ఒక్క రూపాయికే బిర్యానీ.. ఆ నోటుతో వెళ్తేనే.. ఎక్కడంటే...
మీ దగ్గర పాత రూపాయి నోటు ఉందా? అయితే దాంతో బిర్యానీ కొనొచ్చు. అవును ఒక్క పాత రూపాయి నోటుకు బిర్యానీ ఇచ్చింది మార్కాపూర్ లోని ఓ రెస్టారెంట్.

మార్కాపురం : బిర్యానీ అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి. వందలాడి రెస్టారెంట్లు కొత్తగా పుట్టుకొస్తున్నా బిర్యానీ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. కిలోల కొద్ది బిర్యానీని హాంఫట్ చేస్తారు. బిర్యానీకి ఉండే డిమాండ్ అలాంటిది. ఇకపోతే బిర్యానీ తినాలంటే.. కనీసం ఓ రూ.200 అన్న జేబులో ఉండాల్సిందే. రెస్టారెంట్ ను బట్టి, బిర్యానీ వెరైటీని బట్టి.. ప్రాంతాన్ని బట్టి ఈ రేటులో తేడా ఉంటుంది. అయితే, ఎక్కడైనా ఒక రూపాయికి బిర్యానీ దొరకడం విన్నారా? అలా ఎవరైనా ఒక రూపాయికి బిర్యాని అందించడం సాధ్యమవుతుందా?
ఈ అసాధ్యాన్నే మార్కాపురంలోని ఓ రెస్టారెంట్ సాధ్యం చేసింది. గురువారం మార్కాపురంలోని ఓ ప్రైవేట్ రెస్టారెంట్ ఒక రూపాయికే దమ్ బిర్యాని అని చెప్పడంతో జనాలు విపరీతంగా ఎగబడ్డారు. ఇంతకీ విషయం ఏంటంటే ఆ రెస్టారెంట్ ను కొత్తగా ప్రారంభిస్తున్నారు. దీంతో స్వామికార్యం.. స్వకార్యం లాగా .. ప్రచారంలో భాగంగానే అనుకోండీ.. ఇలా వెరైటీగా ట్రై చేశారు.
ఈ ఒక్క రూపాయి కండిషన్ లో కూడా మరో ట్విస్ట్ పెట్టారు. రూపాయి అన్నారు కదా అని ఏదో ఒకటి రూపాయి తీసుకుపోతే కుదరదు. పాత రూపాయి నోటు మాత్రమే తీసుకెళ్లాలి. ఆ రూపాయి నోటుకు దమ్ బిర్యాని అని ప్రకటించారు. దీంతో పాత రూపాయి నోటుతో జనాలు ఎగబడ్డారు.ఒకేసారి పెద్ద ఎత్తున జనం రావడంతో అక్కడ ఒత్తిడి ఎక్కువయ్యింది.
రెస్టారెంట్ వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువగా జనాలు రావడంతో తాకిడి తట్టుకోలేక మధ్యాహ్నం వరకు బిర్యానీ పంపిణీ చేసి ఆ తర్వాత నిలిపివేశారు. దీంతో.. తోపులాట పెరిగిపోయింది. ఈ గొడవ కారణంగా మార్కాపురం-కంభం రహదారిపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. గురువారం ఈ హడావుడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.