Weather: మండుటెండలో కూల్ న్యూస్.. ఈ ప్రాంతంలో వర్షం కురిసే అవకాశం.
మార్చి నెల ఇలా మొదలైందో లేదో ఎండలు అలా దంచికొడుతున్నాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. అయితే ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ ఒక కూల్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆంధ్రప్రదేశ్‌లో భిన్నమైన వాతావరణం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే.. 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజుల్లో వాతావరణం ఎలా ఉండనుంది.? వాతావరణ శాఖ వేస్తున్న అంచనాలు ఏంటంటే.
తమిళనాడు తీరానికి దగ్గరగా నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి సగటుగా 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. సోమవారం హిందూ మహాసముద్రం నుంచి నైరుతి బంగాళాఖాతం దాకా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బుధవారం బలహీనపడింది. దిగువ వాయు మండలంలో గాలుల దిశలో మార్పులు కనిపిస్తున్నాయి. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం ప్రాంతాల్లో గాలులు నైరుతి దిశగా వీస్తుండగా, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలలో తూర్పు, ఆగ్నేయ దిశలవైపు గాలుల ప్రభావం కనిపిస్తోంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో మూడు రోజులు వాతావరణ సూచన ఎలా ఉండనుందంటే.
రాయలసీమ:
వాతావరణంలో మార్పుల కారణంగా రాయలసీమలో వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మంగళవారం, బుధవారం రాయలసీమలో ఒకటి లేదా రెండు చోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలో పెద్దగా మార్పు ఉండే అవకాశం లేదు.
ఉత్తర కోస్తా – యానాం:
ఉత్తరకోస్తాతో పాటు యానంలో ఈ మూడు రోజులు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. మంగళవారం, బుధవారం, గురువారం పొడి వాతావరణం ఉండి, గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:
ఈ ప్రాంతంలో మంగళవారం, బుధవారం, గురువారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. అలాగే ఈ ప్రాంతంలో 2 నుంచి 3 డిగ్రీల సెంట్రీగ్రేడ్ ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.