- Home
- Andhra Pradesh
- Thalliki Vandanam: తల్లికి వందనం పథకం డబ్బులు ఇంకా రాలేదా.. పొరపాటున కూడా ఈ తప్పు చేయోద్దు!
Thalliki Vandanam: తల్లికి వందనం పథకం డబ్బులు ఇంకా రాలేదా.. పొరపాటున కూడా ఈ తప్పు చేయోద్దు!
తల్లికి వందనం డబ్బులు రాలేదని ఫేక్ ఫోన్ కాల్స్‌తో మహిళలను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లపై పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

"తల్లికి వందనం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లులకు గౌరవంగా చేపట్టిన "తల్లికి వందనం" పథకం తాజాగా మోసాల చెరలో పడుతోంది. పాఠశాలలో చదువుతున్న పిల్లల తల్లుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ.13,000 చొప్పున జమ చేసింది. ఈ మద్దతుతో ఎన్నో కుటుంబాలు ఉపశమనం పొందాయి. కానీ అందరికీ ఈ మొత్తాలు అందకపోవడం వల్ల కొంతమంది మోసగాళ్లకు అవకాశమైంది.
అకౌంట్ అప్‌డేట్
తాజాగా కొన్ని జిల్లాల్లో తల్లికి వందనం డబ్బులు రాలేదని చెప్పి మహిళలకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. కాల్ చేసిన వ్యక్తులు తమను బ్యాంక్ ఉద్యోగులుగా లేదా ప్రభుత్వ ప్రతినిధులుగా పరిచయం చేసుకుంటున్నారు. ఖాతా హోల్డ్‌లో ఉందని, అకౌంట్ అప్‌డేట్ చేయాలంటూ భయపెట్టి మహిళల నుంచి వ్యక్తిగత సమాచారం తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో బ్యాంక్ అకౌంట్ నంబర్, డెబిట్ కార్డ్ వివరాలు, ఓటీపీలు కూడా అడుగుతున్నారు.ఈ వివరాలన్నీ ఇచ్చిన వెంటనే ఖాతాల్లో ఉన్న మొత్తం డబ్బులు మాయం అవుతున్నట్లు బాధితుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలా మోసపోతున్నవారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల మహిళలు కావడం ఆందోళన కలిగించే విషయం.
హెచ్చరికలు, సూచనలు
ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పోలీసులు ప్రజలకు కొన్ని హెచ్చరికలు, సూచనలు చేశారు. తల్లికి వందనం డబ్బులు మీ ఖాతాలో పడలేదంటే వెంటనే సంబంధిత గ్రామ సచివాలయాన్ని సంప్రదించండి. అసలు ప్రభుత్వం నుంచి ఎవరూ ఫోన్ చేసి బ్యాంకు వివరాలు అడగరని గుర్తుంచుకోండి. బ్యాంకు ఉద్యోగులు లేదా ప్రభుత్వం ఏ పరిస్థితుల్లోనూ OTP, డెబిట్/క్రెడిట్ కార్డ్ నంబర్లు అడగరు.వాట్సాప్ లేదా మెసేజ్ రూపంలో వచ్చే లింకులు, అప్లికేషన్లను క్లిక్ చేయవద్దు. APK ఫైళ్లను డౌన్‌లోడ్ చేయడం చాలా ప్రమాదకరం. స్క్రీన్ షేర్ చేయమంటూ వచ్చే విజ్ఞప్తులకు లొంగవద్దు. ఇవన్నీ మల్వేర్ లేదా ఫిషింగ్ టెక్నిక్స్ కావచ్చు. ఒకవేళ ఏమైనా అనుమానం ఉన్నా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి.
లింకులు షేర్ చేస్తూ
సైబర్ మోసానికి గురయ్యారనిపిస్తే వెంటనే 1930 అనే నంబర్‌కు ఫోన్ చేయండి లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చు. ఈ మార్గాల ద్వారా మీరు మీ డబ్బులను కొంతవరకు రికవర్ చేసుకునే అవకాశం ఉంటుంది.మరోవైపు, తల్లికి వందనం పథకం పేరుతో వేరే లింకులు షేర్ చేస్తూ పక్కాగా ప్రభుత్వ వెబ్‌సైట్‌లలా కనిపించే ఫేక్ పోర్టల్స్ తయారు చేస్తున్నారు మోసగాళ్లు. ఈ పోర్టల్స్‌లో వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేయాలని సూచిస్తూ మెసేజ్‌లు పంపిస్తున్నారు. అందులో వివరాలు నింపగానే ఖాతా ఖాళీ చేస్తారు.
డీటెయిల్స్ చెప్పొద్దు
ఇలాంటి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు వాటిని లిఫ్ట్ చేయకుండా నిర్లక్ష్యం చేయడం మంచిది. నిజంగా డబ్బులు పడలేదా అన్న సందేహం ఉంటే మీ పిల్లల పాఠశాల లేదా గ్రామ సచివాలయాన్ని సంప్రదించండి. నేరుగా అధికారిక వేదికలకే వెళ్లండి. ఏదైనా సందేహం వస్తే మీ గ్రామ వలంటీర్, సచివాలయం, విద్యాశాఖ అధికారులతో మాట్లాడండి.ఇలాంటి మోసాల పట్ల ఇంట్లో పిల్లల్ని కూడా అప్రమత్తం చేయండి. వాళ్లకు తెలియకుండా ఫోన్ వస్తే పర్సనల్ డీటెయిల్స్ చెప్పొద్దని బోధించండి. కొందరు తల్లికి వందనం డబ్బుల పేరుతో మహిళలతో పాటు వారి కుటుంబాలను కూడా టార్గెట్ చేస్తుండటం గమనార్హం.
మోసాలకు పాల్పడడం
ముఖ్యంగా పాఠశాల విద్యార్థుల తల్లులు, గ్రామీణ మహిళలు ఇటువంటి మోసాలకు గురవుతుండటంతో వారికి అవగాహన కల్పించాలన్నది పోలీసుల సూచన. డిజిటల్ ప్రపంచంలో వ్యక్తిగత సమాచారాన్ని ఎలా కాపాడుకోవాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.తల్లికి వందనం పథకం నిజంగా ఎంతో మందికి ఉపశమనాన్ని కలిగించింది. కానీ అదే పేరును వాడుకుంటూ కొందరు మోసాలకు పాల్పడడం బాధాకరం. అందుకే ఈ పథకం ద్వారా మీ ఖాతాలో డబ్బులు రాలేదని ఎవరో ఫోన్ చేస్తే లేదా మెసేజ్ వస్తే వెంటనే అప్రమత్తమై అధికారిక సమాచారం కోసం మాత్రమే చర్యలు తీసుకోవాలి.