నెరవేరనున్న మచిలీపట్నం- రేపల్లె రైల్వేలైన్ దివిసీమ వాసుల చిరకాల కోరిక: కేంద్రంతో ఎంపీ బాలశౌరి సంప్రదింపులు
మచిలీపట్నం- రేపల్లె రైల్వే లైన్ కోసం మచిలీపట్నం ఎంపీ బాలశౌరి చురుకైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రాంతీయ అభివృద్ధి, ప్రయాణ సౌలభ్యాన్ని పెంచడానికి దోహద పడుతుందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ అయిన బాలశౌరి.. ఈ ప్రాజెక్ట్‌ను వేగంగా పూర్తి చేసేందుకు నిధులు సమకూర్చాలని కోరారు.
కృష్ణా జిల్లాలో కీలక పార్లమెంటు నియోజకవర్గం మచిలీపట్నం. ఈ నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి గడిచిన ఐదేళ్లలో ఎంపీ వల్లభనేని బాలశౌరి అనేక విధాలుగా కృషి చేశారు. ఫలితంగా రెండోసారి కూడా అదే నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు.
రెండోసారి మచిలీపట్నం ఎంపీగా ఎన్నికైన నాటి నుంచి ఆ ప్రాంత సమస్యలు, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు బాలశౌరి. తమ పార్టీ జనసేన అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో మచిలీపట్నం ప్రాంతానికి కీలక ప్రాజెక్టులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు.
తాజా పార్లమెంటు సమావేశాల్లో మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని పలు రైల్వే ప్రాజెక్టుల అంశాన్ని లేవనెత్తారు ఎంపీ బాలశౌరి. ఆయా ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేసేందుకు కేంద్ర నిధులు సమకూర్చాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరారు. ముఖ్యంగా, మచిలీపట్నం - రేపల్లె రైల్వే లైన్ నిర్మాణం ఆవశ్యకతను వివరించారు.
balashowry
మంగళవారం ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రితో భేటీ అయిన ఎంపీ బాలశౌరి... మచిలీపట్నం పరిధిలోని పలు రైల్వే అభివృద్ధి పనులపై చర్చించారు. అలాగే, మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. ఇటీవల ప్రతిపాదించిన మచిలీపట్నం – నర్సాపురం రైల్వే లైను సర్వేకి సంబంధించిన అనుమతులు మంజూరు చేయడం అభినందనీయమన్నారు. ఈ రైల్వే లైన్ ని చిలకలపూడి, పల్లెపాలెం, బంటుమిల్లి, మాట్లాం మీదుగా ఏర్పాటు చేయాలని ఎంపీ కోరగా... దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.
మచిలీపట్నం- రేపల్లె రైల్వే లైను ఎంతో అవసరం..
మచిలీపట్నం – రేపల్లె రైల్వే లైను ఎప్పటి నుంచో డిమాండ్ ఉందని, ఈ లైను ఏర్పాటు చేస్తే దివిసీమ ప్రజల చిరికాల కోరిక తీరుతుందని ఎంపీ బాలశౌరి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కి వివరించారు. అదేవిధంగా ఇప్పుడున్న రైల్వే లైను ప్రకారం మచిలీపట్నం నుంచి వయా గుడివాడ, విజయవాడ, తెనాలి చేరుకోవాలంటే సుమారు 145 కిలోమీటర్లు ప్రయాణించాలన్నారు. అదే, మచిలీపట్నం- రేపల్లె రైల్వే లైను ఏర్పాటు చేస్తే కేవలం 45 కిలోమీటర్ల దూరంలో తెనాలి చేరుకుని అక్కడి నుంచి చెన్నై, తిరుపతి, ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సులువుగా ఉంటుందని ఎంపీ తెలిపారు.
మచిలీపట్నం – రేపల్లె రైల్వే లైను ఏర్పాటైతే సుమారు 100 కిలోమీటర్లు దూరం తగ్గటంతో పాటు విజయవాడ జంక్షన్ మీద ట్రాఫిక్ భారం పడకుండా ఉంటుందన్నారు. దీంతో పాటు గత ఏడాది సెప్టెంబర్‌లో నిలిపివేసిన మచిలీపట్నం- ధర్మవరం వయా తిరుపతి రైలును పునరుద్ధరించాలని ఎంపీ బాలశౌరి మరోసారి కోరారు. ఈ రైలును ఏర్పాటు చేస్తే మచిలీపట్నం ప్రాంత భక్తులు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలనుకునే కోరిక తీరుతుందన్నారు. గుడివాడ ప్రాంతంలోని వడ్లమన్నాడు గ్రామం, మచిలీపట్నంలో చిలకపూడి వద్ద రైళ్లను నిలుపుదల చేయాలని రైల్వే మంత్రిని ఎంపీ బాలశౌరి కోరారు.