- Home
- Andhra Pradesh
- ఏ పనిలేనోడు పిల్లి తల గొరిగినట్లు .. ఆయనతో ఫోటో దిగాలని పడిగాపులు చూసినోళ్లు : వైసీపీ నేతలకు నాగబాబు కౌంటర్
ఏ పనిలేనోడు పిల్లి తల గొరిగినట్లు .. ఆయనతో ఫోటో దిగాలని పడిగాపులు చూసినోళ్లు : వైసీపీ నేతలకు నాగబాబు కౌంటర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. దీంతో చిరుపై ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. దీనికి మెగా కాంపౌండ్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. అయితే ఆయన సోదరుడు నాగబాబు ఈ వ్యాఖ్యలపై కౌంటరిస్తూ ట్వీట్ చేశారు.

nagababu
శ్రమని పెట్టుబడిగా పెట్టి, పన్నుని ప్రభుత్వానికి అనాపైసలతో సహా కట్టి, వినోదాన్ని విజ్ఞానాన్ని జనానికి పంచిపెట్టి , 24 క్రాఫ్ట్ లకి అన్నం పెడుతున్న ఏకైక పరిశ్రమ చిత్రపరిశ్రమ . ఏ పని లేనోడు పిళ్లి తల గొరిగినట్టు నిజం మాట్లాడిన వ్యక్తి మీద విషం కక్కుతున్నారు ఆంధ్రా మంత్రులు అంటూ దుయ్యబట్టారు.
nagababu
ఫోటో కోసం పడిగాపులు కాసినోళ్లు కూడా ఆయన మీద కారు కూతలు కూస్తున్నారని నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకాశం మీద ఉమ్మాలని చూస్తే మీ ముఖం మీదే పడుతుందని దుయ్యబట్టారు. మీ బతుక్కి మీ శాఖల మీద అవగాహన ఉండదని.. అభివృద్ధి అనేదానికి అర్ధమే తెలియదంటూ మెగాబ్రదర్ ఎద్దేవా చేశారు.
Nagababu - Pawan Kalyan
బటన్ నొక్కి కోట్లల్లో ముంచి వేలమందికి ఉచితాలు పంచడమే అభివృద్ధి అనుకుంటున్నారా అని నాగబాబు ప్రశ్నించారు. అభివృద్ధి చేయడానికి ఇంకేం మిగిలి లేదనుకుంటున్నారా అని ఆయన నిలదీశారు. మీ ఆలోచనలు ఎంత క్షీణించిపోయాయో అజ్ఞానంతో కూడిన మీ మాటలు వింటే అర్థం అవుతుందని నాగబాబు ఎద్దేవా చేశారు. మీ దౌర్భాగ్యపు దుర్మార్గపు పాలనకి ఎండ్ కార్డ్ దగ్గర్లోనే ఉందని ఆయన జోస్యం చెప్పారు. కాలం గాలమేస్తే ప్రకృతే శత్రువవుతుంది.. ఆరోగ్యాలు జాగ్రత్త అని నాగబాబు హెచ్చరించారు.
chiranjeevi
వాల్తేర్ వీరయ్య 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రభుత్వంపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్ట్‌లు, ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి ఆలోచించాలని .. పేదవారి కడుపునింపే దిశగా ఆలోచించాలని మెగాస్టార్ పేర్కొన్నారు. అంతేకానీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినీ పరిశ్రమపై పడతారా అంటూ చిరు ఆగ్రహం వ్యక్తం చేశారు.
roja
అంతకుముందు చిరంజీవికి కౌంటరిచ్చారు మంత్రి రోజా. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. హీరోలందరూ జగన్ దగ్గరకు ఎందుకెళ్లారని ప్రశ్నించారు. ఏ హీరో కూడా ప్రభుత్వాన్ని విమర్శించడం లేదని ఆమె గుర్తుచేశారు. రాష్ట్రం విడిపోతున్నప్పుడు చిరంజీవి ఏం చేశారని రోజా నిలదీశారు. హోదా గురించి చిరంజీవి అప్పుడెందుకు అడగలేదని మంత్రి ప్రశ్నించారు. కేంద్ర మంత్రిగా వుండి ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టారా అని నిలదీశారు.
roja
గడప గడపకు వచ్చి చూస్తే ఎన్ని రోడ్లు వేశామో తెలుస్తుందని రోజా పేర్కొన్నారు. చిరంజీవి చెబితే విని పనిచేసే పరిస్ధితిలో జగన్ లేరన్నారు. ఏ అర్హత వుందని సినిమా టికెట్ ధర పెంచమని అడిగారు అని ఆమె ఎద్దేవా చేశారు. సినిమా వేదికల మీద రాజకీయాలు ప్రస్తావించకూడదని రోజా చురకలంటించారు.
roja
చిరంజీవి ఎవరికైనా సలహాలు ఇవ్వాలనుకుంటే ముందుగా ఆయన తమ్ముడికి ఇవ్వాలని మంత్రి ఎద్దేవా చేశారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి చిరంజీవి లబ్ధి పొందారని, కానీ రాష్ట్రానికి చేసింది ఏం లేదన్నారు. సినిమా వాళ్లు చెబితే వినే స్థాయిలో తాము లేమని రోజా స్పష్టం చేశారు.