వివాహేతర సంబంధం : భార్యపై అనుమానం.. అత్తను కత్తితో నరికి చంపిన అల్లుడు...
భార్యకు వివాహేతర సంబంధం ఉందనిఅనుమానించిన భర్త.. అత్త మీద కత్తితో దాడిచేసి హత్య చేశాడు. భార్యకూ తీవ్ర గాయాలయ్యాయి.

తూర్పు గోదావరి : ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. భార్య మీద అనుమానంతో అత్తను హతమార్చాడు ఓ వ్యక్తి. భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు ఓ భర్త. దీంతో ఆమె మీద కత్తితో దాడి చేశాడు. ఈ దాడిని అడ్డుకోవడంతో అత్తకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అక్కడికక్కడే మృతి చెందింది. భార్య తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆదివారం ఈ ఘటన కొత్తపల్లి మండలం నాగులపల్లి శివారు ఉప్పరగూడెంలో చోటు చేసుకుంది.
దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. దండు సింహాచలం, దండు శ్రీను.. భార్యాభర్తలు. వీరికి ఎనిమిదేళ్ల క్రితం వివాహమయ్యింది. ముగ్గురు ఆడపిల్లలు సంతానం. కాగా గత మూడేళ్లుగా భర్త శ్రీనుకు.. సింహాచలం మీద అనుమానం ఏర్పడింది. ఈ విషయంలోనే తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి.
భార్యకు వివాహేతర సంబంధం ఉందని శ్రీను అనుమానించేవాడు. దీంతో సింహాచలం అత్తగారు ఊరైన ఒమ్మంగి నుంచి ఉప్పరగూడెం తల్లిగారి ఇంటి దగ్గర్లో కాపురం పెట్టారు. అప్పటికి అనుమానం తీరని శ్రీను రోజూ గొడవ పడుతుండేవాడు. రెండు నెలల క్రితం ఉపాధి కోసం శ్రీను హైదరాబాద్కు వచ్చాడు. ఇటీవలే ఇంటికి తిరిగి వెళ్ళాడు. అప్పటి నుంచి భార్య మీద వేధింపులు మరింత ఎక్కువయ్యాయి.
ఈ విషయం గ్రామ పెద్దల దగ్గరికి వెళ్లినా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో సింహాచలం రెండుసార్లు శ్రీను మీద కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో పోలీసులు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అయినా కూడా శ్రీనులో మార్పు లేదు. రాత్రి కూడా బయటికి వెళ్తున్నానని చెప్పి ఇంటి దగ్గర్లో మాటు వేసి.. గమనిస్తూ ఉండేవాడు.
అది చూసిన చుట్టుపక్కల వారు ఎందుకలా చేశావంటే ఏం చెప్పకుండా వెళ్ళిపోయేవాడు. ఆ తర్వాత ఎవరో వచ్చారు ఇంటికి అంటూ భార్యతో గొడవ పెట్టుకునేవాడు. ఈ క్రమంలోనే భార్యను చంపేయాలని నిర్ణయించుకున్నాడు శీను. దీని కోసం వారం రోజుల క్రితమే కత్తిని తయారు చేయించి తెచ్చుకున్నాడు. రాత్రి పూట కత్తి దగ్గర పెట్టుకుని పడుకునే వాడు.
ఈ క్రమంలో ఈ విషయం అత్త రాణి పక్కింటి వారితో తన అల్లుడు గురించి చెప్పి బాధపడుతుండడం విన్నాడు. దీంతో కోపంగా భార్యపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. అత్త తన పరువు తీస్తుందని భార్య మీద కత్తితో దాడికి దిగాడు. కత్తి పట్టుకుని ఆమె వెంట పడ్డాడు. ఆమె మీద కత్తితో దాడి చేయగా చెయ్యి తెగిపోయింది. అది చూసిన అత్త అడ్డుకునే ప్రయత్నం చేసింది.
దీంతో ఆమె మీద కూడా విచక్షణ రహితంగా కత్తితో దాడి చేశాడు శ్రీను. ఆ దాడిలో తీవ్ర గాయాలు కావడంతో రాణి అక్కడికక్కడే మృతి చెందింది. ఇదంతా గమనిస్తున్న స్థానికులు వెంటనే శీనును అడ్డుకోవడంతో… తీవ్ర గాయాలతో భార్య సింహాచలం బయటపడింది. అయితే శీను వారెవరికి దొరకకుండా కత్తి చూపి బెదిరిస్తూ చంపేస్తానంటూ భయపెట్టే అక్కడ నుంచి పారారయ్యాడు.
వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. ఘటన స్థలానికి చేరుకున్న వారు తీవ్రంగా గాయపడిన భార్యను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భార్య ఫిర్యాదు మేరకు నిందితుడి మీద కేసు నమోదు చేసుకొని అతని కోసం గాలింపు చేపట్టారు.