- Home
- Andhra Pradesh
- IMD Rain Alert : ఆకాశంలో నల్లని మేఘాలు కమ్మేసి .. శుక్రవారం ఈ ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు తప్పవు
IMD Rain Alert : ఆకాశంలో నల్లని మేఘాలు కమ్మేసి .. శుక్రవారం ఈ ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు తప్పవు
IMD Rain Alert : ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ (శుక్రవారం) భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఏఏ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయంటే..

నేడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
IMD Rain Alert : వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. అల్పపీడనం బలహీనపడినా బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల మీదుగా ద్రోణులు కొనసాగుతుండటంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ (శుక్రవారం) కూడా ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రదేశ్ లో పలు జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు మెరుపులు, పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు, ప్రభుత్వాలు ప్రజలకు సూచిస్తున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు
ఆంధ్ర ప్రదేశ్ లో రాబోయే నాలుగు రోజులు ప్రమాదకరమైన వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ముఖ్యంగా దక్షిణకోస్తా, రాయలసీమలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. కేవలం వర్షాలే కాదు పిడుగుల ప్రమాదం కూడా ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద నిలబడరాదు... సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలని జాగ్రత్తలు సూచించారు.
నేడు ఈ ఏపీ జిల్లాల్లో వర్షాలు
ఇక ఇవాళ (శుక్రవారం) వర్షాల విషయానికి వస్తే... ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
గురువారం ఏపీలో అత్యధిక వర్షపాతం ఇక్కడే..
గురువారం తిరుపతి జిల్లా మల్లంలో 70మిమీ, కాకినాడ జిల్లా ఇంజరంలో 58మిమీ, తిరుపతి జిల్లా కోటలో 52.7మిమీ, ప్రకాశం జిల్లా గొల్లవిడిపిలో 52.2మిమీ, యర్రగొండపాలెంలో 49.7మిమీ, చిత్తూరు జిల్లా దామోదర మహారాజపురంలో 49మిమీ, కోనసీమ జిల్లా ఈతకోటలో 47మిమీ వర్షపాతం నమోదయిందని విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది.
నేడు తెలంగాణలో వర్షాలు
గత రెండుమూడు రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు ఇవాళ కూడా కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఉదయం ఆకాశం నిర్మలంగానే ఉండి ఎండ కాస్తుందని... మధ్యాహ్నం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపారు. ఇక సాయంత్రం మెళ్లిగా మొదలయ్యే వర్షం కుండపోతగా మారుతుందని హెచ్చరించారు. సాయంత్రం 5 గంటల తర్వాత రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం మొదలై రాత్రంతా కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది.
హైదరాబాద్ ను వీడని వర్షం
హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, నాగర్ కర్నూల్ లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. మిగతా జిల్లాల్లో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సెస్ ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
గురువారం హైదరాబాద్ లో అత్యధిక వర్షపాతం
గురువారం సాయంత్రం హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా జూపార్క్ ప్రాంతంలో 91.3 మిల్లిమీటర్ల వర్షం నమోదయ్యింది. ఇక దూద్ బౌలిలో 88.3 మి.మీ, బేగంబజార్ లో 80.3 మి.మీ, డబీర్ పురాలో 78 మి.మీ, చార్మినార్ లో 70.3 మి.మీ, ఎల్బినగర్ లో 67.3 మి.మీ వర్షపాతం నమోదయ్యింది.