వివాహేతర సంబంధం : దూరం పెట్టిందని.. మహిళపై యాసిడ్ దాడి !
వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ తనను దూరం పెడుతోందన్న కక్షతో ఓ వ్యక్తి ఆమె మీద యాసిడ్ దాడికి పాల్పడ్డాడు.

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా జిల్లాలో యాసిడ్ దాడి ఘటన కలకలం రేపింది. ఓ ఆటో డ్రైవర్ వితంతు మహిళపై యాసిడ్ పోశాడు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో ఆ మహిళతో సహా ఓ బాలుడు, యువతి కూడా గాయాల పాలయ్యారు.
ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు కొద్ది గంటల్లోనే నిందితుడిని గాలించి పట్టుకున్నారు. అతడిని అరెస్టు చేశారు. యాసిడ్ దాడి ఘటనకు సంబంధించిన వివరాలను ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టికె రానా తెలిపారు.. దీనిప్రకారం ఓ 28 ఏళ్ల మహిళ ఐతవరం గ్రామ నివాసి. ఆమెకు వివాహమై 8 ఏళ్లయింది. ఒక కొడుకు ఉన్నాడు.
పెళ్లయిన కొద్ది సంవత్సరాలకి భర్త మరణించడంతో ఆమె ఐతవరంలోని తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఉంటుంది. ఈ క్రమంలో ఎనిమిది నెలల క్రితం నెల్లూరుకు చెందిన రాణింగారం మణిసింగ్ (32)తో ఫేస్బుక్లో ఫ్రెండ్షిప్ ఏర్పడింది.
మణిసింగ్ నెల్లూరులో ఆటో నడుపుతుంటాడు. అతనికి అంతకుముందే వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వితంతు మహిళకు, మణిసింగకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆ మహిళ ఐతవరంలోనే వేరే ఇల్లు తీసుకుని ఉంటుంది.
ఆ తర్వాత మణిసింగ్ తరచుగా ఆమె ఇంటికి వస్తుండేవాడు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ సమయంలో మణిసింగ్ కు క్షయవ్యాధి వచ్చింది. ఆ విషయం తెలిసిన మహిళా అతడిని దూరం పెట్టింది. దీంతో మణిసింగ్ ఆమె మీద కక్ష పెంచుకున్నాడు. చంపేయాలనుకున్నాడు. దీంట్లో భాగంగానే ఈనెల 8వ తేదీ శనివారం నాడు నెల్లూరులో ఓ యాసిడ్ బాటిల్ కొన్నాడు.
ఆ తర్వాత మణిసింగ్ యాసిడ్ బాటిల్ తో ఆ మహిళ ఇంటికి వచ్చాడు. అతని ఇంటికి వచ్చే సమయానికి మహిళ కొడుకుతో పాటు, సోదరి కుమార్తె కూడా ఉన్నారు. ఏమీ తెలియనట్టుగానే మణిసింగ్ వారందరితో కలిసి సమయం గడిపాడు. భోజనం చేసి అక్కడే నిద్రపోయాడు. ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉండగా.. మణిసింగ్ తన వెంట తెచ్చుకున్న యాసిడ్ బాటిల్ ని ఆ మహిళ ముఖం మీద కుమ్మరించి.. అక్కడ నుంచి పరారయ్యాడు.
নেপথ্যে পরকীয়া, একসঙ্গে আত্মত্যার চেষ্টা দেওর-বউদির
వెంటనే తేరుకున్న ఆ మహిళ నొప్పితో కేకలు వేయగా.. గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే ఆమెని ఆసుపత్రికి తరలించారు. యాసిడ్ దాడిలో మహిళ శరీరం 20% గాయపడింది.. ఆమె కొడుకు, సోదరి కూతుర్లకి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలవడంతో నందిగామ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఆ తర్వాత నిందితుడు మణిసింగ్ కోసం గాలించి… నందిగామ శివారు ప్రాంతంలో ఉదయం 10 గంటలకల్లా అరెస్టు చేశారు. మణిసింగ్ పై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు.
యాసిడ్ దాడి ఘటనపై మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. గాయపడిన వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. బాధితులు గొల్లపూడి ఆంధ్ర హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం నాడు వారిని పరామర్శించిన వాసిరెడ్డి పద్మ వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. యాసిడ్ దాడి బాధితులను స్థానిక ఎమ్మెల్యే జగన్మోహరావు కూడా పరామర్శించారు.