కాపు నేతలకు బీజేపీ వల: ఏపీలో కమల దళం వ్యూహాం
ఏపీ రాష్ట్రంలో రాజకీయంగా బలపడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు అన్ని రకాల శక్తులను బీజేపీ నాయకత్వం చేస్తోంది. కాపు నేతలకు బీజేపీ వల విసురుతోంది.
ఏపీ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకొనేందుకు గాను బీజేపీ నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గంతో పాటు ఇతర పార్టీల్లోని కీలక నేతలకు బీజేపీ గాలం వేస్తోంది.
2019 ఎన్నికల్లో బీజేపీకి ఒక్క స్థానం కూడ దక్కలేదు. 2024లో ఏపీలో జరిగే ఎన్నికలపై బీజేపీ ఇప్పటినుండే ప్లాన్ చేస్తోంది. జనసేనతో కలిసి ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనుంది.
జనసేనతో పొత్తు రాజకీయంగా తమకు కలిసివచ్చే అవకాశం ఉందని కమలదళం భావిస్తోంది. 2014లో బీజేపీ, టీడీపీ కూటమికి జనసేన మద్దతు ప్రకటించింది.
2019 ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకొంది. అయితే బీజేపీ, టీడీపీలు వేర్వేరుగా పోటీ చేశాయి.
రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ఆర్‌సీపీకి తామే ప్రత్యామ్నాయమని బీజేపీ చెబుతోంది. ఈ క్రమంలోనే టీడీపీ సహా ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలకు బీజేపీ వల విసిరుతోంది.
రాష్ట్రంలో కాపు రిజర్వేషన్ పోరాటంలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో ఈ నెల 16న బీజేపీ ఏపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు భేటీ అయ్యారు.
ముద్రగడ పద్మనాభాన్ని బీజేపీలో చేరాలని సోము వీర్రాజు కోరినట్టుగా సమాచారం. ఇద్దరు నేతల మధ్య సుధీర్ఘంగా చర్చలు జరిగాయి. ముద్రగడ పద్మనాభానికి కాపు సామాజిక వర్గంలో ఇమేజ్ ఉంది.
ఆయనను పార్టీలో చేర్చుకోవడం ద్వారా రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగనే సోము వీర్రాజు ఆయనతో భేటీ అయ్యారని సమాచారం.
ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ స్థానాలుంటాయి.ఈ జిల్లాలో అధిక స్థానాలను గెలుచుకొంటే రాజకీయంగా ప్రయోజనం దక్కుతోందని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగానే ముద్రగడ పద్మనాభానికి బీజేపీ వల వేస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు ఉత్తరాంధ్రలో కూడ బీసీ సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతలపై కూడ బీజేపీ వల విసురుతోంది.టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావుతో కూడ సోము వీర్రాజు భేటీ అవుతారని ప్రచారం సాగింది.
తాను బీజేపీలో చేరే ప్రసక్తే లేదని టీడీపీ మాజీ చీఫ్, ఏపీ మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు చెప్పారు. టీడీపీకి చెందిన మాజీ మంత్రి పడాల అరుణ బీజేపీలో చేరే అవకాశం ఉంది. టీడీపీ ఆమెను పక్కన పెట్టడంతో పడాల అరుణ బీజేపీలో చేరనుంది. పడాల అరుణతో సోము వీర్రాజు, పురంధేశ్వరీ చర్చించినట్టుగా తెలుస్తోంది.
ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి కాపు సామాజిక వర్గానికి చెందిన గంటా శ్రీనివాసరావుపై బీజేపీ ఫోకస్ పెట్టిందనే ప్రచారం కూడ లేకపోలేదు. గంటా శ్రీనివాసరావు బీజేపీలో చేరితే ఆయనతో పాటు కొందరు టీడీపీ నేతలు బీజేపీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.
విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సుజయ కృష్ణరంగారావుకు బీజేపీ వల విసురుతోందని ప్రచారంలో ఉంది. గత ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత సుజయ కృష్ణరంగారావు నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. గంటా శ్రీనివాసరావు పార్టీ మారితే ఆయనతో పాటు మీసాల గీత కూడ పార్టీ మారే అవకాశం లేకపోలేదనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ ప్రాంతాల్లోని కీలక నేతలను తమ వైపునకు తిప్పుకోవడం ద్వారా రాజకీయంగా లబ్ది పొందొచ్చని కమల దళం ప్రయత్నిస్తోందని సమాచారం.