బంగాళాఖాతంలో అల్పపీడనం: 3 రోజులు భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ హెచ్చరికలు
Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు
బంగాళాఖాతం వాయువ్య భాగంలో మరో అల్పపీడనం కారణంగా రాబోయే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్ లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది.
అమరావతి వాతావరణ కేంద్రం సమాచారం ప్రకారం.. సోమవారం నుంచి బుధవారం వరకు ఏపీలో వర్షాలు కురుస్తాయి. మోస్తారు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
KNOW
జిల్లాల వారీగా వర్షాల అంచనాలు
సోమవారం (ఆగస్టు 25) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు. మిగతా జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మంగళవారం (ఆగస్టు 26) పై జిల్లాలతో పాటు కాకినాడ, కోనసీమ, గోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. బుధవారం (ఆగస్టు 27) శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. అలాగే, గుంటూరు, బాపట్ల, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, నంద్యాల సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
రేపు వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని #APSDMA ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు.
దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తరు- భారీ వర్షాలు,మిగతా జిల్లాల్లో తేలికపాటి-మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. pic.twitter.com/j7G0tW2FdP— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) August 24, 2025
మత్స్యకారులకు హెచ్చరికలు.. ప్రజలకు జాగ్రత్తలు
బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనంతో భారీ వర్షాలతో పాటు ఉత్తరాంధ్ర తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సముద్రం ఉద్ధృతంగా ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.
భారీవర్షాల సమయంలో చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద నిల్చోవద్దని అధికారులు హెచ్చరించారు. అలాగే లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాగులు, కాలువలు దాటే సమయంలో పరిస్థితులకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
భారీ వర్షాలు.. రైతుల ఆందోళన
రాష్ట్రంలో గతవారం నుంచి వానలు దంచికొడుతున్నాయి. అల్పపీడనం వాయుగుండంగా మారి తీరాన్ని తాకడంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. దాంతో అనేక జిల్లాల్లో పంటలు నీటమునిగిపోయి రైతులు నష్టపోయారు.
కాస్త విరామం లభించిదనుకుంటున్న సమయంలో ఇప్పుడు మరో అల్పపీడనంతో మళ్లీ వర్షాలు వస్తాయన్న అంచనాతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరి, పత్తి, కంది వంటి పంటలు నష్టపోయే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు తెలిపారు.
జలాశయాలకు కొనసాగుతున్న వరద ప్రవాహం
ఇటీవల కురిసిన వానలతో రాష్ట్రంలోని జలాశయాలు నిండుకుండలా మారాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలకు వరద ప్రవాహం వస్తూనే ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో వరద నీటి ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం 4.65 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా, 4.72 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.
నాగార్జునసాగర్‌కు కూడా భారీగా వరద నీరు చేరుతోంది. మరోవైపు గోదావరి వరద తగ్గుముఖం పట్టినప్పటికీ, కోనసీమలో లోతట్టు ప్రాంతాలపై ప్రభావం పడింది. ఈ పరిస్థితుల మధ్య మరో అల్పపీడనంతో రాబోయే మూడు రోజులు ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలు భారీ వర్షాల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.