Mohan Babu: మోహన్ బాబుకు గట్టి దెబ్బ.. వర్సిటీ గుర్తింపు రద్దవుతుందా.?
Mohan Babu: నటుడు మోహన్ బాబుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తిరుపతిలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీపై రెగ్యులేటరీ కమిషన్ చర్యలు తీసుకుంది. ఇంతకీ ఏం జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

అదనపు ఫీజుల వసూలుపై కమిషన్ దృష్టి
తిరుపతిలోని మోహన్ బాబు ప్రైవేట్ యూనివర్సిటీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మూడు సంవత్సరాలుగా విద్యార్థుల నుంచి నిర్ణయించిన దానికంటే ఎక్కువ ఫీజులు వసూలు చేసినట్టు గుర్తించిన ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (AP HEDRC) కఠిన చర్యలు తీసుకుంది. కమిషన్ పరిశీలనలో 2022-23 విద్యా సంవత్సరం నుంచి 2024 సెప్టెంబర్ వరకు సుమారు రూ.26.17 కోట్ల అదనపు వసూళ్లు జరిగినట్లు తేలింది.
రూ.15 లక్షల జరిమానా, రీఫండ్ ఆదేశం
ఈ అవకతవకల నేపథ్యంలో కమిషన్ యూనివర్సిటీపై రూ.15 లక్షల జరిమానా విధించింది. అలాగే అదనంగా వసూలు చేసిన మొత్తం మొత్తాన్ని విద్యార్థులకు 15 రోజుల్లో తిరిగి చెల్లించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని సెప్టెంబర్ 17న అధికారికంగా ప్రకటించి కమిషన్ వెబ్‌సైట్‌లో వివరాలను ఉంచింది.
తల్లిదండ్రుల అసోసియేషన్ ఫిర్యాదుతో
విద్యార్థుల తల్లిదండ్రుల అసోసియేషన్ నుంచి వచ్చిన ఫిర్యాదులు ఈ కేసుకు దారితీశాయి. వారు ఫీజు రీయింబర్స్‌మెంట్ అర్హులైన విద్యార్థుల నుంచీ కూడా అదనంగా వసూలు చేస్తున్నారని, హాస్టల్‌లో ఉండని వారికి కూడా మెస్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని వివరించారు. కమిషన్ ఈ ఫిర్యాదులను సీరియస్‌గా తీసుకుని ముగ్గురు సభ్యులతో ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
గుర్తింపు రద్దుకు సిఫార్సు
కమిషన్ యూనివర్సిటీలో జరిగిన అవకతవకలను ప్రస్తావిస్తూ.. దాని గుర్తింపును రద్దు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అదనంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC), AICTE, PCI, ICAR, NCAHP, హెల్త్‌కేర్ ప్రొఫెషన్స్ కౌన్సిల్‌లకు కూడా ఈ సిఫార్సులను పంపింది. దీనిపై తుది నిర్ణయం ప్రభుత్వం తీసుకోనుంది.
హైకోర్టు జోక్యం, తదుపరి విచారణ
కమిషన్ ఆదేశాలపై మోహన్ బాబు యూనివర్సిటీ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సెప్టెంబర్ 26న తాత్కాలికంగా మూడు వారాల స్టే ఇచ్చింది. కేసు తదుపరి విచారణ ఈ నెల 14న జరగనుంది. కాగా, యూనివర్సిటీ జరిమానా మొత్తాన్ని ఇప్పటికే చెల్లించినట్టు సమాచారం.