ఇదిలా ఉంటే.. ఇలాంటి ఘటనలు ఇదే తొలిసారి కావు. గతంలోనూ కొంతమంది తక్కువ ధరకే భూములు అని చూపిస్తూ ఓఎల్ఎక్స్‌లో నకిలీ ప్రకటనలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఫొటోలు, జీపీఎస్ మ్యాపులు, ఫోన్ నెంబర్లు అప్‌లోడ్ చేసి అమాయకుల్ని మోసగించే ప్రయత్నాలు కూడా వెలుగు చూశాయి. ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల పేరుతో పోస్టులు పెట్టడం టెక్నాలజీ దుర్వినియోగానికి పరాకాష్టగా చెప్పొచ్చు.
పోలీసుల హెచ్చరిక
గిద్దలూరు పోలీసులు ఈ ఘటనను అత్యంత సీరియస్‌గా తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల పేర్లు, చిహ్నాలను నకిలీ ప్రకటనల్లో వాడటం చట్టపరంగా శిక్షార్హమని స్పష్టం చేశారు. ఇలాంటి పోస్టులు వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏంటి? కార్యాలయాన్నే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాడు? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. సైబర్ శాఖతో కలిసి పూర్తిస్థాయిలో నిజాలు వెలికి తీయాలని పోలీసులు భావిస్తున్నారు.