Janasena : జనసేన పార్టీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు..
'ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు కాని గుండెల నిండా ధైర్యం ఉంది'. ఇదీ.. పవన్ కళ్యాణ్ 2014 మార్చి 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలో చేసిన వ్యాఖ్యలు. జీరో నుంచి మొదలైన పవన్ కళ్యాణ్ జీవితం నేడు గేమ్ ఛేంజర్ స్థాయికి ఎదిగింది. 100 శాతం స్ట్రైయిక్ రేట్‌తో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. శుక్రవారం జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

పార్టీ స్థాపన, పార్టీ భావజాలం:
జనసేన పార్టీని పవన్ కల్యాణ్ 2014 మార్చి 14న స్థాపించారు. “సమాజంలో మార్పు కోసం రాజకీయాల్లోకి రావడం” అనే ఉద్దేశంతో పవన్ కల్యాణ్ ఈ పార్టీని ప్రారంభించారు. ప్రశ్నించే గొంతుక అంటూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ ఆ దిశగానే అడుగులు వేశారు.

Janasena Party
పార్టీ జెండా అర్థం:
జనసేన పార్టీ జెండాలో మధ్యలో ఎర్ర రంగు చక్రం ఉంటుంది. ఇది ధర్మచక్రంను సూచిస్తుంది. చుట్టూ ఉన్న తెలుపు రంగు సమానత్వాన్ని, నైతికతను సూచిస్తుంది.

పోటీకి దూరంగా:
జనసేన పార్టీ లక్ష్యం ప్రశ్నించడం మాత్రమే, అధికారం అంతిమ లక్ష్యం కాదని పలుసార్లు చెప్పిన పవన్ ఆ దిశగానే అడుగులు వేశారు. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత చాలా దాదాపు పదేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2014లో టీడీపీ-బీజేపీ కూటమికి మద్ధతు ప్రకటించారు. పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా, రాజకీయంగా విశేష ప్రాధాన్యత పొందింది. 2019లో తొలిసారి ప్రత్యక్ష పోటీలో నిలిచారు. 175 అసెంబ్లీ, 25 లోకసభ స్థానాల్లో పోటీ చేసింది. పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాక రెండు స్థానాల నుంచి పోటీ చేశారు, అయితే రెండింటిలోనూ ఓడిపోయారు. పార్టీ తరపున రాపాక వరప్రసాద్ ఒకే ఒక స్థానంలో విజయం సాధించారు (రాజోలు నియోజకవర్గం).

వైసీపీని ఓడించడమే లక్ష్యంగా:
తనకు అధికారం కంటే వైసీపీ అరాచక పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించడమే ముఖ్యమని పలుసార్లు పవన్ తెలిపారు. ఆ దిశగానే అడుగులు వేశారు. టీడీపీ-బీజేపీ పార్టీలు తిరిగి జతకట్టడం వెనకాల పవన్ కీలక పాత్ర పోషించారని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. అందుకే 2024 ఎన్నికల్లో సీట్ల విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా పవన్ వెనక్కి తగ్గలేదు. అందరికీ కలుపుకొని వెళ్లి కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు.

పవన్ ఇజంలో ఏముంది.?
జనసేన పార్టీని స్థాపించడానికి ముందు పవన్ కళ్యాణ్ ఇజం అనే పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకంలో సమాజంలోని అన్యాయాలు, ప్రజాస్వామ్య వ్యవస్థలో లోపాలు, రాజకీయ నాయకుల అవినీతిపై ఆయన తన అభిప్రాయాలను ప్రస్తావించారు. రాజకీయాల్లో ప్రజలే కేంద్ర బిందువు కావాలని పవన్ అభిప్రాయపడుతారు.

