- Home
- Andhra Pradesh
- Pawan Kalyan: 'అదే జరిగితే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా'.. డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు..
Pawan Kalyan: 'అదే జరిగితే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా'.. డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు..
Pawan Kalyan: కాకినాడ కలెక్టరేట్‌లో మత్స్యకార సంఘాన్ని ఉద్దేశించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మత్స్యకారులకు న్యాయం చేయడంలో విఫలమైతే.. రాజకీయాలను విడిచిపెడతానని ఆయన అన్నారు.

'రాజకీయాలు సైతం విడిచిపెడతా'
'నా చివరి రక్తపు బొట్టు వరకు ప్రజలకు సేవ చేస్తాను'.. 'న్యాయం అందించేందుకు అవసరమైతే రాజకీయాలు సైతం విడిచిపెడతా'.. ఇలాంటి డైలాగులు ఎప్పుడూ కూడా టిపికల్ పొలిటిషియన్ల నుంచి మనం వింటూ ఉంటాం. కానీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుంచి మాత్రం ఇప్పటిదాకా వినలేదు. అయితే ఆ లోటు కూడా తీరిపోయిందని చెప్పాలి. గురువారం కాకినాడ కలెక్టరేట్‌లో మత్స్యకార సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.
'మత్స్యకారులకు అండగా నిలుస్తా'
తీరప్రాంతాల వెంబడి ఉన్న గ్రామాల్లో నివాసముంటున్న మత్స్యకారుల ప్రయోజనాలను కాపాడతానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. స్థానిక మత్స్యకారుల జీవనోపాధి సమస్యలను హైలైట్ చేస్తూ, ఈ ప్రాంతంలోని దాదాపు 7,193 కుటుంబాలు పూర్తిగా చేపలు పట్టడంపై ఆధారపడి ఉన్నాయని డిప్యూటీ సీఎం గుర్తించారు. 'నేను మత్స్యకారులకు అండగా నిలుస్తానని.. వారి సంక్షేమాన్ని చూసుకుంటానని' ఆయన అన్నారు. అంతేకాదు తాను మత్స్యకారులకు న్యాయం చేయడంలో విఫలమైతే.. రాజకీయాలను విడిచిపెడతానని అన్నారు.
మత్స్యకారులకు పవన్ కళ్యాణ్ హామీ
తప్పుడు వాగ్దానాలు చేసే రాజకీయ నాయకుల ఉచ్చులో పడవద్దని ఆయన మత్స్యకారులను కోరారు. 'మీరు నన్ను తిడితే, నేను భరిస్తాను. మీరు నన్ను కొడితే, నేను పడతాను. మీ వెంటే ఉంటాను. నేను మీ కోసమే ఇక్కడ ఉన్నాను' అని మత్స్యకారులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తీరప్రాంతంలోని గ్రామాలను రక్షించేందుకు త్వరలోనే సముద్ర రక్షణ గోడను నిర్మిస్తామని ఆయన ఉప్పాడలోని మత్స్యకారులకు హామీ ఇచ్చారు.
ఉప్పాడ సముద్ర రక్షణ గోడ నిర్మాణం
ఉప్పాడ సముద్ర రక్షణ గోడను రూ. 323 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాలనే రాష్ట్ర ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఆయన అన్నారు. పారిశ్రామిక వ్యర్థాల వల్ల, ముఖ్యంగా దివిస్ లాబొరేటరీస్, అరబిందో ఫార్మా వంటి ప్రధాన ఔషధ సంస్థల నుంచి వచ్చే కాలుష్యాన్ని పవన్ కళ్యాణ్ తీవ్రంగా పరిగణించారు. ఆర్థికాభివృద్ధికి పరిశ్రమలు రాష్ట్రానికి చాలా అవసరమే అయినప్పటికీ, అవి సృష్టించే పర్యావరణ సమస్యలను పరిష్కరించడం కూడా అంతే తప్పనిసరి అని ఆయన అన్నారు.
కూటమి ప్రభుత్వం ఎజెండాలో..
'పారిశ్రామిక వ్యర్థాలను సముద్రంలోకి విడుదల చేసే ముందు వాటిని సరిగ్గా శుద్ధి చేయడంలో వైఫల్యం చెందితే తీవ్రమైన సమస్యగా మారుతుంది' అని పవన్ కళ్యాణ్ చెప్పారు. మత్స్యకారులకు పూర్తి న్యాయం చేయడానికి నిబద్ధతతో ఉన్నానని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఎజెండాలో మత్స్యకారుల సమస్యలకు తొలి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు.